Share News

ఎవరికి ‘వార్‌’

ABN , Publish Date - Feb 01 , 2026 | 01:14 AM

వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతుల రగడ మొదలైంది. ఉన్నతాధికారులకు, ఉద్యోగుల సంఘ నేతలకు మధ్య వార్‌లో పదోన్నతులు రావాల్సిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఈ ప్రక్రియ నెలాఖరు నాటికి పూర్తవుతుందని ఉద్యోగులంతా భావించారు.

ఎవరికి ‘వార్‌’

వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతుల రగడ

నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు

ఉన్నతాధికారులకు, యూనియన్‌ నేతలకు యుద్ధం

ప్రక్రియ నిలిచిపోవడంతో ఆందోళనలో ఉద్యోగులు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతుల రగడ మొదలైంది. ఉన్నతాధికారులకు, ఉద్యోగుల సంఘ నేతలకు మధ్య వార్‌లో పదోన్నతులు రావాల్సిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఈ ప్రక్రియ నెలాఖరు నాటికి పూర్తవుతుందని ఉద్యోగులంతా భావించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అలాగే ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం 72 మంది ఉద్యోగులు పదోన్నతుల జాబితాలో ఉన్నారు. జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, ఏసీటీవోలు, సీటీవోలు ఈ జాబితాలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పదోన్నతులను పక్కన పెట్టేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పదోన్నతులు దక్కుతాయన్న ఆనందంలో ఉన్నారు. ఈ ఆనందం కాగితం రూపంలోకి రాకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్య ఇదీ

వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగులకు సంబంధించి రెండు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల మధ్య వాతావరణం ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉంటుంది. బదిలీల ప్రక్రియ జరిగినా, పదోన్నతుల జాబితా రూపొందించినా ఈ రెండు సంఘాలు పైచేయి సాధించాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బదిలీల కౌన్సెలింగ్‌ జరగ్గా ఒక ఉద్యోగ సంఘం నేతలు కమిషనర్‌ చాంబర్‌లో ఆందోళన చేశారు. అక్కడే బైఠాయించి రచ్చ చేశారు. దీనిపై అప్పట్లో కొంతమందిపై ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులున్న ఉద్యోగులు పదోన్నతుల జాబితాలో ఉన్నారు. ఇప్పుడు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఉద్యోగ సంఘంలోని ఓ నాయకుడికి, అధికారులకు మధ్య కొద్దిరోజులుగా వాదనలు జరుగుతున్నాయి. కేసులు ఉన్న వారికి పదోన్నతులు ఎలా ఇస్తారని ఆ నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యోగుల సంఘానికి, అధికారులకు మధ్య ఇదొక పంచాయితీగా మారింది. అధికారులు తమకు ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుని ప్రక్రియను పక్కన పెట్టేశారు. దీంతో అర్హులైన ఉద్యోగులు డీలా పడిపోతున్నారు. వాస్తవానికి ఈ నెలాఖరు నాటికి పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేయాలని సీఎస్‌ ఆదేశాలు జారీ చేయడంతో అందరూ ఆశగా ఎదురుచూశారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త హోదాతో ఉద్యోగం చేయవచ్చని భావించారు. ఈ వార్‌తో పదోన్నతులు నిలిచిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 01 , 2026 | 01:14 AM