ఆగని తవ్వకాలు
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:38 AM
‘మేము నోటీసు ఇస్తాం.. మీరు తవ్వుకోండి..’ ఇదీ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు రైట్ మెయిన్ కెనాల్ (పీఐపీఆర్‌ఎంసీ) విజయవాడ డివిజన్-5 అధికారుల తీరు. అనుమతులకు విరుద్ధంగా పోలవరం కుడికాల్వ గట్టు అక్రమ తవ్వకాలను కొత్తూరు తాడేపల్లి ప్రజలు ఇటీవల అడ్డుకున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.
కొనసాగుతున్న పోలవరం కుడికాల్వ గట్టు మట్టి తవ్వకాలు
వైసీపీ హయాంలో అనుమతులు.. ఇప్పుడు తవ్వకాలట..!
రద్దు చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చినా ఆగని వైనం
పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా అదే తీరు
జేసీ ఆదేశాలు బేఖాతరు.. అధికారులకు వాటాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ‘మేము నోటీసు ఇస్తాం.. మీరు తవ్వుకోండి..’ ఇదీ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు రైట్ మెయిన్ కెనాల్ (పీఐపీఆర్‌ఎంసీ) విజయవాడ డివిజన్-5 అధికారుల తీరు. అనుమతులకు విరుద్ధంగా పోలవరం కుడికాల్వ గట్టు అక్రమ తవ్వకాలను కొత్తూరు తాడేపల్లి ప్రజలు ఇటీవల అడ్డుకున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో అనుమతులు రద్దు చేసినట్టుగా మొక్కుబడిగా ఓ నోటీసును ఇచ్చారు. తీరా చూస్తే.. సీన్ రిపీట్. నోటీసులు ఇచ్చినా బేఖాతరు చేస్తూ ఆ సంస్థ అక్రమ తవ్వకాలకు పాల్పడుతోంది. దీనిపై మళ్లీ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుచేయగా, జాయింట్ కలెక్టర్ ఇలక్కియా సీరియస్ అయ్యారు. రద్దు చేశాక కూడా తవ్వకాలు జరపటమేమిటని, చర్యలు తీసుకోవాలని ఆమె పీఐపీఆర్‌ఎంసీ ఎస్‌ఈకు ఆదేశాలిచ్చారు. జేసీ ఆదేశాలు ఇచ్చి ఐదు రోజులు కావస్తున్నా పీఐపీఆర్‌ఎంసీ ఎస్‌ఈ చర్యలు చేపట్టలేదు.
అధికారులకు మామూళ్లు
మట్టి అక్రమ తవ్వకాల్లో ఇరిగేషన్‌తో పాటు రెవెన్యూ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తవ్వుకోమని అనధికారికంగా ప్రోత్సహిస్తున్న అధికారులకు కూడా ఈ వ్యవహారంలో వాటాలున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. మట్టిని తవ్వుకోడానికి వైసీపీ హయాంలో 2022లో తీసుకున్న అనుమతుల ప్రకారం కాకుండా ప్రభుత్వం మారాక తవ్వకాలు జరపటం ఆశ్చర్యకరమైన విషయం. దీనికి అధికారులు ఎలా అనుమతించారన్నది ప్రశ్నార్థకం. దానిని రద్దు చేస్తున్నట్టు నోటీసు ఇచ్చాక కూడా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. అనుమతుల మేరకు 5 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉండగా, ఇప్పటికి లక్ష క్యూబిక్ మీటర్లు తవ్వారు. అనుమతులు ఇచ్చిన ప్రాంతంలోనే మరో లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి ఉంది. ఆ లక్ష క్యూబిక్ మీటర్లను కూడా తవ్వుకోమని అనధికారికంగా ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇచ్చేశారన్న విమర్శలు వస్తున్నాయి.