Share News

పదికి పక్కా ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 15 , 2026 | 01:03 AM

పది పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు పేర్కొన్నారు.

పదికి పక్కా ఏర్పాట్లు

ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు

మొత్తం 22,232 మంది విద్యార్థులు

50 నిమిషాల ముందే కేంద్రానికి రావాలి

సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు

ఫలితాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి

డీఈవో యూవీ సుబ్బారావు వెల్లడి

మచిలీపట్నం టౌన్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : పది పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు పేర్కొన్నారు. మచిలీపట్నంలోని తన చాంబర్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 148 పరీక్షా కేంద్రాల్లో 22,232 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. 9,945 మంది బాలికలు, 11,351 మంది బాలురు రెగ్యులర్‌గా, 936 మంది ప్రైవేట్‌గా పరీక్షలకు హాజరవుతారన్నారు. విద్యార్థులు 50 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాలకు వచ్చేందుకు అనుమతించామన్నారు. సోమవారం నుంచి జరిగే పరీక్షల కోసం 29 స్టోరేజ్‌ పాయింట్లకు ప్రశ్నాపత్రాలను పంపామన్నారు. ఏ కేటగిరీ పరీక్షా కేంద్రాలు 55, బీ కేటగిరీ 43, సీ కేటగిరీ 50 పరీక్షా కేంద్రాలు ఉన్నాయన్నారు. జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారని, ఏ విద్యార్థి ఏ పరీక్షా కేంద్రం.. అనేది హాల్‌ టికెట్‌లో పేర్కొన్నామన్నారు. సెయింట్‌ జాన్స్‌ పరీక్షా కేంద్రాన్ని వరలక్ష్మీ పాలిటెక్నిక్‌ క్యాంపస్‌కు మార్చామని, ఈ పరీక్షా కేంద్రం రాసే విద్యార్థులపై ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు 148 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 148 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియమించామన్నారు. 8 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, ఆ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని చెప్పారు. 51 సీ కేటగిరీ పరీక్షా కేంద్రాల్లో అదనపు జాయింట్‌ కస్టోడియన్లను నియమించామన్నారు. 5 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు పరీక్షా కేంద్రాలను పరిశీలిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. 1,467 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఈ పరీక్షలను పరిశీలించేందుకు సమగ్ర శిక్ష రాష్ట్ర అధికారి ప్రసన్నకుమార్‌ను నియమించారన్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది ప్రశ్నాపత్రాలు చదువుకునేందుకు 15 నిమిషాలు అదనంగా ఇచ్చారన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేశామని, దీనివల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం ఏర్పడిందన్నారు. పరీక్షలంటే భయం లేకుండా రాసేలా అనుభవజ్ఞులైన మోటివేటర్లను నియమించామని పేర్కొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆఽధ్వర్యంలో గోల్డ్‌ కన్వెన్షన్‌ హాల్లో విద్యార్థులకు మోటివేషన్‌ తరగతులు జరిగాయన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు స్టార్‌ స్కూల్‌లో ఈ తరగతులు జరిగాయన్నారు. రాష్ట్రంలో కృష్ణాజిల్లాను 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేశామన్నారు.

డీఈవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌

పది పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా ఏమైనా సమస్యలు తెలిపేందుకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు డీఈవో యూవీ సుబ్బారావు తెలిపారు. 9491505378, 9441665999, 7702427788, 9849501067 నెంబర్లకు ఫోన్‌చేసి విద్యార్థులు తమ సమస్యలను తెలుపవచ్చన్నారు. పరీక్షకు వెళ్లే విద్యార్థులు స్కూల్‌ యూనిఫాంతో హాజరవ్వాల్సిన అవసరం లేదన్నారు. సమస్యలుంటే తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, డీవైఈవోలు, ఎంఈవోలు కంట్రోల్‌ రూమ్‌కు తెలపవచ్చని పేర్కొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 01:03 AM