Share News

ఆ ఏడుగురు..

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:50 AM

పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఏడు పోలీసు స్టేషన్లలో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. ఐదు డివిజన్ల పరిధిలోని ఏడుగురు ఇనస్పెక్టర్లకు స్థానచలనం కలగనుంది. త్వరలో అధికారికంగా జాబితా విడుదల చేస్తారు. పశ్చిమ, ఉత్తర, సెంట్రల్‌ డివిజన్లతో పాటు రూరల్‌ డీసీపీ పరిధిలోని మైలవరం, నందిగామ డివిజన్లలో ఈ మార్పులు జరగనున్నాయని తెలిసింది.

ఆ ఏడుగురు..

పోలీస్‌ కమిషనరేట్‌లో కదలికలు

ఏడుగురు ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం..?

పక్క జిల్లాకు ‘పశ్చిమ’లోని ఇనస్పెక్టర్‌ ప్రయత్నాలు

త్వరలో అధికారిక జాబితా విడుదల

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : పోలీస్‌ కమిషనరేట్‌లోని పశ్చిమ డివిజనలో జాతీయ రహదారి ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది. ఈ ప్రాంతంలోని ఓ పోలీస్‌స్టేషనకు ఎస్‌హెచవోగా వ్యవహరిస్తున్న ఇనస్పెక్టర్‌ తన సేవలను పక్కన ఉన్న కృష్ణాజిల్లాలో అందించాలనుకుంటున్నారు. ఎస్‌హెచవోగా కీలకమైన పోలీస్‌స్టేషన్లలో తప్ప ఇతర పీఎస్‌ల్లో ఉద్యోగం చేయడానికి ఆయన మనసు అంగీకరించదు. కేంద్ర, రాష్ట్ర స్వతంత్ర దర్యాప్తు సంస్థల్లో పనిచేసిన ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక పశ్చిమ డివిజనలో కీలకమైన పోలీస్‌స్టేషనలో పోస్టింగ్‌ దక్కించుకున్నారు. ఆయన పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఇనస్పెక్టర్లకు అధికారులు మెమోలు జారీ చేస్తారు. ఇలా మెమో జారీ చేసినందుకు ఒకింత రాద్ధాంతమే చేసినట్టు కమిషనరేట్‌లో చర్చ నడుస్తోంది. త్వరలో డీఎస్పీ పదోన్నతి వచ్చే అవకాశాలు ఉండటంతో ఇక్కడ ఉంటే అధికారులు ఇచ్చే మోమోల వల్ల దానికి బ్రేక్‌లు పడతాయని భావించిన ఇనస్పెక్టర్‌ కృష్ణాజిల్లాకు వెళ్లడానికి మార్గం సుగమం చేసుకున్నారు. అక్కడ ఏ పోలీస్‌స్టేషనలో పోస్టింగ్‌ కావాలో ఆయనే స్వయంగా నిర్ణయించుకున్నారు. గన్నవరం సబ్‌ డివిజన పరిధిలో విజయవాడను అంటిపెట్టుకుని ఉండే పోలీస్‌స్టేషనలో కుర్చీ కావాలని పట్టుబడుతున్నారు. సంబంధిత ఎమ్మెల్యేతో ఇప్పటికే రెండుసార్లు భేటీ అయినట్టు సమాచారం. తొలుత ఆ ఎమ్మెల్యే ఈ ఇనస్పెక్టర్‌ రావడానికి అంగీకరించలేదు. ఆ తర్వాత అంగీకరించినట్టు సమాచారం. అధికారులు ఎంత త్వరగా విడుదల చేస్తే అంత త్వరగా వెళ్లి కృష్ణాజిల్లాలో కూర్చోవడానికి ఆయన తహతహలాడుతున్నారు. పశ్చిమ డివిజనలో ఉండే ఈ స్టేషనలో పోస్టింగ్‌ కోసం ఇద్దరు ఇనస్పెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి నగరంలో సీపీ ఆధీనంలో ఉండే కీలక విభాగంలో పనిచేస్తున్న ఇనస్పెక్టర్‌ను నియమించాలని అధికారులు భావించారు. ఇంతలో ఉత్తర మండలంలో ట్రాఫిక్‌లో పనిచేస్తూ మాచవరం కోసం ప్రయత్నాలు చేసి విఫలమైన ఇనస్పెక్టర్‌ తెరపైకి వచ్చారు. ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి బంధువు ద్వారా ఈ స్టేషనకు మార్గం సుగమం చేయించుకుంటున్నట్టు తెలిసింది.

ఆయన వద్దే వద్దు..

నందిగామ నియోజకవర్గంలో ఓ ఇనస్పెక్టర్‌ను బదిలీ చేయాలని అధికార పార్టీకి చెందిన నేత ఒకరు గట్టిగా పట్టుబడుతున్నారు. నియోజకవర్గం మొత్తానికి తానే సుప్రీం అన్నట్టుగా చక్రం తిప్పుతున్న ఆ నేత ఈ బదిలీ విషయంలో అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆయన్ను పూర్తిగా వీఆర్‌లోనే ఉంచింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నందిగామ డివిజనలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఇప్పుడు ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఆయన స్థానంలో నందిగామ టౌన ఇనస్పెక్టర్‌గా వ్యవహరిస్తున్న నాయుడు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నాయుడిని బదిలీ చేస్తే ఆ స్థానాన్ని సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎస్సీ ఇనస్పెక్టర్‌తో భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. సైబర్‌ క్రైం విభాగంలో పనిచేస్తున్న ఇనస్పెక్టర్‌ను నందిగామ టౌన పోలీస్‌స్టేషనకు పంపే సూచనలు కనిపిస్తున్నాయి. నాయుడు వెళ్లే స్థానం నుంచి కదిపిన అధికారికి ఎక్కడ కుర్చీ చూపించాలన్న దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

‘ఉత్తరం’లో ఒకరు.. సెంట్రల్‌లో మరొకరు..

ఉత్తర మండలం నుంచి ఒక ఇనస్పెక్టర్‌కు, సెంట్రల్‌ మండలం నుంచి మరో ఇనస్పెక్టర్‌కు బదిలీ ఖాయమన్న ప్రచారం కమిషనరేట్‌లో జరుగుతోంది. మధ్య మండలంలో ఉన్న గుణదల ఇనస్పెక్టర్‌ వాసిరెడ్డి శ్రీనివాసరావుకు రెండేళ్ల సర్వీసు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయనకు స్థానచలనం అనివార్యం కానుంది. సైబర్‌ క్రైం విభాగంలో ఉన్న ఓ ఇనస్పెక్టర్‌ను నందిగామ టౌనకు పంపే యోచనలో అధికారులు ఉండటంతో ఈ స్థానాన్ని గుణదల ఇనస్పెక్టర్‌తో భర్తీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. గుణదలలో ఖాళీ అవుతున్న స్థానంలో ఎవరిని నియమించాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. ఇక ఉత్తర మండలంలో ఉన్న అజితసింగ్‌నగర్‌ ఇనస్పెక్టర్‌ వెంకటేశ్వర్లును బదిలీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన డీఎస్పీ పదోన్నతి జాబితాలో ఉన్నారు. పదోన్నతి లభిస్తే విజయవాడ నుంచి బదిలీ చేస్తారు. ఈలోపు ఆయనకు ప్రత్యామ్నాయం చూపించి అక్కడ ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న ఒక ఇనస్పెక్టర్‌ను నియమించాలన్న యోచనలో అధికార వర్గాలు ఉన్నాయని సమాచారం.

Updated Date - Jan 18 , 2026 | 12:50 AM