తాడిగడపలో భారీ చోరీ
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:13 AM
తాడిగడపలో గురువారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి 100 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, రూ.2.30 లక్షల నగదు దోచుకెళ్లారు. కిటికీకి అమర్చిన ఇనుప ఫ్రేమ్‌ను శబ్ధం రాని చార్జింగ్ కటర్‌తో కట్‌చేసి ఇంట్లోకి ప్రవేశించారు. దోపిడీలో మొత్తం నలుగురు దొంగలు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం కొన్నిరోజుల నుంచి పక్కాగా రెక్కీ నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు.
100 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి అపహరణ
రూ.2.30 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్లిన దుండగులు
తాళం వేసిన ఉన్న ఇల్లే టార్గెట్‌గా అర్ధరాత్రి హల్‌చల్
మరో ఇంట్లోకి ప్రవేశించగా పెంపుడు కుక్క అరవడంతో పరార్
ముసుగులు, మారణాయుధాలతో కనిపించిన దుండగులు
ఇతర రాష్ట్ర దొంగలేనన్న అనుమానం.. దర్యాప్తు ముమ్మరం
పెనమలూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : తాడిగడపలో గురువారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి 100 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, రూ.2.30 లక్షల నగదు దోచుకెళ్లారు. కిటికీకి అమర్చిన ఇనుప ఫ్రేమ్‌ను శబ్ధం రాని చార్జింగ్ కటర్‌తో కట్‌చేసి ఇంట్లోకి ప్రవేశించారు. దోపిడీలో మొత్తం నలుగురు దొంగలు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం కొన్నిరోజుల నుంచి పక్కాగా రెక్కీ నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడసాని తాతేశ్వరరావు తాడిగడపలోని ఇంట్లో నివాసముంటున్నారు. వ్యక్తిగత పనిమీద వారు ఇటీవల బెంగళూరు వెళ్లారు. ముందే రెక్కీ నిర్వహించిన దొంగల ముఠా గురువారం అర్ధరాత్రి దాటాక ఇంట్లోకి ప్రవేశించింది. ముసుగు ధరించి, నిక్కర్లు వేసుకుని ఉన్న ఈ గ్యాంగ్ కత్తులు, పిట్టలను కొట్టే క్యాట్‌బాల్‌తో పక్కా ప్రణాళిక ప్రకారం దోపిడీకి దిగింది. లోపల, బయటా సీసీ కెమెరాలు ఉన్నా.. లెక్కచేయకుండా దాదాపు రెండు గంటలు ఇంట్లోనే వారు హల్‌చల్ చేశారు. శుక్రవారం ఉదయం పనిమనిషి కిటికీ గ్రిల్ కట్‌చేసి ఉండటాన్ని గమనించి తాతేశ్వరరావుకు సమాచారం తెలిపింది. వారు వచ్చి దోపిడీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.
మరో ఇంట్లో చోరీయత్నం
తాతేశ్వరరావు ఇంట్లో దోపిడీ అనంతరం గురువారం రాత్రి 1.30 గంటల సమయంలో ఆ దగ్గరలోని మేడసాని రమేశ్ ఇంట్లోకి కూడా దొంగలు ప్రవేశించారు. దోపిడీ చేసిన వస్తువుల్లోని గిల్టు నగలను అక్కడే తమలపాకు తోటలో పడేసి, రమేశ్ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే, ఆ ఇంటి పెంపుడు కుక్క అరవడంతో నిద్రలేచిన ఇంట్లోని వారు గట్టిగా కేకలు వేశారు. దీంతో దొంగలు పరారయ్యారు. రమేశ్ దంపతులు ఇంట్లో లేని సమయంలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. వారు ఇతర రాష్ట్రంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చారు. వీరు ఇంట్లో లేని సమయంలో ఇంట్లో వృద్ధురాలు మాత్రమే ఉంది.
ఇతర రాష్ట్ర దొంగల పనా..?
దోపిడీకి వచ్చినప్పుడు కత్తులు, పిట్టలను కొట్టే క్యాట్‌బాల్ వంటి ఆయుధాలను ఉపయోగించిన ఈ దొంగలు మన రాషా్ట్రనికి చెందినవారు కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. నేషనల్ క్రైం పోలీసులను సమన్వయం చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నామని, రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు. డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.