Share News

తిరుగు ఉత్సవానికి భారీ ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:36 AM

తిరుపతమ్మ, పరివార దేవతామూర్తులు రంగుల ఉత్సవాన్ని పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 28న పల్లకీల్లో విగ్రహాలను ఉంచి జగ్గయ్యపేట నుంచి పెనుగంచిప్రోలులోని ఆలయానికి తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

తిరుగు ఉత్సవానికి భారీ ఏర్పాట్లు
రంగులు పూర్తిచేసుకున్న విగ్రహాలు

రంగులు పూర్తిచేసుకున్న తిరుపతమ్మ, దేవతామూర్తులు

రేపు జగ్గయ్యపేట నుంచి బయల్దేరనున్న విగ్రహాలు

పల్లకీల్లో సాగనున్న శోభాయాత్ర.. 20 కిలోమీటర్లు ఊరేగింపు

జగ్గయ్యపేట నుంచి పెనుగంచిప్రోలు వరకు..

పెనుగంచిప్రోలు రూరల్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : తిరుపతమ్మ, పరివార దేవతామూర్తులు రంగుల ఉత్సవాన్ని పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 28న పల్లకీల్లో విగ్రహాలను ఉంచి జగ్గయ్యపేట నుంచి పెనుగంచిప్రోలులోని ఆలయానికి తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండేళ్లకోసారి జరిగే రంగుల ఉత్సవంలో భాగంగా ఈనెల 5న తిరుపతమ్మ, గోపయ్య స్వాములతో పాటు ఆలయంలో కొలువై ఉన్న పరివార దేవతామూర్తులను జగ్గయ్యపేటకు ఎడ్లబండ్లపై తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తిరిగి 28న తిరుగు ప్రయాణంలో చిల్లకల్లు, భీమవరం, లింగగూడెం మీదుగా పెనుగంచిప్రోలు ఆలయానికి తీసుకురానున్నారు.

పల్లకీల చరిత్ర ఇదీ..

రంగులు పూర్తిచేసుకుని ముస్తాబైన విగ్రహాలను తిరుగు ప్రయాణంలో పల్లకీల్లో తీసుకురావటం ఆనవాయితీ. ఇందుకు పెనుగంచిప్రోలు నుంచి 5, సుబ్బాయిగూడెం, ముండ్లపాడు, అనిగండ్లపాడు నుంచి ఒకటి చొప్పున పల్లకీలను సిద్ధం చేశారు. వీటిని ఏళ్లుగా పెనుగంచిప్రోలుకు చెందిన రజకులు రేగండ్ల ఇంటి పేరుతో ఉన్న వంశీయలు నిర్వహిస్తున్నారు. పల్లకీలన్నీ వీరి వద్దే ఉంటాయి. విగ్రహాలను బయటకు తీశాక వారే తలపై ఎత్తుకుని గ్రామంలో భారీ ఊరేగింపు చేస్తారు. ఆ తర్వాత రైతులు కట్టిన ఎడ్లబళ్లపై ఉంచి జగ్గయ్యపేటకు తీసుకెళ్తారు. తిరిగి పెనుగంచిప్రోలుకు తీసుకొచ్చే తంతును రేగండ్ల వంశీయులే చేపడతారు. ఇందుకోసం వారం ముందే పల్లకీలను తయారు చేస్తారు. 27 రాత్రికి జగ్గయ్యపేటకు వెళ్లి 28 ఉదయాన్నే విగ్రహాలను పల్లకీల్లో ఉంచి సుమారు 20 కిలోమీటర్లు మోసుకుంటూ వస్తారు. ఒక్కో పల్లకీ నిర్వహణకు దేవస్థానం రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న పల్లకీలు ఏళ్ల కిందట తయారు చేసినవని, రెండేళ్ల తర్వాత రానున్న రంగుల ఉత్సవం నాటికైనా కొత్త పల్లకీలను దేవస్థానం సమకూర్చాలని రేగండ్ల వంశీయుడు రవికుమార్‌ కోరారు.

భారీ వేడుకగా..

జగ్గయ్యపేట పట్టణంతో పాటు చిల్లకల్లు, భీమవరం, లింగగూడెం గ్రామాల్లో భక్తులు అమ్మవారికి ఎదురొచ్చి భక్తిప్రపత్తులతో పూజలు చేసి, మొక్కులు తీర్చుకుంటారు. ఈనెల 28న జగ్గయ్యపేట నుంచి పల్లకీలు బయల్దేరుతాయి. సాయంత్రానికి చిల్లకల్లు, అదేరోజు అర్ధరాత్రికి భీమవరం చేరుకుంటాయి. 29 తెల్లవారుజామున భీమవరం నుంచి బయల్దేరి లింగగూడెం వచ్చి అక్కడే సాయంత్రం వరకు ఉంటాయి. ఆరోజు రాత్రి బయల్దేరి పెనుగంచిప్రోలు రంగుల విడిది మండపానికి వస్తాయి. అక్కడి నుంచి విగ్రహాలను ప్రత్యేక రథంపై ఉంచి ఊరేగింపుగా 30వ తేదీ తెల్లవారుజాము నాటికి ఆలయానికి తీసుకొస్తారు. దాంతో ఉత్సవం ముగుస్తుంది.

Updated Date - Jan 27 , 2026 | 12:36 AM