Share News

శివ శివా..!

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:36 AM

వేయి మునులు తపస్సు చేసిన ప్రాంతం వేయి మునుల కుదురు. ఆ తర్వాత అది యనమలకుదురు రామలింగేశ్వరస్వామి క్షేత్రంగా మారింది. మహిమాన్విత ఈ క్షేత్రంలో రాక్షసులు రాజ్యమేలుతున్నారు. వీరి పాపాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. హుండీ సొమ్మే కాదు.. దాతలిచ్చిన విరాళాలు, దేవస్థానానికి లైటింగ్‌, పూలదండలు, చీరల అమ్మకాలు, కిరాణా దుకాణాలు, కల్యాణ మండపాల్లో డబ్బును ఈవో భవానీ అండ్‌ కో దిగమింగిందన్న కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. అంతేకాదు.. పవిత్రమైన ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదులు వెళ్లడం సంచలనంగా మారింది.

శివ శివా..!

యనమలకుదురు ఆలయంలో అక్రమాలెన్నో..

హుండీ సొమ్మే కాదు.. రూ.లక్షల్లో విరాళాలూ స్వాహా

పక్కదారి పట్టిన కల్యాణ మండపం అద్దె డబ్బు

లైటింగ్‌, పూలదండలు, చీరల అమ్మకాల్లోనూ చేతివాటం

ఈవో భవానీతో పాటు పూర్వ ఈవో గంగాధర్‌ పాత్ర

పవిత్రమైన ఆలయంలో అసాంఘిక కార్యకలాపాలు

దేవదాయ శాఖ మంత్రికి భారీగా ఫిర్యాదులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయంలో హుండీ సొమ్ము స్వాహాతో పాటు మరెన్నో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హుండీ డబ్బు స్కామ్‌ కేసులో పరారీలో ఉన్న ఈవో భవానీ పెద్ద నెట్‌వర్క్‌నే నడిపినట్టు తెలుస్తోంది. ఇందుకోసమే ఆమె ఇక్కడ రెండుసార్లు పోస్టింగ్‌ వేయించుకున్నారని సమాచారం. హుండీ సొమ్ముతో పాటు పలు అక్రమాలకు కూడా ఆమె తెరతీశారు.

భక్తుల విరాళాలు స్వాహా

ఏటా శివరాత్రికి యనమలకుదురు కొండపై ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం కొంతమంది దాతలు సహకరిస్తారు. భారీగా విరాళాలు అందిస్తారు. ఈ విరాళాలపై దేవస్థానంలోని బ్యాచ్‌ కన్నేసింది. దాతలు ఇచ్చిన విరాళాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని వారికి అఽధీకృతంగా రశీదు ఇవ్వాలి. ఇలాంటివేమీ చేయకుండానే.. దాతల నుంచి శివరాత్రి ఉత్సవాల ముందు పెద్ద ఎత్తున విరాళాలు స్వీకరించినట్టు తెలుస్తోంది. వీటిని రికార్డుల్లో చూపకుండా దేవస్థానం సొమ్ముతో ఉత్సవాలు నిర్వహించారు. విరాళాలను మాత్రం పక్కదారి పట్టించినట్టుగా సమాచారం. ఈ మొత్తం భారీగానే ఉందని తెలుస్తోంది.

అక్రమాలు అనేకం

దుకాణాల కేటాయింపులు, దేవస్థానం లైటింగ్‌, పూలదండలు, చీరల విక్రయాల వ్యవహారాల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారు. తనకు సహకరించే ఇద్దరు పూజారులు, ఒక దేవస్థాన ఉద్యోగి సహాయంతో భవానీ ఈ వ్యవహారాలు నడిపినట్టుగా తెలుస్తోంది. ఆలయానికి సంబంధించి కల్యాణ మండపాన్ని ఓ నిర్వాహకుడు దక్కించుకున్నాడు. కొద్దికాలానికే చేతులెత్తేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత దాదాపు చాలాకాలం అద్దెకు ఇచ్చారు. ఈ అద్దెలన్నీ కూడా ఈవో భవానీ అండ్‌ కో పక్కదారి పట్టించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపైనా విచారణకు డిమాండ్లు వస్తున్నాయి.

గంగాధర్‌ పాత్రపైనా అనుమానాలు

భవానీ మొదటిసారి ఈవోగా పనిచేసినపుడు గుమస్తాగా గంగాధర్‌ పనిచేశారు. ఆమె ఇక్కడి నుంచి బదిలీ అయినపుడు గంగాధర్‌ ఈవో బాధ్యతలు స్వీకరించారు. భవానీ సాగించిన అక్రమాల్లో ఆయన కూడా ఓ పాత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాల వ్యవహారాలన్నీ ఆయనకు తెలుసన్న అంశం తెరపైకి వచ్చింది. ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా పనిచేసే క్రమంలో తనకు కావాల్సిన వారిని నియమించుకున్నారని సమాచారం. పర్సనల్‌ రిక్వెస్ట్‌ మీద పోస్టింగ్‌ వేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఆలయంలో అపచారాలెన్నో..

ఆలయంలో మద్యం తాగటం మొదలు సరసాలకు తెరలేపడం వరకు జరిగిన వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు. ఈ విషయాలన్నీ ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

Updated Date - Mar 15 , 2026 | 12:36 AM