Share News

కొండపల్లిలో అల్ర్పాజోలం డ్రగ్‌

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:05 AM

ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి పారిశ్రామికవాడలో అనధికారికంగా నిర్వహిస్తున్న అల్ర్పాజోలం డ్రగ్‌ తయారీ కేంద్ర గుట్టును డీఆర్‌ఐ అధికారులు రట్టు చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, 237 కిలోల అల్ర్పాజోలం, 2,860 లీటర్ల రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.

 కొండపల్లిలో అల్ర్పాజోలం డ్రగ్‌

డీఆర్‌ఐ దాడుల్లో బయటపడిన తయారీ బాగోతం

237 కిలోల డ్రగ్‌ స్వాధీనం.. విలువ రూ.47 కోట్లు

2,860 లీటర్ల రసాయనాల సీజ్‌.. ఇద్దరి అరెస్టు

విజయవాడ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి పారిశ్రామికవాడలో అనధికారికంగా నిర్వహిస్తున్న అల్ర్పాజోలం డ్రగ్‌ తయారీ కేంద్ర గుట్టును డీఆర్‌ఐ అధికారులు రట్టు చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, 237 కిలోల అల్ర్పాజోలం, 2,860 లీటర్ల రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను డీఆర్‌ఐ అధికారులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కొండపల్లి ఐడీఏ ఐదో నెంబరు రోడ్డులో ప్లాట్‌ నెంబరు 187బీలో రేస్‌ ఆర్గానిక్స్‌ పరిశ్రమ ఉంది. ఇందులో సౌరవ్‌ కుమార్‌రౌత, కనుమూరి సాయి త్రిభువన్‌వర్మ అల్ర్పాజోలం డ్రగ్‌ తయారు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న డీఆర్‌ఐ విజయవాడ ప్రాంతీయ ఎస్‌ఐవో (సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌) నాగభూషణం స్వామి, ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ విషాల్‌ కోడూరి సిబ్బందితో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. డీఆర్‌ఐ అధికారులు వెళ్లేసరికి లోపల త్రిభువన్‌ వర్మ, సౌరవ్‌ కుమార్‌రౌత, అరుణ్‌ నాయక్‌, దితికృష్ణ పలై, ఖిరోద్‌ బెహర, రవీంద్ర బెహర పరిశ్రమలో ఉన్నారు. ఇక్కడ ర్యాని నికిల్‌ క్యాటలిస్ట్‌ తయారు చేస్తున్నామని, దానికి తాము ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నామని త్రిభువన్‌ వర్మ, సౌరవ్‌ అధికారులకు వెల్లడించారు. ఇక్కడ మొత్తం రెండు గదులు ఉన్నాయి. ఒక గదిలో కార్మికులు ఉన్నారు. మరో గదిని తయారీ కేంద్రంగా, సరుకు నిల్వకు గోడౌన్‌గా ఉపయోగించుకుంటున్నారు. గోడౌన్‌లో ఐదు తెలుపు రంగు బ్యాగుల్లో అల్ర్పాజోలం పొడి ఉన్నట్టు గుర్తించారు. రెండు బ్యాగుల్లో ఇంతకుముందు తయారు చేసిన అల్ర్పాజోలం ఉండగా, మిగిలిన మూడు బ్యాగ్‌ల్లో తాజా సరుకు ఉంది. ఈ మూడు బ్యాగ్‌ల్లో ఉన్న అల్ర్పాజోలం ఉష్ణోగ్రతలో వ్యత్యాసం కారణంగా తెలుపు రంగు నుంచి ముక్కుపొడి రంగులోకి మారిపోయింది. సుధీర్‌గౌడ్‌ అనే వ్యక్తి ఈ సరుకును సౌరవ్‌తో తయారు చేయిస్తున్నట్టు త్రిభువన్‌ వర్మ అధికారులకు వెల్లడించాడు. దీనికి తాను సహాయం చేస్తున్నట్టు అంగీకరించాడు. అరుణ్‌ నాయక్‌, దితికృష్ణ పలై, ఖిరోద్‌ బెహర, రవీంద్ర బెహర కార్మికులుగా పనిచేస్తున్నారు. వారికి అల్ర్పాజోలంపై ఎలాంటి అవగాహన లేదు. త్రిభువన వర్మ, సౌరవ్‌ చెప్పిన పనులే వారు చేస్తారు. ఏడు దశల్లో ఇక్కడ యంత్రాలను అమర్చారు. అధికారులు సౌరవ్‌, త్రిభువన్‌ వర్మను అరెస్టు చేసి రూ.47 కోట్ల విలువచేసే 237 కిలోల అల్ర్పాజోలం డ్రగ్‌తో పాటు 26 రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ అదుపులో ఉన్న ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌కు చెందినవారని తెలిసింది. ఏడాదిగా ఇక్కడ ఈ డ్రగ్‌ను తయారు చేస్తున్నట్టు సమాచారం.

సుధీర్‌ గౌడ్‌ ఎవరు?

అల్ర్పాజోలం డ్రగ్‌ తయారీ వెనుక ఉన్న అజ్ఞాత వ్యక్తి ఎవరనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను డీఆర్‌ఐ అధికారులు విచారించగా, సుధీర్‌గౌడ్‌ పేరు బయటకొచ్చింది. ఈ సరుకు తయారీకి పెట్టుబడిదారుడిగా ఉన్న సుధీర్‌గౌడ్‌ హైదరాబాద్‌కు చెందినవాడేనని తెలిసింది. అరెస్టయిన ఇద్దరికీ హైదరాబాద్‌లోని పలు ఫార్మా కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని డీఆర్‌ఐ అనుమానిస్తోంది.

Updated Date - Mar 14 , 2026 | 01:05 AM