నేడే అంకురార్పణ
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:40 AM
మహాక్రతువుకు ముహూర్తం దగ్గరకొచ్చింది. ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకానికి శుక్రవారం అంకురార్పణ జరగనుంది. జెండాపై కపిరాజు ఉత్సవ శంఖారావం పూరించగా, మూడు రోజులు జరగనున్న మహోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేద పండితులు, అర్చకులు, పవిత్ర సముద్ర, నదీ జలాలను సిద్ధం చేయడంతో ఇంద్రకీలాద్రి ఉత్సవ కాంతులతో వెలిగిపోతోంది.
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం
బెజవాడ చేరుకున్న పవిత్ర జలాలు
నేటి ఉదయం 7 గంటలకు ఊరేగింపు
పవిత్ర జలాలతో ఆలయాల ప్రదక్షిణ
మూడోరోజు కుంభాభిషేక క్రతువు
సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆహ్వానం
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకానికి ముహూర్తం దగ్గరపడింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ మహా క్రతువు నిర్వహించాలని వేదపండితులు నిర్ణయించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ఆలయాల్లో స్పృశ్య, అస్పృశ్య దోషాలకు పరిహారంగా పన్నెండేళ్లకోసారి ఈ క్రతువును నిర్వహిస్తారు. దీనికి ముందుగా గురువారం ఆలయ విమాన గోపురంపై ఆంజనేయుడి జెండాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఇంద్రకీలాద్రిపై నూతనంగా నిర్మించిన యాగశాలలో క్రతువు ప్రారంభమవుతుంది. 7 గంటలకు అర్చకులు కనకదుర్గానగర్ నుంచి కలశాలతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రిపైకి చేరుకుంటారు.
ఇంద్రకీలాద్రికి చేరుకున్న పవిత్ర జలాలు
మూడు సముద్రాలు, 12 పవిత్ర నదుల నుంచి జలాలను ఇంద్రకీలాద్రికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం మోడల్ గెస్ట్‌హౌస్ వెనుక వైపున ఉన్న ఘాట్ నుంచి కృష్ణా జలాలను సేకరిస్తారు. అక్కడి నుంచి ఊరేగింపుగా దుర్గాఘాట్ మీదుగా కనకదుర్గానగర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆ జలాలను తొలుత మల్లేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్తారు. మల్లేశ్వరాలయం చుట్టూ ప్రదక్షిణ చేశాక అమ్మవారి ఆలయం వద్దకు తీసుకొస్తారు. ఇక్కడ ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ పూర్తయ్యాక తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న సభావేదికపై కాసేపు ఉంచుతారు. తర్వాత అక్కడి నుంచి నూతన యాగశాలలోకి తీసుకెళ్తారు. మూడు రోజులపాటు జరిగే ఈ క్రతువులో సుమారు వందమందికి పైగా పురోహితులు, వేద విద్యార్థులు పాల్గొంటారు.
తుది ఘట్టానికే ప్రముఖుల రాక
మహాకుంభాభిషేకం క్రతువు శుక్రవారం ప్రారంభమవుతున్నప్పటికీ అసలు ఘట్టం మాత్రం ఆదివారం జరుగుతుంది. మొదటి రెండు రోజులు యాగశాలలో పూజలు, దీక్షాధారణ ఉంటాయి. చివరిరోజు యాగశాలలో పూర్ణాహుతి పూర్తయ్యాక అమ్మవారి ప్రధానాలయ గోపురం శిఖారానికి పవిత్రనది, సముద్ర జలాలతో అభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు హాజరవుతారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులకు ఆహ్వానాలు అందాయి.
నేటి కార్యక్రమాలు
శుక్రవారం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం చేస్తారు. గణపతిపూజ చేశాక పుణ్యాహవచనం, దీక్షాధారణ, పంచగవ్య ప్రాశనం, - సాయంత్రం 4 గంటల నుంచి అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, మూలమంత్ర హవనాలు, హారతి కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి 7 గంటలకు మంత్రపుష్పం ఉంటుంది.