Share News

బ్రహ్మాండంగా..

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:41 AM

బ్రహ్మయ్యలింగం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఒమన్‌ దేశం ఆసక్తి చూపిస్తోంది. ఆ దేశానికి చెందిన అధ్యక్షుడు సుల్తాన్‌ బిన్‌ తారిఖ్‌ ఈ చెరువు గురించి తెలుసుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ కనబరుస్తున్నారు.

బ్రహ్మాండంగా..
కొండల మధ్యలో బ్రహ్మయ్యలింగేశ్వర స్వామి ఆలయం

బ్రహ్మయ్యలింగం చెరువు

పర్యాటకాభివృద్ధికి ఒమన్‌ దేశం ఆసక్తి

2023లోనే ప్రతిపాదించిన ఆ దేశాధినేత

సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే యార్లగడ్డ

త్వరలో ఆ దేశంతో సంప్రదింపులు

రూ.350 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బ్రహ్మయ్యలింగం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఒమన్‌ దేశం ఆసక్తి చూపిస్తోంది. ఆ దేశానికి చెందిన అధ్యక్షుడు సుల్తాన్‌ బిన్‌ తారిఖ్‌ ఈ చెరువు గురించి తెలుసుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ కనబరుస్తున్నారు. ఈ అవకాశాన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అందుకోవాలని భావిస్తున్నారు. ఒమన్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పీపీపీ విధానంలో చెరువుకు మహర్దశ కలిగించాలని చూస్తున్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధుల సమావేశం సందర్భంగా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతో పంచుకున్నట్టు తెలిసింది. రూపాయి ఖర్చు కాకుండా ముందుకు వెళ్లొచ్చని యార్లగడ్డ వివరించారు.

2023 నాటి ప్రతిపాదన

2023లో ఒమన్‌ అధినేత మన దేశంలో పర్యటించారు. దేశంలోని పలు ప్రాంతాల గురించి తెలుసుకునే క్రమంలో బ్రహ్మయ్యలింగం చెరువు గురించి కూడా ఆరా తీసినట్టు సమాచారం. ఒమన్‌ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న ఆయన.. ఆ క్రమంలోనే పర్యాటక రంగానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావించారు. పలు దేశాలతో ఆయన జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశాలను ప్రస్తావించారు. మన దేశానికి వచ్చినపుడు బ్రహ్మయ్యలింగం చెరువు గురించి తెలుసుకున్న ఆయన పర్యాటక పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేయటం విశేషం. ఆ తర్వాత కార్యాచరణలోకి రాలేదు. తాజాగా ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు త్వరలో ఆ దేశంతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు. ఒకవేళ పర్యాటకాభివృద్ధి జరిగితే రూ.350 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

మహిమాన్విత చరితం

బ్రహ్మయ్యలింగం చెరువుకు మూడో శతాబ్దం నుంచి ఘన చరిత్ర ఉంది. ఇక్కడి కొండ (బ్రహ్మ కైలాసం)పై బ్రహ్మయ్య లింగేశ్వరస్వామి ఆలయం ఉంది. 1,200 ఎకరాల్లో విస్తరించి ఉంది. వాటర్‌ స్పోర్ట్స్‌కు ఈ ప్రాంతం అనుకూలం. కాటేజీలు, రెస్టారెంట్లు, ఇతర రిక్రియేషన్స్‌ ఎన్నింటినో అభివృద్ధి చేసేందుకు భూములు ఉన్నాయి. అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌).. బ్రహ్మయ్యలింగం చెరువు, ఆ కొండలు, ప్రకృతి సోయగాల ప్రాంతాన్ని ఆనుకుని వెళ్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు భూ సేకరణ మొదలైంది. ఓఆర్‌ఆర్‌ సాకారమైతే.. బ్రహ్మయ్యలింగం చెరువుకు మార్గం సుగమమవుతుంది.

Updated Date - Feb 20 , 2026 | 12:41 AM