అధన..పు వృథా
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:39 AM
వెస్ట్ బైపాస్ వెంబడి ల్యాంకో పవర్ ప్రాజెక్టుకు చెందిన ట్రాన్స్‌మిషన్ హైటెన్షన్ లైన్ అలైన్‌మెంట్ మార్పుల వ్యవహారం తికమకగా సాగుతోంది. ఈ పనుల వల్ల విద్యుత అంతరాయం ఏర్పడుతోందని, అత్యవసర పునరుద్ధరణ టవర్ల పేరుతో రూ.5 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్)కు సాంకేతిక అనుభవం లేకపోవటంతో రూ.2.50 కోట్లతో అయ్యే పనులను రూ.5 కోట్లకు పెంచి చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యుత ఎమర్జెన్సీ రెస్టోరేషన్ టవర్స్ పనుల్లో అవకతవకలు
వెస్ట్ బైపాస్‌లో అవసరం లేనిచోట ట్రాన్స్‌కో రూ.5 కోట్ల ఖర్చు
మూలనపడిన ల్యాంకో ప్రాజెక్టు విద్యుతకు అవాంతరమని సాకు
300 మెగావాట్లు అంటే సింగిల్ సర్క్యూటెడ్ లైన్‌గా పరిగణించవచ్చు
అలాకాకుండా డబుల్ సర్క్యూటెడ్ పనులకు శ్రీకారం
ఎన్‌హెచ్‌తో అదనంగా రూ.2.50 కోట్లు ఖర్చు చేయిస్తున్న ట్రాన్స్‌కో
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ వెస్ట్ బైపాస్ వెంబడి మూలనపడిన ల్యాంకో పవర్ ప్రాజెక్టుకు చెందిన ట్రాన్స్‌మిషన్ హైటెన్షన్ లైన్ అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలో రైతులు కేసులు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు జక్కంపూడి-నున్న మార్గంలో టవర్ల ఎత్తు పెంపు పనులు చేపడుతున్నారు. ఇదే సందర్భంలో అప్పుల్లో ఉన్న కొండపల్లిలోని ల్యాంకో పవర్ ట్రాజెక్టును ఆక్షన్ వేయగా, అందులోని ఒక యూనిట్‌ను రాధా-వాసవి అనే సంస్థ కొనింది. అయితే, టవర్ల ఎత్తు పెంపు పనుల వల్ల విద్యుదుత్పత్తికి అవాంతరాలు ఏర్పడుతున్నాయని ఆ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది.
మూలనపడిన ప్రాజెక్టులో విద్యుదుత్పత్తా..?
కొండపల్లి ల్యాంకో పవర్ ప్రాజెక్టు మూలనపడింది. ఆ సంస్థ తనకున్న అప్పులు చెల్లించేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో ఐపీ పిటిషన్ వేసింది. లిక్విడేటర్‌ను నియమించి ఆక్షన్ వేయించింది. మూడు యూనిట్లలో ఒక యూనిట్‌ను రాధా-వాసవి, మరో యూనిట్‌ను రిలయెన్స్, చివరి యూనిట్‌తో పాటు ట్రాన్స్‌కో హైటెన్షన్ లైన్‌ను మయన్మార్‌కు చెందిన సంస్థ ఆక్షన్‌లో కొనింది. రిలయెన్స్ తన యూనిట్‌ను స్ర్కాప్‌గా తరలించుకుంది. మయన్మార్ సంస్థ పూర్తిస్థాయిలో డబ్బు చెల్లించకపోవటంతో హోల్డ్‌లో ఉంది. ఇలాంటపుడు రాధా-వాసవి విద్యుత ఎలా ఉత్పత్తి చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ విద్యుత ఉత్పత్తి చేస్తుందనే అనుకున్నా.. రాధా-వాసవి సంస్థ దగ్గర ఉన్న యూనిట్ ద్వారా 300 మెగావాట్లను మించి సామర్థ్యం లేదు. ల్యాంకోలైన్‌లో విద్యుత ప్రసారానికి అవాంతరం లేకుండా ఉండటం కోసం టవర్ల ఎత్తు పెంచే వరకు ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీ రెస్టోరేషన్ టవర్స్ (ఈఆర్‌ఎస్) పనులు చేపడుతున్నారు. ఈ పనులకు అయ్యే ఖర్చు అక్షరాలా రూ.5 కోట్లు. దీనికి ఎంత ఖర్చవుతుందో తెలియకపోవటం, సాంకేతిక అవగాహన లేకపోవటంతో ఎన్‌హెచ్ అధికారులు.. ట్రాన్స్‌కోకు అప్పగించారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన ట్రాన్స్‌కో చెయ్యాల్సిన పని చేయకుండా అనవసరంగా ఖర్చు చేయిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.
సింగిల్ కండెన్సర్ సర్క్యూట్ సరిపోదా?
రాధా-వాసవి కొన్న యూనిట్ 300 మెగావాట్ల సామర్థ్యం కలిగింది. దీనికి సింగిల్ కండెన్సర్ సర్క్యూట్ వేస్తే సరిపోతుంది. కానీ, డబుల్ కండెన్సర్ సర్క్యూటెడ్ లైన్ కింద పరిగణిస్తున్నారు. డబుల్ కండెన్సర్ సర్క్యూట్ కింద పరిగణించాలంటే 2 వేల మెగావాట్ల స్థాయి ఉండాలి. రాధా-వాసవికి ఆ స్థాయి లేకపోయినా డబుల్ సర్క్యూటెడ్ కింద పరిగణించి పనులు చేపడుతున్నారు. దీనివల్ల రూ.5 కోట్ల మేర ఖర్చవుతోంది. సింగిల్ సర్క్యూటెడ్ లైన్ కింద పరిగణిస్తే రూ.2.50 కోట్లతోనే సరిపోతుంది. అవసరం లేకపోయినా మరో రూ.2.50 కోట్ల ప్రజాధ నాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం ట్రాన్స్‌కోకు ఎందుకొచ్చిందో తెలియని ప్రశ్నగా ఉంది.