Share News

శ్రమతో సక్సెస్‌

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:49 AM

నిర్దేశించుకున్న పారిశ్రామిక లక్ష్యాలకు జిల్లా యంత్రాంగం చేరువైంది. భారీ పరిశ్రమల ఏర్పాటులో లక్ష్యాన్ని పూర్తి చేసుకోగా, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగంలో 65 శాతం పురోభివృద్ధి సాధించింది. పారిశ్రామిక యూనిట్ల రిజిస్ర్టేషన్లు, పెట్టుబడులు, ఉపాధి కల్పన వంటి అంశాలకు సంబంధించిన లక్ష్యాలకు దగ్గరగా చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియటానికి రెండు నెలల సమయమే ఉండటంతో ఎంఎస్‌ఎంఈల విషయంలో మిగతా లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఉంది.

శ్రమతో సక్సెస్‌

జిల్లాలో లక్ష్యానికి చేరువగా పారిశ్రామిక వృద్ధి

భారీ పరిశ్రమల రంగంలో మంచి పురోగతి

మంచి ఉద్యోగావకాశాలు... ఘనంగా పెట్టుబడులు

ఎంఎస్‌ఎంఈల్లో 65 శాతం మాత్రమే ముందుకు..

ఈ రెండు నెలల్లో పురోగతి సాధించాలి..!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్‌ రంగానికి సంబంధించి బల్క్‌డ్రగ్స్‌, ఫార్ములేషన్స్‌ వంటి యూనిట్లను ఏర్పాటు చేయవచ్చు. ప్రింటింగ్‌ ఆధారిత రంగంలో వెబ్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌, డిజిటల్‌ ప్రింటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీస్‌, రైస్‌ మిల్లింగ్‌, ఇన్‌స్టంట్‌ ఫుడ్స్‌తో పాటు నిర్మాణ రంగంలో రెడీ మిక్స్‌ కాంక్రీట్‌, యూపీవీసీ డోర్స్‌-విండోస్‌, ఏఏసీ బ్రిక్స్‌, చెక్క-స్టీల్‌ ఫర్నిచర్‌ వంటి పరిశ్రమలకు జిల్లాలో అవకాశాలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం చేపట్టిన ప్రమోషన్‌ మేరకు ఎంఎస్‌ఎంఈ, భారీ పరిశ్రమల కేటగిరీల్లో ఔత్సాహిక సంస్థలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం విశేషం.

భారీ పరిశ్రమల విషయంలో భేష్‌

భారీ పరిశ్రమను నెలకొల్పాలన్న లక్ష్యాన్ని జిల్లా యంత్రాంగం సాధించింది. రూ.130 కోట్లతో క్రక్స్‌ బయో ఇథనాల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ సంస్థకు సకాలంలో అనుమతులు ఇవ్వగా, నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో 200 కేఎల్‌డీ సామర్థ్యంతో కూడిన ప్లాంట్‌ను రూ.130 కోట్లతో చేపట్టింది. ఇప్పటికి ఆ సంస్థ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయటంతో పాటు మరో రూ.170 కోట్లు అదనంగా ఖర్చుచేసి విస్తరించింది. ఇప్పటివరకు రూ.300 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. భారీ పరిశ్రమల రంగం విషయంలో లక్ష్యం కంటే అదనంగా 231 శాతం పెట్టుబడులు సాధించటం గమనార్హం. ఇదే సంస్థ తన ప్లాంట్‌ను మరింత విస్తరించటానికి శ్రీకారం చుట్టడం విశేషం. మరో రూ.100 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. 100 మందికి ఉద్యోగాలిస్తానని ఎంవోయూ చేసుకోగా, 302 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇవికాకుండా అదనంగా కామ్య ఇండస్ర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.30 కోట్లతో ఆజ్‌బెస్టాజ్‌ రూఫ్‌ షీట్ల యూనిట్‌ను ఏర్పాటు చేసి 60 మందికి ఉద్యోగాలు కల్పించింది.

మరికొన్ని పరిశ్రమలకు ఊతం

భారీ పరిశ్రమల కేటగిరీలోనే రిలయెన్స్‌ బయో ఎనర్జీ లిమిటెడ్‌ సంస్థ కూడా రూ.120 కోట్లతో కంచికచర్ల మండలం పరిటాలలో 21 టీపీడీ కంప్రెస్డ్‌ గ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో అవెంటల్‌ లిమిటెడ్‌ అనే సంస్థ రక్షణ వ్యవస్థలో ఉపయోగించే సిగ్నల్‌ యాంటెన్నాల తయారీ యూనిట్‌ను రూ.51 కోట్లతో ఏర్పాటు చేయటానికి ముందుకు రాగా, పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో రూ.884.70 కోట్లతో ఇండస్ర్టియల్‌ పార్క్‌ ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టారు.

ఎంఎస్‌ఎంఈ లక్ష్యాలు.. వృద్ధి

జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 1,600 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వీటికి రూ.260 కోట్లతో పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. మొత్తం 8,500 మందికి ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పటి వరకు 1,121 యూనిట్లు.. అంటే దాదాపు 70.66 శాతం మేర ఏర్పాటు జరిగింది. రూ.173.66 కోట్లు (66.60 శాతం) పెట్టుబడి పెట్టారు. 5,395 (63.47 శాతం) మందికి ఉపాధి కల్పించారు.

Updated Date - Jan 18 , 2026 | 12:49 AM