Share News

ఆవకాయ్‌ సిద్ధమోయ్‌..!

ABN , Publish Date - Jan 08 , 2026 | 01:00 AM

మనసుకు ఉల్లాసాన్ని, మేధస్సుకు ఉత్సాహాన్ని ఇచ్చే ‘ఆవకాయ్‌’ సిద్ధమైంది. గురువారం నుంచి మూడు రోజులు నాన్‌స్టాప్‌ జోష్‌ నింపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కృష్ణానదీ తీరాన ఆహ్లాదకర వాతావరణంలో చల్లని శీతలగాలులకు సవాలు విసిరేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఆవకాయ్‌ సిద్ధమోయ్‌..!
జమిందారు కాలంనాటి కోట ఆకారంలో తీర్చిదిద్దిన వేదిక

నేడు సీఎం, డిప్యూటీ సీఎంతో ప్రారంభోత్సవం

మూడు రోజుల పాటు నిర్వహణ

అందంగా ముస్తాబైన పున్నమి ఘాట్‌, భవానీద్వీపం

తెలుగు సినిమా, సంస్కృతి, కళలు, సాహిత్యంపై చర్చ

మ్యూజిక్‌, డ్యాన్స్‌, డ్రామా, సినీ ప్రదర్శనలు

ప్రవేశం ఉచితం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ/ఇబ్రహీంపట్నం) : మనసుకు ఉల్లాసాన్ని, మేధస్సుకు ఉత్సాహాన్ని ఇచ్చే ‘ఆవకాయ్‌’ సిద్ధమైంది. గురువారం నుంచి మూడు రోజులు నాన్‌స్టాప్‌ జోష్‌ నింపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కృష్ణానదీ తీరాన ఆహ్లాదకర వాతావరణంలో చల్లని శీతలగాలులకు సవాలు విసిరేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నదిలో బోటింగ్‌, సినీ విశేషాలు, డ్యాన్సులు, ప్రముఖుల చర్చలు, మ్యూజిక్‌, వర్క్‌షాపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గురువారం ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

ప్రత్యేక కార్యక్రమాలు

రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నగరంలోని పున్నమి ఘాట్‌, భవానీ ద్వీపంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో ‘ఆవకాయ్‌’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సినీ ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, కవితా పఠనాలు, మ్యూజిక్‌, డ్యాన్స్‌, నాటకాలు, వర్క్‌షాపులు, సాంస్కృతిక భాషణలు, ఆధునిక కళా ప్రదర్శనలు, ప్రముఖ గాయకుల కచేరీలు జరుగుతాయి. వీటితో పాటు నదిలో హౌస్‌బోట్లను, రొమాంటిక్‌ ఫ్లోట్‌ అండ్‌ డైన్‌ను తీసుకొచ్చారు. సాహిత్య రంగాలకు చెందిన దిగ్గజాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది కళాకారులు, ప్రముఖ గాయకులు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రముఖ గాయకులు జావేద్‌ ఆలీ తన గానంతో అలరించనున్నారు. తెలుగు సినిమా ఆవిర్భావం, పడిన కష్టాలు, నష్టాలు, లాభాలకు అనుకూలించిన పరిస్థితులను ప్రముఖుల చర్చలు, సంభాషణల ద్వారా తెలుసుకోవచ్చు. సినిమాల్లో విలన్‌ పాత్రకు ఉన్న ప్రాధాన్యత, అలాంటి పాత్రలను తీర్చిదిద్దే నైపుణ్యం, కథకు బలం చేకూర్చే విధానం, పాత్ర విశిష్టత, కథను మలుపుతిప్పే విధానాన్ని నేటితరం రచయితలకు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు అందిరికీ ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఆకట్టుకుంటున్న వేదికలు

పున్నమి ఘాట్‌లో కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం బాహుబలి వేదికను అధికారులు సిద్ధం చేశారు. తెలుగుతనం ఉట్టిపడేలా జమిందారు కాలం నాటి కోట ఆకృతిని వేదికపై సిద్ధం చేశారు. వేదిక ముందు ఆవకాయ్‌ను గుర్తుచేసేలా ఎర్రని రంగు వసా్త్రలతో ప్రత్యేక ఆకృతిని తీర్చిదిద్దారు. భవాని ద్వీపం, పున్నమి ఘాట్‌లో నదీతీరాన్ని రంగుల జెండాలతో అలంకరించారు.

కృష్ణానదిలో మూన్‌లైట్‌ డిన్నర్‌

ఇకపై కృష్ణానదిలో మూన్‌లైట్‌ డిన్నర్‌ చేయొచ్చు. ఫ్లోటెడ్‌ హోమ్‌ బోట్స్‌తో పాటు మూన్‌లైట్‌ ఫ్లోటెడ్‌ బోట్‌ కమ్‌ ఫంట్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం దీనిని ప్రారంభిస్తారు. సుమారు 8 మంది ఇందులో డిన్నర్‌ చేయవచ్చు. చిన్నచిన్న పార్టీలు, బర్త్‌డేలు, పెళ్లిరోజు కార్యక్రమాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. లైట్లు ఆర్పేసి క్యాండిల్‌ లైట్‌లో డిన్నర్‌ చేయొచ్చు. బుధవారం ట్రయల్‌ రన్‌ కూడా జరిగింది. గంట నుంచి 3 గంటల వరకు బోటులో విహరిస్తూ డిన్నర్‌ నైట్‌ పార్టీ చేసుకోవడానికి గంటకు రూ.2,500 వసూలు చేస్తారు.

Updated Date - Jan 08 , 2026 | 01:00 AM