Share News

హద్దు మీరుతున్నారు..!

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:37 AM

నందిగామ రెవెన్యూ పరిధిలో పలు ప్రాంతాల నుంచి తెలంగాణాకు ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అక్రమార్కులు కృష్ణానదిని, మునేటిని యంత్రాలతో కొల్లగొడుతున్నారు. టిప్పర్లు, లారీల ద్వారా హైదరాబాద్‌కు, ట్రాక్టర్ల ద్వారా సరిహద్దులో ఉన్న నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు తరలిస్తున్నారు. తెలంగాణా జిల్లాల్లో గిరాకీ ఉండటం, అధికార యంత్రాంగం నుంచి పెద్దగా దాడులు లేకపోవటంతో అక్రమార్కులు నిర్భయంగా ఇసుకను తరలించేస్తున్నారు.

హద్దు మీరుతున్నారు..!
సోమవారం చిల్లకల్లు పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లు

సరిహద్దులు దాటి తెలంగాణాకు ఇసుక అక్రమ రవాణా

ఇక్కడ రేటు తగ్గటంతో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మంకు..

టిప్పర్లు, లారీల ద్వారా హైదరాబాద్‌కు భారీగా రవాణా

ట్రాక్టర్ల ద్వారా సరిహద్దులకు.. అక్కడి నుంచి తెలంగాణాలోకి..

అధికారుల దాడులు నామమాత్రం కావడంతో బరితెగింపు

(ఆంధ్రజ్యోతి-కంచికచర్ల) : ఉచిత విధానం వల్ల జిల్లాలో ఇసుకకు పెద్దగా గిరాకీ లేకుండాపోయింది. స్టాకు యార్డుల వద్ద టన్ను రూ.180కు అందుబాటులో ఉన్నప్పటికీ పెద్దగా విక్రయాలు జరగట్లేదు. కృష్ణానది, మునేటి రీచ్‌ల నుంచి సొంత అవసరాల కోసం ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక చాలా తక్కువ ధరకు లభిస్తోంది. నందిగామ డివిజన్‌ పరిధిలోనే కాకుండా విజయవాడ వరకు ఎక్కువ మంది వినియోగదారులు, ట్రాక్టర్ల ద్వారానే ఇసుక తెప్పించుకుంటున్నారు. చాలా తక్కువ మందే టిప్పర్లు, లారీల ద్వారా ఇసుక కొంటున్నారు. దీనికితోడు గుంటూరు జిల్లా నుంచి కూడా ఇసుక తక్కువ ధరకు వస్తోంది. దీంతో నందిగామ డివిజన్‌లో రీచ్‌లు, స్టాకు యార్డుల్లో ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ పెద్దగా కొనుగోళ్లు జరగట్లేదు. ఇక్కడ తగినంత డిమాండ్‌ లేకపోవటం, ఇందుకు భిన్నంగా సరిహద్దులో ఉన్న నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం తదితర తెలంగాణా జిల్లాల్లో, హైదరాబాదులో గిరాకీ ఎక్కువగా ఉండటంతో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఉచితం పేరుతో ఎక్కువగా అక్రమ రవాణా చేస్తున్నారు. కాసుల వర్షం కురిపిస్తుండటంతో అక్రమార్కులు కృష్ణానదిని, మునేటిని యంత్రాలతో రేయింబవళ్లు కొల్లగొడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికార యంత్రాంగం నుంచి పెద్దగా తనిఖీలు, దాడులు లేనందున అక్రమార్కులకు బాగా కలిసి వస్తోంది. వత్సవాయి మండలం పోలంపల్లి, కన్నెవీడు, ఇందుగుపల్లి గ్రామాల పరిధిలో మునేటి ఇసుకను కొల్లగొడుతున్నారు. యంత్రాలతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి రోజూ అధిక సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు తరలివెళ్తున్నాయి. కన్నెవీడు గ్రామంలో అయితే గ్రామం అభివృద్ధి కోసమంటూ గ్రామ కమిటీ పేరుతో ట్రాక్టర్ల వద్ద నుంచి సొమ్ము కూడా వసూలు చేస్తున్నారు.

ఇసుక తవ్వకాలు ఎక్కడెక్కడ?

  • పెనుగంచిప్రోలు, సొబ్బాయిగూడెం గ్రామాల వద్ద మునేటిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. రెండు యంత్రాల ద్వారా ఇసుక తవ్వి, ట్రాక్టర్ల ద్వారా దూరంగా వేరొక ప్రాంతాల్లో డంప్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీలు, టిప్పర్ల ద్వారా తెలంగాణాకు తరలిస్తున్నారు.

  • నందిగామ మండలం కంచెల గ్రామంలో రెండు గ్రూపులు పోటాపోటీగా మునేటి ఇసుకను తరలిస్తున్నాయి. ఇసుక తవ్వకాలు, తరలింపు విషయమై రెండు గ్రూపుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రుళ్లు లారీలకు లోడింగ్‌ చేసి, హైదరాబాద్‌ పంపిస్తున్నారు.

  • కంచికచర్ల మండలం గని ఆత్కూరు వద్ద కృష్ణానదిలో ఎక్స్‌కవేటర్‌తో తవ్వుతున్నారు. కొద్దిరోజుల క్రితం అక్రమ తవ్వకాలు జరగకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. మళ్లీ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తెలంగాణా రిజిసే్ట్రషన్‌ కలిగిన లారీలకు లోడింగ్‌ చేస్తున్నారు. అయితే, ఇసుక అక్రమ రవాణా జరగట్లేదని, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు మెరక కోసం మట్టితో కలిసిన ఇసుక తోలుతున్నారని చెబుతున్నారు. చందర్లపాడు మండలం కాసరబాద నుంచి రోజుకు రెండు లారీల ఇసుక తరలిపోతోంది.

  • జగ్గయ్యపేట మండలం మల్కాపురం పరిధిలో ఇసుక కోసం మునేటి గర్భాన్ని యంత్రాలతో తవ్వేస్తున్నారు. ఇక్కడి నుంచి తెలంగాణా సరిహద్దు కేవలం కిలోమీటరులోపే ఉంటుంది. ట్రాక్టర్ల ద్వారా మునేటి ఇసుకను ఖమ్మంజిల్లాకు తరలిస్తున్నారు. ఈ గ్రామంలో ఇసుక ట్రాక్టర్ల కోలాహలం ఎక్కువ. సోమవారం చిల్లకల్లు పోలీసులు దాడిచేసి తొమ్మిది ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు.

Updated Date - Jan 27 , 2026 | 12:37 AM