Share News

హైదరాబాద్‌-విజయవాడ ఫ్లైట్‌ ప్రారంభం

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:44 AM

విజయవాడ విమానాశ్రయం నుంచి ఫ్లై 91 విమాన సర్వీసు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సర్వీసు హైదరాబాద్‌-విజయవాడ విమానాశ్రయానికి రోజూ ఉదయం రాకపోకలు సాగించనుంది. తొలిరోజు 68 మంది ప్రయాణికులు రాగా, 68 మంది వెళ్లారు.

హైదరాబాద్‌-విజయవాడ ఫ్లైట్‌ ప్రారంభం
తొలి బోర్డింగ్‌ పాస్‌ అందజేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

ఫ్లై 91 సర్వీసును వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

తొలి బోర్డింగ్‌ పాస్‌ మంత్రి కొల్లు రవీంద్ర అందజేత

గన్నవరం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ విమానాశ్రయం నుంచి ఫ్లై 91 విమాన సర్వీసు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సర్వీసు హైదరాబాద్‌-విజయవాడ విమానాశ్రయానికి రోజూ ఉదయం రాకపోకలు సాగించనుంది. తొలిరోజు 68 మంది ప్రయాణికులు రాగా, 68 మంది వెళ్లారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఫ్లై 91 విమానాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఫ్లై 91 విమానయాన సంస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. విజయవాడ, రాజమండ్రికి సర్వీసులను నడిపేందుకు ఈ సంస్థ ఆసక్తి చూపటం అభినందనీయమన్నారు. చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఉడాన్‌ పథకానికి ఫ్లై 91 విమానం ఒక నిదర్శనమన్నారు. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయటమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు. విజయవాడ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలో ఈ విమానాశ్రయం నుంచి మరిన్ని అంతర్జాతీయ, దేశీయ సర్వీసులు రానున్నాయని చెప్పారు. అనంతరం తొలి బోర్డింగ్‌ పాస్‌ను మంత్రి కొల్లు రవీంద్ర అందజేశారు. లాజిస్టిక్స్‌, కార్గో రవాణా, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. కాగా, ఫ్లై 91 విమాన సర్వీసుతో విజయవాడ-హైదరాబాద్‌కు రోజుకు 9 సర్వీసులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ విమానం హైదరాబాద్‌లో రోజూ ఉదయం 6.05 బయల్దేరి 7.10 గంటలకు గన్నవరం వస్తుంది. తిరిగి 7.30 గంటలకు బయల్దేరి 8.40కు హైదరాబాద్‌ చేరుతుంది. ఇదే విమానం రెండో సర్వీసు ఈనెల 17 నుంచి ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లో రోజూ ఉదయం 9.05కు బయలుదేరి 10.15కు గన్నవరం వస్తుంది. 10.35కు బయలుదేరి 11.45 గంటలకు హైదరాబాద్‌ వెళ్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీఏడీసీఎల్‌ ఎండీ ప్రవీణ్‌ ఆదిత్య, విమానాశ్రయ ఎగ్జిక్యూట్‌ డైరెక్టర్‌ కె.రామాచారి, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, ఫ్లై 91 విమాన అధికారి అశుతోష్‌ చిట్నిస్‌, శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:44 AM