ముం‘చెత్త’గా..
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:38 AM
మున్సిపల్ అధికారుల అనాలోచిత నిర్ణయం కృష్ణా యూనివర్సిటీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. వర్సిటీకి 900 మీటర్ల దూరంలోని భూములను డంపింగ్ యార్డుగా మార్చేయడంతో అటు విద్యార్థులు, అధ్యాపకులు, ఇటు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త, ఇతరత్రా వ్యర్థాలను డంప్ చేస్తుండటంతో ఆ ప్రాంతమంతా కంపుకొడుతూ అపరిశుభ్రత తాండవిస్తోంది.
కృష్ణా వర్సిటీ సమీపంలో భారీగా చెత్త డంప్
మున్సిపల్ అధికారుల అనాలోచిత నిర్ణయం
కంపుతో విద్యార్థులు, అధ్యాపకులు, స్థానికుల అవస్థలు
మచిలీపట్నంలోని యార్డును రుద్రవరానికి మార్చడం వల్లే..
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో రోజువారీ సేకరించే చెత్తను మొదట్లో శివారున ఉన్న డంపిగ్ యార్డుకు తరలించేవారు. అక్కడ తడిచెత్త, పొడిచెత్త ప్రాసెసింగ్ సక్రమంగా చేయకపోవడంతో 2 లక్షల టన్నులకుపైగా వ్యర్థాలు పేరుకుపోయాయి. 2024, అక్టోబరు 2న మహాత్మాగాంధీ జయంతి, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నం వచ్చారు. ఆ సమయంలో మచిలీపట్నం డంపింగ్ యార్డును పరిశీలించారు. ఇక్కడ పేరుకున్న చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాగా, కొంతకాలంగా ఆ చెత్తను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యంత్రాల ద్వారా గుంటూరులోని జిందాల్ పవర్ ప్రాజెక్టుకు తరలించారు. అయినా డంపింగ్ యార్డులో చెత్తగుట్టలు అలాగే ఉండిపోయాయి. దీంతో ఇటీవలకాలంలో మచిలీపట్నం మండలం రుద్రవరంలోని కృష్ణా యూనివర్సిటీ సమీపంలోని భూముల్లోకి చెత్తను తరలించడం ప్రారంభించారు. భారీగా తరలించడంతో అక్కడ చెత్త గుట్టలు పేరుకుపోయి వర్సిటీ పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి.
వైసీపీ హయాంలో భూమి కేటాయింపు
వైసీపీ హయాంలో రుద్రవరం రెవెన్యూ గ్రామ పరిధిలోని డంపింగ్ యార్డు కోసం 14 ఎకరాలు సేకరించారు. ఈ యార్డును యూనివర్సిటీకి దూరంగా ఉన్న బందరు వెస్ట్ రెవెన్యూ గ్రామ పరిధిలోని గరాలదిబ్బకు దూరంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేస్తామని అప్కట్లో ప్రకటించి, ఆ భూములను పరిశీలించారు. ఈ ప్రాంతంలో భీమవరానికి చెందిన బడాబాబులకు చేపల చెరువులు ఉన్నాయి. ఆ భూముల స్థానే.. వారే డంపింగ్ యార్డుకు భూములు కొని ఇవ్వాలనే ప్రతిపాదనను అప్పటి వైసీపీ పాలకులు పెట్టారు. వారిపై సామదానదండోపాయాలు ప్రయోగించి తమ దారిలోకి తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే భీమవరం బడాబాబులు వర్సిటీ సమీపంలోని 14 ఎకరాలను డంపింగ్ యార్డుకు ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఈ భూమినే ప్రస్తుతం డంపింగ్ యార్డుగా మార్చారు. కాగా, యూనివర్సిటీకి సమీపంలో చెత్తను వేయొద్దని విద్యార్థులు, అధ్యాపకులు, రుద్రవరం గ్రామస్తులు కోరుతున్నారు. దీంతో ఇటీవల చెత్త తరలింపును నిలిపేశామని మచిలీపట్నం మునినిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు తెలిపారు.
విద్యార్థులు, అధ్యాపకులు, స్థానికుల అగచాట్లు
కృష్ణా వర్సిటీ ఇంజనీరింగ్ విభాగంలోనే వెయ్యిమంది విద్యార్థులు చదువుతున్నారు. వీరితో పాటు ఫార్మశీ కళాశాల, వివిధ పీజీ కోర్సుల్లో మరో 400 మందికి పైగా విద్యార్థులున్నారు. అధ్యాపకులు, స్టాఫ్ మరో 150 మందికిపైగా ఉంటారు. వచ్చే జూన్ నాటికి యూనివర్సిటీ ప్రాంగణంలోనే బాలికల వసతిగృహం కూడా ప్రారంభమవుతుంది. ఇంతమంది ఇక్కడ విద్యాభ్యాసం చేస్తుంటే అధికారులు ముందు, వెనుకా ఆలోచించకుండా డంపింగ్ యార్డు పేరుతో యూనివర్సిటీకి సమీపంలో చెత్తను వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ పక్కనే సాంఘిక సంక్షేమశాఖ గురుకుల జూనియర్ కళాశాల ఉండగా, అందులో 500 మంది విద్యార్థులు ఉన్నారు. గురుకుల జూనియర్ కళాశాల పక్కనే రుద్రవరం గ్రామం, ఇటీవల నిర్మించిన నూతన కాలనీల్లో ప్రజలు నివాసం ఉంటున్నారు.