డబుల్ డీఎఫ్‌సీపై ఆశలు
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:02 AM
డీపీఆర్ సిద్ధమై టెండర్లను పిలవాల్సిన దశలో స్తబ్దుగా ఉన్న డబుల్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల (డీఎఫ్‌సీ)పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరడం, ఆయన సానుకూలంగా స్పందించడమే ఇందుకు కారణం.
మళ్లీ తెరపైకి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్
కేంద్ర రైల్వేమంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తితో కదలిక
ఇటార్సీ, ఖరగ్‌పూర్-విజయవాడ డీపీఆర్‌లు ఇప్పటికే సిద్ధం
రైల్వే బోర్డుకు చేరినప్పటికీ స్తబ్దుగానే ప్రాజెక్టు
సీఎం చొరవతో సానుకూలంగా స్పందించిన మంత్రి
సరుకు రవాణా రైల్ కారిడార్లతో విజయవాడకు బూస్ట్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాష్ట్రంలో సరుకు రవాణా రంగానికి ఉన్న అపార అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఇటార్సీ-విజయవాడ (నార్త్-సౌత), ఖరగ్‌పూర్-విజయవాడ (ఈస్ట్-కోస్ట్) డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లలో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టులను త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరడం, ఆయన సానుకూలంగా స్పందించడంతో ఇప్పటివరకు వీటిపై ఉన్న అపోహలు తొలగిపోయాయి.
అపోహలు తొలగి..
దేశవ్యాప్తంగా ఈస్టర్స్ వెస్టర్స్ డీఎఫ్‌సీలు పురోగతిలో ఉన్నాయి. భవిష్యత్తు ప్రాజెక్టులుగా నార్త్-సౌత, ఈస్ట్-వెస్ట్, ఈస్ట్-కోస్ట్ మూడు డీఎఫ్‌సీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఇటార్సీ-విజయవాడ (నార్త్-సౌత), విజయవాడ -ఖరగ్‌పూర్ (ఈస్ట్-కోస్ట్) ఫ్రైట్ కారిడార్స్ విజయవాడ నగరంతో అనుసంధానమయ్యే కీలక ప్రాజెక్టులు. వీటికి సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో అలైన్‌మెంట్ల ఫిక్సేషన్‌తో పాటు డీపీఆర్ రూపకల్పన పూర్తయింది. ఈ ప్రాజెక్టులకు టెండర్లు పిలవాల్సిన దశలో స్తబ్దుగా ఉన్నాయి. ఖరగ్‌పూర్-విజయవాడ డీఎఫ్‌సీ విషయంలో కేంద్రం ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. అయితే, దీనిపై కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటన అయితే విడుదల కాలేదు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చర్చల తర్వాత అపోహలు తొలగిపోయాయి.
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు అంటే..
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ) అంటే.. సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే రైలుమార్గం. సాధారణ రైల్వేతో కలిసి ఉండదు. దీనికోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) ఉంది. దీని ఆధ్వర్యంలో ప్రత్యేక సరుకు రైల్వే రవాణా మార్గాలను ఏర్పాటు చేస్తారు. కొన్నిచోట్ల భూమిమీద, మరికొన్ని చోట్ల ఎలివేటెడ్ విధానంలో ఉంటుంది. ఈ మార్గంలో డబుల్ డెక్కర్ ఫ్రైట్ రైళ్లు నడుస్తాయి.
ఖరగ్‌పూర్-విజయవాడ (ఈస్ట్-కోస్ట్) డీఎఫ్‌సీ ఇలా..
ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ నుంచి ఒడిశాలోని భువనేశ్వర్, రాష్ట్రంలోని విశాఖపట్నం మీదుగా విజయవాడ, గుంటూరుకు వెళ్తుంది. 1,115 కిలోమీటర్ల పొడవునా డబుల్ ట్రాక్ విధానంలో కారిడార్‌ను నిర్మించటానికి డీపీఆర్‌ను తయారు చేశారు. డీపీఆర్ ప్రకారం 6-7 బిలియన్ యూఎస్ డాలర్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. మన కరెన్సీలో రూ.44 వేల కోట్ల నుంచి రూ.56 వేల కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సర్దుబాటు చేసుకోవటానికి ప్రపంచ బ్యాంక్, జైకా, ఏడీబీ వంటి సంస్థలను ఎంపిక చేశారు. 2041 నాటికి 400-860 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయవచ్చన్నది అంచనా. గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో డబుల్ డెక్కర్ ఫ్రైట్ రైళ్లు పరుగెడతాయి. కారిడార్ వెడల్పు 50-60 మీటర్లు. కిలోమీటరుకు 15 నుంచి 18 ఎకరాలు అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఖరగ్‌పూర్, భువనేశ్వర్ మధ్య నాణ్యమైన కోల్ రవాణాకు, భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య ఒడిశాలోని పోర్టులు (పారాదీప్, ధర్మ) ఇండస్ర్టియల్ బెల్ట్స్‌కు అనుసంధానం జరుగుతుంది. విశాఖపట్నం-విజయవాడ మధ్య వ్యవసాయ ఉత్పత్తులు, సీఫుడ్ ట్రేడ్, పోర్టు లాజిస్టిక్స్ అనుసంధానమవుతాయి. వైజాగ్, కాకినాడ, పారాదీప్, ధర్మ పోర్టులు అనుసంధానం కావటం వల్ల ఉద్యోగాల కల్పనతో పాటు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్, ఎగుమతులకు ఊతంగా ఉంటుంది. రైతులకు, సీఫుడ్ ఉత్పత్తిదారులకు ఈస్ట్-కోస్ట్ కారిడార్ ఎంతో ఉపయోగపడుతుంది.
ఇటార్సీ-విజయవాడ (నార్త్ సౌత) డీఎఫ్‌సీ ఇలా..
మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ నుంచి మహారాష్ట్ర నాగపూర్ మీదుగా విజయవాడ వరకు విజయవాడ-ఇటార్సీ నార్త్ సౌత డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను నిర్ణయించారు. ఈ కారిడార్ పొడవు 975 కిలోమీటర్లు. దీని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పూర్తిచేసి రైల్వేబోర్డుకు సమర్పించారు. ఈ కారిడార్ నిర్మాణానికి రూ.46 వేల కోట్ల నుంచి రూ.57 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ నిధుల కోసం కూడా ప్రపంచబ్యాంకు, ఏడీబీ, జైకాను ఎంపిక చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత రైల్వే గూడ్స్ వేగాన్ని గంటకు 25 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల పైన తీసుకెళ్లడానికి వీలుగా ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల సరుకు రవాణాలో ఉన్న ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. ఇదే జరిగితే జీడీపీ దూసుకుపోతుంది. ఈ కారిడార్ ద్వారా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో కోల్, బాక్సైట్, అల్యూమినియం, రాతిసున్నం, వరి, వేరుశెనగ, పత్తి వంటి ఎగుమతులకు మంచి అవకాశం ఉంటుంది. తయారీ వస్తువుల ఎగుమతి, దిగుమతులకు కూడా అనువుగా ఉంటుంది. ముంబై జవహర్‌లాల్ నెహ్రూ పోర్టుతో అనుసంధానం జరుగుతుంది. మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులకు కూడా పరోక్షంగా అనుసంధానమవుతుంది.