తీరానికి రెక్కలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:24 AM
ఇప్పటికే బందరు పోర్టు పనులు పూర్తిచేసి, శరవేగంగా ఓడలను రప్పించే ఏర్పాట్లు జరుగుతుండగా, హెలికాప్టర్లు కూడా త్వరలో చక్కర్లు కొట్టే సూచనలు మచిలీపట్నంలో కనిపిస్తున్నాయి. ఇక్కడి తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా మంగినపూడి బీచ్ సమీపంలో హెలీకాప్టర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాగే, మచిలీపట్నం సౌత మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో 6 వేల ఎకరాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.
మచిలీపట్నంలో త్వరలో హెలీకాప్టర్ ట్రైనింగ్ సెంటర్
42 ఎకరాల భూమి కావాలని ప్రతిపాదనలు.. పరిశీలన
ఇటీవల మచిలీపట్నం వచ్చిన ట్రైనింగ్ సెంటర్ ప్రతినిధులు
కరగ్రహారంలో పర్యాటక రంగ అభివృద్ధికి 70 ఎకరాలు
సౌతలో 6 వేల ఎకరాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం: మచిలీపట్నం నార్త్ మండలంలోని తాళ్లపాలెం పంచాయతీ సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద 42 ఎకరాల్లో హెలీకాప్టర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ఇటీవల ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ సెంటర్‌కు సంబంధించిన ప్రతినిఽధుల బృందం ఇటీవల ఈ ప్రాంతానికి వచ్చి రెవెన్యూ అధికారులతో కలిసి భూములను పరిశీలించింది. సౌత మండలంలోని ఒకటీ రెండుచోట్ల భూములను పరిశీలించినా, నార్త్ మండలంలోని మంగినపూడి బీచ్ సమీపంలోనే ఈ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించిన బ్లూప్రింట్‌ను తయారుచేసి మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా అధికారులతో అధికారులు చర్చలు కూడా జరిపారు. భూమి పరిశీలన జరిగిందని, భూ సేకరణ చేయాల్సి వస్తే రైతులకు ముందస్తు సమాచారం ఇస్తామని మచిలీపట్నం రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ప్రయోజనాలివీ..
అమరావతికి మచిలీపట్నం పోర్టును అనుసంధానం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక్కడ హెలీకాప్టర్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తే పలు ఉపయోగాలు ఉంటాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. వరదలు, తుఫాన్లు, ఇతరత్రా ప్రకృతి విపత్తులు వచ్చినపుడు రక్షణ చర్యల్లో భాగంగా హెలీకాప్టర్లను విశాఖపట్నం, తదితర ప్రాంతాల నుంచి రప్పిస్తున్నారు. మచిలీపట్నంలో హెలీకాప్టర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నుంచే రప్పించే వీలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానదికి వరదలు వచ్చినపుడు లంక గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు, తుఫాన్లు సంభవించినపుడు రక్షించేందుకు వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో సముద్రతీరం వెంబడి మన భూభాగంలోకి ఉగ్రవాదులు చొరబడకుండా నిఘా వ్యవస్థ మరింత పటిష్టవంతంగా ఉంటుందని అంటున్నారు.
సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుపై చర్చలు
మచిలీపట్నం సౌత మండల పరిధిలోని వాడపాలెం, వెంకటదుర్గాంబపురం, కమ్మవారిచెరువు తదితర ప్రాంతాల్లో సముద్రపు కరకట్ట వెంబడి ఉన్న భూముల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుచేసే అంశంపై ప్రభుత్వ పెద్దలు చర్చలు జరుపుతున్నట్లు రెవెన్యూ అధికారులు, స్థానిక రైతులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చేపలు, రొయ్యల చెరువులు తవ్వేందుకు అనుమతులు ఇవ్వాలని రైతులు ఇటీవల అధికారులను సంప్రదించారు. ఈ గ్రామాల పరిధిలో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుపై చర్చలు నడుస్తున్నాయని, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇక్కడ చెరువుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చేది లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సముద్రతీరం వెంబడి అసైన్డ్, పట్టాభూములతో కలిపి సుమారు 6 వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం.
కరగ్రహారంలో పర్యాటక శాఖ ప్రణాళిక
మంగినపూడి బీచ్ సమీపంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫైవ్‌స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం అనుమతులిచ్చింది. దీనికి అనుబంధంగా కరగ్రహారంలో 70 ఎకరాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా పలు కట్టడాల నిర్మాణానికి అనుమతుల కోసం పర్యాటక శాఖ అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి జిల్లా అధికారులకు ఇచ్చారు. భూమిని కేటాయిస్తే తదుపరి చర్యలకు ముందడుగు వేస్తామని అధికారులు చెబుతున్నారు.