Share News

‘పుంజు’కున్నాయ్‌

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:58 AM

రాజకీయ పుంజులు రెడీ అవుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా సహా సరిహద్దున ఉన్న ఏలూరు జిల్లాలో భారీస్థాయిలో కోడి పందేలు వేయడానికి బరులు సిద్ధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ బరుల ఏర్పాట్లు, వేలంపాటలు వేగంగా జరిగిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు చేప్తే ఓకే.. అన్నట్టుగా పోలీసులు వ్యవహరిస్తుండటంతో అటు అధికార పార్టీ వారితో పాటు ఇటు వైసీపీ నాయకులు రూ.కోట్లలో పందేలకు తెరలేపుతున్నారు.

‘పుంజు’కున్నాయ్‌

ఉమ్మడి కృష్ణాజిల్లాలో భారీగా రాజకీయ బరులు

రూ.కోట్లలో కోడిపందేలు వేయడానికి సన్నాహాలు

కొమరవోలులో బీజేపీ, జనసేన నేతల సై

పామర్రు-గుడివాడ సరిహద్దున కొబ్బరికాయ కొట్టి ప్రారంభం

గన్నవరం-నూజివీడు సరిహద్దున హైటెక్‌ పద్ధతిలో ఏర్పాట్లు

మంత్రి తనయుడి నేతృత్వంలో పలువురు భాగస్వామ్యం

గన్నవరం మండలం కేసరపల్లిలోనూ అదే ఉత్సాహం

తిరువూరు, విస్సన్నపేటలో లగ్జరీ గ్యాలరీలు సిద్ధం

ప్రజాప్రతినిధులు చెబితే ఓకే అంటున్న పోలీసులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పామర్రు నియోజకవర్గం కొమర వోలులో బీజేపీ నేత ఒకరు స్థానిక జనసేన నాయకుడితో కలిసి భారీగా కోడి పందేలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. ప్రైవేట్‌ వెంచర్‌లో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి నిమిషంలో ఆ ప్రాంతం కాదని తన పొలంలోనే నిర్వహించాలని ఆ బీజేపీ నేత నిర్ణయించారు. ఈసారి పందేల నిర్వాహకులు తెలివిగా సరిహద్దు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. పోలీసులు కూడా తమ పరిధి కాదంటూ సమర్థించుకోవచ్చనే ఆలోచనతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. గుడివాడ-పామర్రు సరిహద్దున కొత్త పెదమద్దాలి, అడ్డాడ మధ్య భారీగా పందేలు వేయడానికి బుధవారం స్థానిక అధికార పార్టీ నాయకుడొకరు కొబ్బరికాయ కొట్టారు. మొత్తం 5 ఎకరాల స్థలాన్ని పేకాట, జూద క్రీడలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. దీనిని పాడుకున్న వారు పేకాటకు రూ.8 లక్షలు, గుండాటకు రూ.4 లక్షలు, కోడిపందేలకు రూ.5 లక్షల చొప్పున నిర్వాహకులకు ఇవ్వాలి. అలాగే, భోజనాల స్టాల్స్‌కు రూ.3 లక్షల చొప్పున నిర్వాహకులకు, అదనంగా పోలీసులకు రూ.3 లక్షల ఇవ్వాలన్న షరతు విధించారు. పామర్రు మార్కెట్‌ యార్డులో కూడా కోడిపందేల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. తోట్లవ ల్లూరు కరకట్ట వెంబడి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణాజిల్లా, ఏలూరు జిల్లా మధ్య అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి తనయుడి నేతృత్వంలో గన్నవరం-నూజివీడు నియోజకవర్గాల సరిహద్దున సంక్రాంతి సంబరాల పేరుతో కోడిపందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీవీఐపీలకు ఎయిర్‌ కండీషన్లతో కూడిన అద్దాల చాంబర్లు, గ్లాడియేటర్‌ తరహాలో గ్యాలరీలతో కూడిన బరులు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన బరిలో కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.కోటిపైన పందేలు కాసేలా నిర్ణయించారు. ప్రధాన బరిలో రోజుకు 40 పందేలు తక్కువ కాకుండా నిర్వహించాలన్నది నిర్వాహకుల ఆలోచన. ఈ కార్యక్రమాలకు భారీ ఆహ్వాన పత్రికలను కూడా పంచుతున్నారు. ఈ కార్డు ఖరీదే రూ.2 వేలు ఉంటుంది. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి భారీసంఖ్యలో వీవీఐపీలు, వీఐపీలు ఇప్పటికే పందేలకు ఇక్కడ బుక్‌ చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. వీరికోసం విజయవాడ, గన్నవరం, హనుమాన్‌ జంక్షన్‌, నూజివీడు, ఏలూరు ప్రాంతాల్లో మొత్తం 5 వేల గదులు బుక్‌ చేశారు. ఖమ్మంజిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు, టీడీపీ నేతలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారని తెలుస్తోంది.

నిర్వహణ టీడీపీ నేతలది.. పందేలు వేసేది వైసీపీవారు

తిరువూరు నియోజకవర్గంలో భారీస్థాయిలో పందేల నిర్వహణకు బరులు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ నిర్వహణ అధికార పార్టీ నేతలది కాగా, వైసీపీకి చెందినవారు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. తిరువూరు పట్టణంలో మూడు కోడిపందేల బరులు సిద్ధమయ్యాయి. అక్కపాలెం, కాకర్ల, మల్లెల, విస్సన్నపేట, తాతకుంట్ల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ఏ.కొండూరు మండలంలో మరో బరిని ఏర్పాటు చేశారు. గంపలగూడెం మండలంలో నెమలి, ఊటుకూరు, కొణిజర్ల, వినగడప, గంపలగూడెం గ్రామాల్లో బరులు సిద్ధమయ్యాయి. అన్నిచోట్లా కోడిపందేలతో పాటు పేకాట, గుండాట వంటి జూదాలు కూడా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విస్సన్నపేట, తాతకుంట్లలో భారీ ఎత్తున నిర్వహించే పందేలకు స్టేడియాలను తలపించేలా గ్యాలరీలు నిర్మించారు. పందేలను అందరూ వీక్షించేలా ఎల్‌ఈడీ స్ర్కీన్లను కూడా ఏర్పాటుచేస్తున్నారు. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి వచ్చే పందెంరాయుళ్ల కోసం స్థానిక హోటళ్లలో అప్పుడే రూమ్‌లను బుక్‌ చేసేశారు.

Updated Date - Jan 08 , 2026 | 12:58 AM