బెట్టు వీడడు..!
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:30 AM
గుడివాడలో క్రికెట్ బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. గతంలో మాజీమంత్రి కొడాలి నాని మద్దతుతో, నేడు కూటమి నాయకుడి అండతో ఓ బుకీనే ఈ జోరు పెంచాడు. రోడ్డు పక్కన చిరు వ్యాపారిగా.. ఆ తర్వాత పెద్ద చేపల రైతుగా.. తాజాగా బెట్టింగ్ రారాజుగా ఎదిగాడు. చేపల చెరువును వేదికగా మార్చుకుని ఆదివారం నాటి టీ20 ఫైనల్‌లో రూ.లక్షలు వెదజల్లాడు. సదరు బుకీ గ్యాంగ్ పోలీసులకు చిక్కడంతో వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. బుకీ అరెస్టుతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు బడాబాబులు ఉలిక్కిపడుతున్నారు.
క్రికెట్ బెట్టింగ్‌లో గుడివాడ బుకీ స్టైలే వేరు
చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బెట్టింగ్ కాయొచ్చు
అమాయకులకు వడ్డీకి డబ్బులిచ్చి మరీ ప్రోత్సాహం
చిరు వ్యాపారి నుంచి బెట్టింగ్ రారాజు స్థాయికి..
నాడు కొడాలి వెంట.. నేడు కూటమి నేతల పంచన
ఓ సీఐ స్థాయి అధికారి అండతో విచ్చలవిడిగా..
ఆదివారం టీ20 ఫైనల్‌లో చెలరేగిపోయిన గ్యాంగ్
ముందస్తు సమాచారంతో పట్టుకున్న పోలీసులు
బుకీ ఫోన్‌లో పోలీసుల పర్సనల్ నెంబర్లు..!
ఆంధ్రజ్యోతి-గుడివాడ : చిరు వ్యాపారి నుంచి చేపల రైతుగా.. చివరికి బెట్టింగ్ రారాజు అవతారమెత్తిన గుడివాడలోని బుకీ గత ఎన్నికల్లో మాజీమంత్రి కొడాలి నాని గెలుపుకోసం బాగా కృషిచేశాడు. వైసీపీ అధికారంలోకి రాగానే కౌన్సిలర్ అవ్వాలనే లక్ష్యంతో రూ.లక్షల్లో ఖర్చు చేశాడు. చివరికి కూటమి గెలవడంతో రూటు మార్చి ఆ పార్టీ నాయకుల పంచన చేరాడు. సుమారు రూ.30 లక్షల మేర చెల్లించి నిరాటంకంగా బెట్టింగ్‌లు నిర్వహించుకునేందుకు తెరవెనుక అనుమతులు పొందాడని కూటమి నాయకులే చెబుతున్నారు.
చేపల చెరువే స్థావరం
వైసీపీ హయాంలో ఈ బుకీ రెచ్చిపోయాడు. ఆ పార్టీ ఓటమి పాలై, కూటమి ప్రభుత్వం రాకతో రూటు మార్చాడు. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని తన బెట్టింగ్ స్థావరాన్ని నందివాడ మండలం పోలుకొండ సమీపంలోని తాను లీజుకు తీసుకున్న చేపల చెరువులపైకి మార్చాడు. పేరుకే చెరువుల లీజు కానీ, చేసేవన్నీ గలీజు పనులేనని స్థానికులు చెబుతున్నారు. ఈ చేపల చెరువుల నుంచే బెట్టింగ్ మాఫియాను నడుపుతున్నాడు. ఇటీవల జరిగిన మహిళల ప్రపంచకప్ నుంచి ఆదివారం నాటి టీ20 ప్రపంచకప్ వరకు బెట్టింగ్‌లు యథేచ్ఛగా నిర్వహించాడు. చేతిలో డబ్బు లేకపోయినా బెట్టింగ్
చేతిలో డబ్బు లేకున్నా బెట్టింగ్ ఆడే సదుపాయాన్ని ఈ బుకీ కల్పిస్తాడు. ఆట ఆడాలన్నా, ఆటలో నష్టపోయినా అధైర్యపడాల్సిన పనిలేదు. సదరు బుకీనే ప్రాంసరీ నోట్లు, చెక్కులు దగ్గర పెట్టుకుని వడ్డీకి డబ్బులిచ్చి మరీ ఆడిస్తాడు. ఆటలో గెలిస్తే వెంటనే కొంత మొత్తం వడ్డీతో తీసుకుంటాడు. ఓడిపోతే రెండు రోజుల్లో వడ్డీతో సహా చెల్లించాలి. లేదంటే వారికి నరకమే. ఈ మాయలో పడి డబ్బు పోగొట్టుకున్నా వారు కొందరైతే, ప్రాణాలు కోల్పోయిన వారు మరికొందరు.
తవ్వేకొద్దీ అక్రమాలు
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఐ స్థాయి అధికారి అండతో ఈ బుకీ రెచ్చిపోయాడు. సదరు అధికారి ఏ రోజు వాటా ఆరోజే అందుకునేవారు. సదరు అధికారే పట్టణంలోని ప్రముఖులను ఈ బుకీకి పరిచయం చేయించినట్లు సమాచారం. నేటికీ సదరు అధికారి బుకీకి అండగా ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో బెట్టింగ్‌ల గురించి పత్రికల్లో కథనాలు వచ్చినా, కొద్దిపాటి హడావిడి ఉన్నా నామ్‌కే వాస్తేగా అదుపులోకి తీసుకుని సకల మర్యాదలు చేసి వదిలేసేవారు. కాగా, పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్న ఇద్దరు బుకీల ఫోన్‌లో పలువురు పోలీసు ఉన్నతాధికారుల వ్యక్తిగత నెంబర్లు ఉన్నట్లు సమాచారం. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కూడా బుకీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. గతంలో ఈ బుకీ బెట్టింగ్ ఉచ్చులో పడి ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుడిని కోల్పోయారు.
పోలీసుల అదుపులో ఇద్దరు బుకీలు, ఒక అసిస్టెంట్
టీ20 ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా చేపల చెరువు ప్రాంతంలో భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్టు వచ్చిన సమాచారంతో ఆదివారం రాత్రి స్పెషల్ బ్రాంచ్ మచిలీపట్నం ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గుడివాడ తాలుకా ఎస్‌ఐ ఎన్.చంటిబాబు ఆధ్వర్యంలో దాడి చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తుండగా, రెడ్‌హ్యాండెడ్‌గా బుకీ శివతో పాటు అసిస్టెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఐదు యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన బుకీ శివ ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక నీలామహల్ రోడ్డుకు చెందిన ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుంచి మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.