Share News

దుర్గగుడి సెక్యూరిటీ టెండర్‌పై ప్రభుత్వం ఆరా

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:41 AM

దుర్గగుడి సెక్యూరిటీ టెండర్‌ను దక్కించుకోవటానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ నేత సంస్థపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో ఆ సంస్థ నిర్వాహకులు బెదిరింపులు, దౌర్జన్యాలతో అడ్డగోలుగా పలు ఆలయాల్లో సెక్యూరిటీ టెండర్లను దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

దుర్గగుడి సెక్యూరిటీ టెండర్‌పై ప్రభుత్వం ఆరా

వైసీపీ నేత సంస్థపై సీఎంవో విచారణ

రంగంలోకి నిఘా వర్గాలు

(ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి) : దుర్గగుడి సెక్యూరిటీ టెండర్‌ను దక్కించుకోవటానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ నేత సంస్థపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో ఆ సంస్థ నిర్వాహకులు బెదిరింపులు, దౌర్జన్యాలతో అడ్డగోలుగా పలు ఆలయాల్లో సెక్యూరిటీ టెండర్లను దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అదే తరహాలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో సెక్యూరిటీ టెండర్లను దక్కించుకోవటానికి ఆ నాయకుడు.. బంధువైన మంత్రి సహకారంతో దేవదాయ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి గొల్లపూడిలోని దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో సెక్యూరిటీ టెండర్ల కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించి వైసీపీ నేత సంస్థకు టెండర్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో కఽథనం ప్రచురితమైంది. దీనిపై సీఎం కార్యాలయం ఉన్నతాధికారులు ఆరా తీశారు. నిఘా వర్గాలు కూడా ఆ సంస్థ, నిర్వాహకుల గురించి విచారణ చేసినట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలకు పాల్పడటమే కాకుండా.. బలవంతంగా పలు ఆలయాల్లో ఇతర సంస్థలకు వచ్చిన టెండర్లను బెదిరించి లాక్కున్న విషయాన్ని గుర్తించినట్లు సమాచారం. ఈ సంస్థపై రాయలసీమలో కేసు కూడా నమోదైనట్లు తెలిసింది.

సీఎం వద్దకు వ్యవహారం

విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని తెలుసుకుని వివరాలు అడిగినట్లు దేవదాయ శాఖలో అధికారులు చర్చించుకుంటున్నారు. సదరు సంస్థ నిబంధనలకు విరుద్ధంగా దుర్గగుడిలో సెక్యూరిటీ టెండర్‌ను దక్కించుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల ఓ ప్రైవేట్‌ సెక్యూరిటీ సంస్థ నిర్వాహకులు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సెక్యూరిటీ టెండర్ల కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారని, వారిలో దేవదాయ శాఖకు చెందిన ఐదుగురు, ప్రభుత్వానికి చెందిన మరో ఇద్దరు అధికారులు ఉన్నారు. ఓ మంత్రి ఆదేశాల మేరకు దేవదాయ శాఖ అధికారులు కమిటీ సభ్యులపై ఒత్తిడి తెచ్చి మంత్రి బంధువు సెక్యూరిటీ సంస్థకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Jan 23 , 2026 | 12:41 AM