కృష్ణా వర్సిటీకి మంచి రోజులు
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:11 AM
కూటమి ప్రభుత్వ పాలనలో కృష్ణా యూనివర్సిటీకి మంచిరోజులు కనిపిస్తున్నాయి. 14 నెలలుగా ఇన్‌చార్జి రిజిస్ర్టార్ పాలనలోనే వర్సిటీ కొనసాగుతుండగా, ఇటీవల జరిగిన వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి కమిషనర్ కొత్త రిజిస్ర్టార్‌ను నియమిస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో నూతన రిజిస్ర్టార్ నియామకంపై ప్రచారం జోరందుకుంది. అలాగే, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది భర్తీకి కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై వర్సిటీలో పాలన గాడిన పడనుంది.
నూతన రిజిసా్ట్రర్ నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా
అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది భర్తీకి కూడా నిర్ణయం
త్వరలో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కొత్త కమిటీ (ఈసీ)
ఆ తర్వాత సుమారు 100 పోస్టుల భర్తీ
యూనివర్సిటీకి రూసా నిధులు రూ.20 కోట్లు మంజూరు
పలు అభివృద్ధి పనులకు ఊతం
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీలో పరిపాలనాపరమైన కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు యూనివర్సిటీ ఎగ్జ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ)లో చర్చించాలి. ఇప్పుడున్న ఈసీ సభ్యుల నియామకం వైసీపీ హయాంలో జరిగింది. ఈ ఏడాది ఆగస్టు వరకు ఈ కమిటీ పదవీకాలం ఉంటుంది. కాగా, వర్సిటీల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ పోస్టుల నియామకానికి సంబంధించి ఈసీలో చర్చించాలి. ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందో నిర్ణయించి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. మే 15న నోటిఫికేషన్ విడుదల కానుందని తెలుస్తోంది. ఈలోగానే ఈసీ సభ్యులతో సమావేశం నిర్వహించి యూనివర్సిటీలో ఎంతమంది అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని నియమించాలనే అంశంపై తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఈసీసభ్యులను ఈనెల 25 నాటికి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత ఈసీలో నూతన సభ్యుల నియామకం జరుగుతుందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. అనంతరం మొత్తం 80-100 మంది అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి సంబంధించిన పోస్టులు భర్తీచేసే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే, కాంట్రాక్టు పద్ధతిపై పదిహేనేళ్లు పైబడి పనిచేస్తున్న అధ్యాపకులకు ఈ నూతన నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తారా, లేదా అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. పూర్తిస్థాయిలో నియామకాలు జరిగితే వివిధ పీజీ కోర్సుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది.
రిజిస్ర్టార్ ఎవరో..?
కృష్ణా యూనివర్సిటీ ఏర్పడి 18 ఏళ్లు అయ్యింది. దీర్ఘకాలం పాటు బయటి వర్సిటీల్లో పనిచేసే అధ్యాపకులనే రిజిస్ర్టార్‌లుగా నియమిస్తూ వచ్చారు. స్థానికంగా యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులను ఇన్‌చార్జి రిజిస్ర్టార్‌లుగానే నియమించారు. ప్రస్తుతం 14 నెలలుగా ఇన్‌చార్జి రిజిస్ర్టార్ కొనసాగుతున్నారు. కొత్త రిజిస్ర్టార్ నియామకం ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతుందని ఇటీవల జరిగిన వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి కమిషనర్ చెప్పినట్లు అధ్యాపకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీలో పనిచేసే సీనియర్ అధ్యాపకుల్లో ఒకరికి రిజిస్ర్టార్ పోస్టు దక్కుతుందనే ప్రచారం ఊపందుకుంది. వారం వ్యవధిలోనే రిజిస్ర్టార్ నియామకంపై స్పష్టత వస్తుందని అంటున్నారు. దీంతో ఆ పోస్టు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.
రూ.20 కోట్లు మంజూరు
కృష్ణా యూనివర్సిటీ అభివృద్ధి కోసం గతంలో వీసీగా పనిచేసిన జ్ఞానమణి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేశారు. దీంతో రూసా నిధులు రూ.20 కోట్లు మంజూరైనట్లు యూనివర్సిటీ అధ్యాపకులు చెబుతున్నారు. యూనివర్సిటీలో ఇంతవరకు బాలురు, బాలికల వసతి గృహాలు సమకూరలేదు. బాలుర వసతి గృహంతో పాటు ఇంజనీరింగ్ కళాశాల భవనాల నిర్మాణాన్ని మూడేళ్ల క్రితం పునాదుల దశలోనే నిలిపివేశారు. బాలికల వసతి గృహం నిర్మాణ పనులు పూర్తిచేస్తామని రెండేళ్లుగా చెబుతున్నా, జాప్యం జరుగుతోంది. ఈ నిధులతో పెండింగ్ పనులను పూర్తిచేస్తారా, లేదా అనేది వేచి చూడాలి. దీంతోపాటు యూనివర్సిటీ ప్రాంగ ణంలో స్టేడియం నిర్మాణం ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విజయవాడలో కృష్ణా వర్సిటీ పీజీ సెంటరును ఏర్పాటుచేసే ప్రతిపాదన ఉంది. అధ్యాపకుల నియామకం జరిగితే అందుబాటులో ఉన్న ఫ్యాకల్టీని దృష్టిలో పెట్టుకుని వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరే అవకాశం ఉంది.