Share News

సమయమే.. సైబర్‌ సురక్ష

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:44 AM

గురునానక్‌ కాలనీకి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. పిల్లల విద్య నిమిత్తం కొద్దినెలల క్రితం విజయవాడ వచ్చారు. సీబీఐ కేసు నమోదు చేసిందని సైబర్‌ నేరగాళ్లు ఆమెకు వీడియోకాల్‌ చేశారు. భయపడిపోయిన ఆమె వెంటనే రూ.కోటీ25లక్షలను ఆర్టీజీఎస్‌ ద్వారా వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్‌ పోలీసులను ఆశ్రయించడంతో డబ్బు బదిలీ అయిన ఖాతాలను స్తంభింపజేశారు. వెంటనే ఆమె స్పందించడం వల్ల రూ.25 లక్షలను ‘ఈ’ కాప్స్‌ వెనక్కి రప్పించగలిగారు. గత ఏడాది జరిగిన ఘటన ఇది. సూర్యారావుపేటకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి పేరున విదేశాల నుంచి డ్రగ్స్‌ వచ్చాయని సైబర్‌ నేరగాళ్లు ముంబై క్రైం బ్రాంచ్‌ పేరు ఉపయోగించుకుని ఫోన్‌ చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని, బయటపడాలంటే తాము చెప్పిన ఖాతాలో డబ్బు జమ చేయాలని బెదిరించారు. ఆయన ముందుగా భయపడి రూ.25 లక్షలు జమ చేశారు. తర్వాత మళ్లీ మరో రూ.50 లక్షలు పంపాలని ఫోన్లపై ఫోన్లు చేస్తుండటంతో సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ ఫోన్‌ మాట్లాడేసరికి సైబర్‌ నేరగాళ్లు స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు. ముందుగా రూ.25 లక్షలు పోగొట్టుకున్న ఆయన ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించడం ద్వారా రూ.50 లక్షలు కాపాడుకోగలిగారు. ఇలాంటి సైబర్‌ నేరాల్లో గోల్డెన్‌ అవర్‌ కీలకమంటున్నారు పోలీసులు. సైబర్‌ నేరం నిర్ధారణ అయ్యాక వీలైనంత త్వరగా స్పందించి పోలీసులకు సమాచారం ఇస్తే పోయిన డబ్బును తిరిగి రాబట్టవచ్చంటున్నారు.

సమయమే.. సైబర్‌ సురక్ష

సైబర్‌ నేరాల కట్టడికి గోల్డెన్‌ అవర్‌ కీలకం

ఆ సమయం దాటితే కష్టమంటున్న పోలీసులు

ఎన్‌ఆర్‌ఐలు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులే టార్గెట్‌

ఆ మూడు వర్గాలే లక్ష్యంగా సైబర్‌ నేరాలు

నగదు క్షణాల్లో వివిధ ఖాతాలకు బదిలీ

త్వరగా స్పందిస్తే తిరిగి రాబట్టే అవకాశం

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : సైబర్‌ వల విసురుతున్న నేరగాళ్లు ప్రధానంగా మూడు వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎన్‌ఆర్‌ఐలు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు డిజిటల్‌ అరెస్టు పేరుతో ఎర వేస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే.. ఇదే విషయం అర్థమవుతోంది. పెట్టుబడి నేరాల్లోనూ ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. సైబర్‌ నేరాల్లో బాధితుల సంఖ్యను తగ్గించడానికి, ప్రజల ప్రతి రూపాయిని సురక్షితంగా ఉంచడానికి పోలీసులు సైబర్‌ సురక్ష ప్రాజెక్టును మొదలుపెట్టారు. పోలీసులు తమ ట్రాక్‌లోకి బ్యాంకర్లను లాక్కురావడంతో జిల్లాలో డిజిటల్‌ అరెస్టులకు బ్రేకులు పడ్డాయి. ఈ కేసులు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడి నేరాలకూ బ్రేక్‌లు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ‘ఈ’ నేరాల బారిన పడకుండా ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్న యోచనలో పోలీసులు ఉన్నారు.

వెంటనే స్పందించడం మేలు

ఎన్‌ఆర్‌ఐ మహిళ పోగొట్టుకున్న రూ.కోటీ25లక్షల నుంచి రూ.25 లక్షలను పోలీసులు తిరిగి ఆమెకు ఇప్పించగలిగారు. సైబర్‌ నేరగాళ్లు చెప్పిన ఖాతాలకు ఆర్టీజీఎస్‌ ద్వారా డబ్బు పంపాక ఆమె మోసపోయానన్న అనుమానంతో సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ బ్యాంకు అధికారులను సంప్రదించి అందులో ఉన్న రూ.25 లక్షలను ఏ ఇతర ఖాతాల్లోకి వెళ్లకుండా నిలువరించగలిగారు. మిగిలిన డబ్బు మాత్రం వేర్వేరు ఖాతాలకు వెళ్లిపోయాయి. సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకున్న బాధితులు తక్షణమే స్పందిస్తే జమ చేసిన డబ్బును వారి చేతుల్లోకి వెళ్లకుండా కట్టడి చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు.

గోల్డెన్‌ అవర్‌ కీలకం

జనం నుంచి డబ్బు జమ చేయించుకున్న తర్వాత సైబర్‌ నేరగాళ్లు వాటిని వెంటనే వేర్వేరు ఖాతాలకు మళ్లించేస్తారు. కొంతమంది ఏటీఎం కార్డుల ద్వారా డబ్బు తీయించేస్తారు. మరికొంతమంది ఆ డబ్బుతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయిస్తారు. సాధారణంగా ఈ నేరగాళ్లు ఒక్కో ఖాతాను కనీసం నెల రోజులే ఉపయోగిస్తారు. తర్వాత దాన్ని వదిలేస్తారు. డిజిల్‌ అరెస్టు పేరుతో కాల్స్‌ వచ్చినా, పెట్టుబడులకు సంబంధించిన లింక్‌లు వచ్చినా స్పందించకపోవడం మేలు. అవగాహనలోపంతో నేరగాళ్ల వలలో పడినా గోల్డెన్‌ అవర్‌లో బాధితులు స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

ఇలా చేస్తే సురక్షితం

  • డిజిటల్‌ అరెస్టు పేరుతో ఎవరు వీడియో కాల్స్‌ చేసినా ఆ నెంబర్లను బ్లాక్‌ చేయాలి.

  • అదే పనిగా నెంబర్లను మార్చేస్తే వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

  • ఒకవేళ భయంతో ఈ నేరగాళ్లు చెప్పిన ఖాతాల్లో డబ్బు జమ చేసినా వెంటనే 1930కి ఫోన్‌ చేయాలి.

  • ఇలా ఫోన్‌ చేయగానే డబ్బు జమ అయిన బ్యాంకులకు లావాదేవీలను నిలుపుదల చేయమని అలెర్ట్‌ వెళ్తుంది.

  • తద్వారా ఆ డబ్బు సైబర్‌ నేరగాళ్లు కదిపే అవకాశాన్ని కోల్పోతారు.

  • పెట్టుబడి నేరాలన్నీ లింక్‌ల ద్వారా జరుగుతున్నాయి. ఈ తరహా లింక్‌లన్నీ టెలిగ్రాం గ్రూపులో పోస్టవుతున్నాయి. ఇలా వచ్చిన లింక్‌లను వెంటనే డిలీట్‌ చేయడం ఉత్తమం.

Updated Date - Feb 09 , 2026 | 12:44 AM