ఎండ గడుతున్నారు
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:46 AM
‘ఎంతెంత దూరం.. అంటే.. ఎండలో చాలా దూరం’ అన్నట్టుగా ఉంది కొత్త ప్రభుత్వాసుపత్రిలో రోగుల అవస్థలు. రోగులకు మెరుగైన సేవలందించడానికి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అయితే నిర్మించారు కానీ.. సరైన నీడ సదుపాయం కల్పించలేదు. దీంతో జీజీహెచ్‌లోని బ్లాకుల నుంచి సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లోకి రోగులను మండుటెండలో తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆసుపత్రి సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో రోగుల సహాయకులే స్ర్టెక్చర్లు, వీల్‌చైర్లలో మండుటెండలో తోసుకెళ్తూ నరకయాతన అనుభవిస్తున్నారు.
జీజీహెచ్ నుంచి సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌కు వెళ్లాలంటే నరకమే..
నడినెత్తిన మండిపోతున్న ఎండలో రోగుల తరలింపు
సె్ట్రక్చర్లు, వీల్‌చైర్లు సరిగ్గా ఉండవు.. తోసుకెళ్లే సిబ్బంది ఉండరు
మండుటెండలో రోగుల సహాయకుల అవస్థలు
కనీసం షెడ్డు అయినా ఏర్పాటుచేయాలని వేడుకోలు
విజయవాడ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో ఏ, బీ, సీ బ్లాక్‌ల వెనుక సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఉంది. ఆసుపత్రిలో చేరిన రోగులు కొన్ని పరీక్షల అనంతరం అత్యవసరమైతే సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీనిలో డయాలసిస్, కార్డియాలజీ, మరికొన్ని అవయవ సంబంధ పరీక్షలు చేస్తారు. ఈ క్రమంలో జీజీహెచ్‌లోని మూడు బ్లాకుల నుంచి సూపర్ స్పెషాలిటీ బ్లాకుకు తీసుకెళ్లే క్రమంలో రోగులు ఎండకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలోనూ హఠాత్తుగా పడే వానకు తడిసిపోతున్నారు.
మధ్యాహ్నం వరకే అందుబాటులో వైద్యులు
ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు మధ్యాహ్నం వరకే అందుబాటులో ఉంటారు. దీంతో రోగులను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపే జీజీహెచ్, సూపర్ బ్లాకులకు తీసుకెళ్లాలి. నడినెత్తిన భానుడు నిప్పులు కురిపిస్తున్న ఆ సమయంలో రోగులను బ్లాకులకు మారుస్తున్నారు. అసలే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ఈ ఎండకు నరకం అనుభవిస్తున్నారు.
సిబ్బంది వాహనాలకు మాత్రం షెడ్డు
ఆసుపత్రి బీ బ్లాకును ఆనుకుని షెడ్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది వాహనాలు ఏర్పాటు చేసుకుంటారు. దీనిని చూసిన రోగుల సహాయకులు వాహనాలకు ఉన్న నీడ కూడా రోగులకు లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జీజీహెచ్ ఏ, బీ, సీ బ్లాకుల నుంచి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ మధ్య షెడ్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ నిర్మాణం ఏ, బీ, సీ బ్లాకు ముందు నుంచి వేయాలంటే వ్యయం ఎక్కువవుతుంది. అన్ని బ్లాకుల వెనుక ద్వారాలకు అనుసంధానిస్తే అంత ఖర్చు కాదు.
రోగులను తీసుకెళ్లే సిబ్బంది లేరు
రోగులను ఒక బ్లాకు నుంచి మరో బ్లాకుకు తీసుకెళ్లడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారు. అయితే, జీజీహెచ్‌లో వీరు కనిపించరు. రోగులను సహాయకులు, బంధువులే తీసుకెళ్లాలి. దీనిపై ఆసుపత్రి అధికారులు, సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలాకాలంగా రోగులను వార్డులకు మార్చే సిబ్బందే కనిపించడం లేదు. రోగుల పరిస్థితిని బట్టి ఏ విధంగా తీసుకెళ్లాలనే అవగాహన ఎఫ్‌ఎన్‌ఎం సిబ్బందికి ఉంటుంది. అదే రోగుల సహాయకులు తీసుకెళ్లే క్రమంలో జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య తీవ్రమయ్యే ప్రమాదముంది.