Share News

బుకింగ్స్‌ బండ

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:07 AM

ఉమ్మడి కృష్ణాజిల్లాలో గృహ వినియోగ గ్యాస్‌ సరఫరాకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ.. గ్యాస్‌ దొరకదనే భయం వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.

బుకింగ్స్‌ బండ
మచిలీపట్నంలోని లక్ష్మీటాకీసు సెంటర్‌లో కట్టెల పొయ్యిపై వంట

ఒక్కసారిగా పెరిగిన బుకింగ్‌లతో గ్యాస్‌ కష్టాలు

ఈనెలలో మూడు ప్రధాన పండుగలు

అవసరాల నిమిత్తం పెరుగుతున్న బుకింగ్‌లు

ఏజెన్సీల వద్ద వినియోగదారుల క్యూ

పానిక్‌ బుకింగ్స్‌తో మొరాయిస్తున్న సర్వర్లు

కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరా నిలిపివేత

పలు హోటళ్ల వద్ద కట్టెల పొయ్యిలు

ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో గృహ వినియోగ గ్యాస్‌ సరఫరాకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ.. గ్యాస్‌ దొరకదనే భయం వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో గృహ వినియోగ గ్యాస్‌ కూడా నిలిచిపోతుందని భయపడుతున్నారు. ముఖ్యమైన పనులు మానుకుని మరీ గ్యాస్‌ బుకింగ్‌ చేస్తున్నారు. దీంతో సర్వేర్లు మొరాయిస్తున్నాయి. కొన్నిచోట్ల అసలు పనిచేయట్లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా రోజుకు వేలసంఖ్యలో గృహ వినియోగ సిలిండర్లను బుక్‌ చేస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం జరిపిన విజిట్‌లో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పలు గ్యాస్‌ ఏజెన్సీల వద్ద పెద్ద ఎత్తున జన సందోహం కనిపించింది. ఒకపక్క గ్యాస్‌ బుక్‌ చేసేవారు, మరోపక్క బుక్‌ చేసిన గ్యాస్‌ సిలిండర్లను తీసుకెళ్లే వారితో ఏజెన్సీలు కిటకిటలాడుతున్నాయి. పెద్దలు, పిల్లలు, మహిళలు పెద్దసంఖ్యలో బారులు తీరి కనిపించారు.

మూతపడుతున్న హోటళ్లు

ముఖ్య పట్టణాల్లో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు లభించక హోటళ్లు మూతపడుతున్నాయి. చిన్నచిన్న హోటళ్ల వారు కట్టెల పొయ్యిలు ఉపయోగిస్తున్నారు. అధికారుల నిఘా లేనిచోట్ల మాత్రం కమర్షియల్‌ గ్యాస్‌ బండల స్థానంలో గృహ వినియోగ బండలు వాడేస్తున్నారు. టిఫిన్‌ ధరలపై గ్యాస్‌ కొరత ప్రభావం పడి ధరలు పెరుగుతున్నాయి.

పండుగల కోసం..

ఈనెల 19న ఉగాది, 20న రంజాన్‌, 27న శ్రీరామనవమి పండుగలు ఉన్నాయి. ఆయా పండుగలకు గ్యాస్‌ వినియోగం పెద్ద ఎత్తున ఉంటుంది. రంజాన్‌ ఉపవాస దీక్షల్లో భాగంగా గంజి, హలీమ్‌, తెల్లవారుజామున భోజనాలకు హోటళ్లలో గ్యాస్‌ వినియోగిస్తారు. కమర్షియల్‌ గ్యాస్‌ కొరత కారణంగా పలు హోటళ్లు మూత పడుతున్నాయి. శ్రీరామనవమికి పెద్ద ఎత్తున అన్నదానాలు జరుగుతాయి. ఇందుకోసం గ్యాస్‌ కొరత లేకుండా చూసుకునేందుకు పెద్ద ఎత్తున బుకింగ్స్‌ జరుగుతున్నాయి.

రెండు మూడు రోజుల్లోనే సిలిండర్‌ డెలివరీ

గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వారికి రెండు మూడు రోజుల్లో సిలిండర్‌ అందిస్తున్నాం. కమర్షియల్‌ గ్యాస్‌ బుకింగ్స్‌ ఆపేశారు. గృహ వినియోగ గ్యాస్‌కు ఇబ్బంది లేదు. గురువారం వెయ్యిమంది గ్యాస్‌ బుక్‌ చేశారు.

- అమల, మైలవరం నమిత గ్యాస్‌ ఏజెన్సీ ఉద్యోగి

బుక్‌ చేసుకున్న రోజే సిలిండర్‌

బుక్‌ చేసుకున్న రోజే నాకు గ్యాస్‌బండ ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. అందరిలానే నేను ఆందోళన పడి వచ్చా. ఇక్కడ అంతా బాగానే ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు.

- మహమ్మద్‌ ఖాజాబీ, మైలవరం

Updated Date - Mar 14 , 2026 | 01:07 AM