Share News

పుష్కలంగా ఆయిల్‌

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:32 AM

పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయిల్‌ కంపెనీలు డీలర్లకు అధికారికంగా స్పష్టత నిచ్చాయి. కొండపల్లిలోని ఐవోసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ప్లాంట్లలో పూర్తిస్థాయిలో ఆయిల్‌ నిల్వలు ఉన్నాయి.

పుష్కలంగా ఆయిల్‌
కొండపల్లిలోని ఐవోసీఎల్‌ ప్లాంట్‌

కొండపల్లిలోని ప్లాంట్లలో పూర్తిస్థాయి నిల్వలు

పైపులైన్‌ ద్వారా నిరంతరాయంగా సరఫరా

సోషల్‌ మీడియా పోస్టులకు ఆందోళన చెందొద్దు

డీలర్లకు స్పష్టతనిచ్చిన ఆయిల్‌ కంపెనీలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయిల్‌ కంపెనీలు డీలర్లకు అధికారికంగా స్పష్టత నిచ్చాయి. కొండపల్లిలోని ఐవోసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ప్లాంట్లలో పూర్తిస్థాయిలో ఆయిల్‌ నిల్వలు ఉన్నాయి. దీంతో పాటు ఈ ప్లాంట్లకు పైపులైన్‌ ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమృద్ధిగా ఆయిల్‌ నిల్వలు వస్తున్నాయి. ఆయిల్‌ కొరత ఉందని, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగబోతున్నాయంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు రావడంతో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఆయిల్‌ డీలర్లు కంపెనీలకు ఫోన్లు చేస్తున్నారు. తరచూ ఆయిల్‌ డీలర్ల నుంచి తమకు ఫోన్లు వస్తుండటంతో కంపెనీలు ఈ మేరకు స్పష్టతనిచ్చాయి. ఆయిల్‌ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ధరల పెరుగుదలకు సంబంధించి కూడా ఎలాంటి సమాచారం లేదని, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశాయి. దీంతో డీలర్స్‌ అసోసియేషన్‌ నాయకులు.. డీలర్లందరికీ ఈ మేరకు సమాచారం పంపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వినియోగదారులకు కూడా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆందోళన చెందొద్దు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం 45 వేలకు పైగా లారీలు ఉన్నాయి. ప్రైవేట్‌ బస్సులు, ఆటోలు, లక్షల సంఖ్యలో ద్విచక్రవాహనాలు, కార్లు ఉన్నాయి. ఇంధన వినియోగం గరిష్టంగా ఉంటుంది. జిల్లాలో మొత్తం 300 పెట్రోల్‌, డీజిల్‌ బంకులు ఉన్నాయి. సగటున ఒక్కో బంకు నుంచి రోజూ 4 వేల లీటర్ల పెట్రోల్‌, 6 వేల లీటర్ల డీజిల్‌ వినియోగం జరుగుతోంది. మొత్తం అన్ని బంకులకు కలిపి చూస్తే.. రోజుకు 12 లక్షల లీటర్లు, డీజిల్‌ 18 లక్షల లీటర్ల వినియోగం అవుతోంది. ఇంత భారీ వినియోగం నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టులతో వినియోగదారులలో ఆందోళన నెలకొంది. ఆయిల్‌ కంపెనీలు ఇచ్చిన స్పష్టతతో ఆ భయం పోయింది.

Updated Date - Mar 10 , 2026 | 12:32 AM