Share News

ఈవో భవానీని కాపాడే యత్నాలు

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:19 AM

పరారీలో ఉన్న యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయ ఈవోను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం జిల్లాలోని ఓ ఆలయ ఈవో సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు సమాచారం.

ఈవో భవానీని కాపాడే యత్నాలు

ఆమెను దేవదాయ శాఖకు తీసుకెళ్లిందెవరు?

తెరవెనుక చక్రం తిప్పుతున్న మరో ఈవో

ఆ వీడియోల్లో ఏముంది? : ఆలయంలో చర్చ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పరారీలో ఉన్న యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయ ఈవోను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం జిల్లాలోని ఓ ఆలయ ఈవో సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు సమాచారం. పశ్చిమ ఎన్టీఆర్‌ జిల్లాలో ఓ కీలక దేవస్థానానికి ఈవోగా ఉన్న ఆయన దేవాలయ అభివృద్ధి కంటే దేవదాయ శాఖలో పైరవీలకు ఎక్కువ సమయం వెచ్చిస్తుంటాడు. ఆయన పట్ల దేవదాయ శాఖ కమిషనరేట్‌లో కొందరు సానుకూలంగా ఉంటారు. ఈవో భవానీ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కాగా, ఆమెను సదరు ఈవో తన వెంట దేవదాయ శాఖ కమిషనరేట్‌కు తీసుకెళ్లినట్టు సమాచారం. ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తేయడానికి ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈయన సిఫార్సులతో తొలుత ఆమెపై సస్పెన్షన్‌ చర్యను వెనక్కి తీసుకునే ఆలోచన చేసినప్పటికీ, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఆగినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సీసీ ఫుటేజీ ఆధారంగా భవానీని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

గంగాధర్‌పైనా విచారణకు అవకాశాలు

రామలింగేశ్వరస్వామి ఆలయ పూర్వ ఈవో గంగాధర్‌ హయాంలో వెలుగుచూసిన వ్యవహారాలపై కూడా దేవస్థానం అధికారులు విచారణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తనపై విచారణ జరగకుండా ఉండేందుకు గంగాధర్‌ కూడా తనకు తెలిసిన వారితో గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. గంగాధర్‌ హయాంలో ఆయన పట్టుబట్టి నియమించుకున్న కొందరు ఉద్యోగులపైనా ఇప్పటికే ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పాటు ఆలయంలో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించినవీడియోలు ఉన్నాయన్న చర్చ దేవదాయ శాఖ వర్గాల్లో నడుస్తోంది. ఆ వీడియోలు ఏమిటన్నది బయటకు రాలేదు. ఆ వీడియోలు దేనికి సంబంధించినవన్న చర్చ జరుగుతోంది. ఈ వీడియోలు వెలుగులోకి వస్తే రామలింగేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఇంకొన్ని బాగోతాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Mar 22 , 2026 | 12:19 AM