Share News

తాగునీరే కీలకం

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:37 AM

గత రెండు విడతలుగా రసాభాసగా సాగిన జిల్లా పరిషత స్టాండింగ్‌ కమిటీ, బడ్జెట్‌ సర్వసభ్య సమావేశాలు గురువారం ప్రశాంత వాతావరణం మధ్య జరిగాయి. ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని జడ్పీటీసీ సభ్యులు కోరారు.

తాగునీరే కీలకం
జడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక. చిత్రంలో సీఈవో కన్నమనాయుడు, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ వినూత్న, మచిలీపట్నం ఇన్‌చార్జి ఆర్డీవో పోతురాజు, జడ్పీ డెప్యూటీ సీఈవో ఆనందబాబు

జడ్పీ సమావేశంలో సభ్యుల మాట

వేసవిలో నీటి సమస్య పరిష్కారానికి నిధులివ్వాలని వినతి

మొవ్వ సాంఘిక సంక్షేమ వసతి గృహం అంశంపై ఆగ్రహం

సాంఘిక సంక్షేమ శాఖ డీడీ పనితీరు బాగోలేదని ధ్వజం

రూ.120.34 కోట్ల ప్రారంభ నిల్వతో జడ్పీ బడ్జెట్‌ ఆమోదం

2026-27లో ఆదాయం అంచనా రూ.2,140 కోట్లు.. ఖర్చు రూ.2,123 కోట్లు

జిల్లా పరిషతలో భవనాల ఆధునికీకరణకు రూ.1.10 కోట్లు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : వేసవిలో తాగునీటి సమస్యలను తీర్చేందుకు అధికారులు సరైన విధంగా స్పందించాలని, నిధులు సకాలంలో విడుదల చేయాలని జడ్పీటీసీ సభ్యులు ముక్తకంఠంతో కోరారు. జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధ్యక్షతన జిల్లా పరిషత స్టాండింగ్‌ కమిటీ సమావే శం గురువారం స్థానిక జడ్పీ సమావేశ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా కృత్తివెన్ను, గూడూరు, రెడ్డిగూడెం, కలిదిండి తదితర మండలాల జడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ వేసవిలో ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులు విడుదల చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయాలన్నారు. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంతో పాటు ఇతర గ్రామాల్లో చెరువుల నుంచి సరఫరా చేసే తాగునీరు సక్రమంగా ఫిల్టర్‌ కావట్లేదని, ప్రజలు భయాందోళన చెందుతున్నారని, మండల ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ పనితీరు బాగోలేదని కృత్తివెన్ను జడ్పీటీసీ సభ్యురాలు తెలిపారు.

అవనిగడ్డ, పామర్రు ఎంపీడీవోలపై ఫిర్యాదు

పామర్రు, అవనిగడ్డ ఎంపీడీవోలు.. ఆయా మండలాల్లోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలను పట్టించుకోవట్లేదని, చులకనగా చూస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీల్లో తీర్మానం చేసిన పనులను చేయించ కుండా జాప్యం చేస్తున్నారని, నిధులను కూడా మంజూరు చేయడంలేదని పేర్కొన్నారు. కనీస మర్యాద ఇవ్వకపోగా, పరిపాలనా అంశాలను తెలియజేయట్లేదని వివరించారు. ఎంపీడీవోల పనితీరుపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని లేకుంటే, రెండు మండలాల్లోని ప్రజాప్రతినిధులంతా ఏకమై ఏంచేయాలో అదే చేస్తామన్నారు. దీనిపై జడ్పీ సీఈవో కన్నమనాయుడు స్పందిస్తూ ఈ అంశాలపై విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సాంఘిక సంక్షేమ శాఖ డీడీ పనితీరు బాలేదు

మొవ్వలోని బాలుర వసతి గృహాన్ని ఇటీవల సంక్రాంతి సెలవుల్లో కూలగొట్టారని, స్థానికంగా ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎలాంటి సౌక ర్యాలు లేకున్నా 95 మంది పిల్లలను అక్కడ ఉంచుతున్నారని జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు పరిశుద్ధరాజు సమావేశంలో వివరించారు. పిల్లలు ఇబ్బందులు పడుతున్న విషయంపై చెప్పేందుకు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ షాహిద్‌బాబుకు ఫోన్‌ చేస్తే ‘మీ హోదా ఏంటి?’ అని అడుగుతున్నారని, ఏమైనా సమస్య ఉంటే కలెక్టర్‌తో మాట్లాడుకోవాలని ఆయన అంటున్నారని చెప్పారు. మిగిలిన సభ్యులు కూడా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మాటతీరు బాగోదని, కొన్ని సందర్భాల్లో ఫోన్‌ కూడా తీయడని ధ్వజమెత్తారు. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ సమావేశానికి కూడా రాలేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌తో మాట్లాడతానని జడ్పీ సీఈవో చెప్పడంతో సభ్యులు శాంతించారు. ధాన్యం రవాణాకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయించాలని సభ్యులు కోరారు. ఆయా మండలాల్లో రహదారుల అభివృద్ధి పనులను ప్రారంభించే సమయంలో, జడ్పీ నిధులతో పదో తరగతి పిల్లలకు స్టడీ మెటీరియల్‌ అందించే సమయంలో జడ్పీటీసీలకు కనీస సమాచారం ఇవ్వలేదని సభ్యులు పోడియం ఎదుట ఆందోళన చేశారు.

రూ.120.34 కోట్ల ప్రారంభ నిల్వతో బడ్జెట్‌ ఆమోదం

జిల్లా పరిషతకు సంబంధించి 2026-27 బడ్జెట్‌ను రూ.120.34 కోట్ల ప్రారంభ నిల్వతో జిల్లా పరిషత చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సభ్యులంతా ఏకగీవ్రంగా ఆమోదించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జడ్పీతో పాటు అనుబంధ శాఖల ఆదాయం రూ.2,140 కోట్లుగా అంచనా వేశారు. ఖర్చు అంచనా రూ.2,123 కోట్లుగా ఉంటుందని అంచనాలు రూపొందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ నిల్వ రూ.143.97 కోట్లతో ప్రారంభించామని, ఆదాయం రూ.817.82 కోట్లుగా ఉందన్నారు. ఖర్చులు పోనూ రూ.120.34 కోట్ల ప్రారంభ నిల్వతో 2026-27 బడ్జెట్‌ను రూపొందించామని జడ్పీ చైర్‌పర్సన్‌ తెలిపారు. జడ్పీకి స్వయంగా సమకూరే నిధుల్లో 23 శాతం అభివృద్ధి పనులకు, 15 శాతం ఎస్సీల సంక్షేమం కోసం, ఆరు శాతం గిరిజనుల సంక్షేమం కోసం, 15 శాతం సీ్త్ర శిశు సంక్షేమం కోసం, తాగునీటి సరఫరాకు 12 శాతం కేటాయించినట్లు తెలిపారు. కార్యాలయ నిర్వహణ కోసం 15 శాతం, అత్యవసర పనుల కోసం నాలుగు శాతం, ఆరోగ్యం, సంక్షేమం కోసం 10 శాతం నిఽధులు కేటాయించినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్‌కలెక్టర్‌ వినూత్న, మచిలీపట్నం ఇన్‌చార్జి ఆర్డీవో పోతురాజు, జడ్పీ డెప్యూటీ సీఈవో ఆనందబాబు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:37 AM