Share News

కలల ప్రాజెక్టులు కళ్లెదుటకు..

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:56 AM

ఎన్నాళ్ల నుంచో ఆశగా ఎదురుచూస్తున్న పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టుల కల సాకారం కానుంది. ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, మినీ ఫ్లై ఓవర్లకు లైన్‌క్లియర్‌ అయింది. రాయనపాడు రైల్వేస్టేషన్‌ ప్రారంభోత్సవం త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా వర్చువల్‌గా జరగనుంది. విజయవాడ, కొండపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నాయి. మంగళవారం రైల్వే డీఆర్‌ఎం మోహిత సోనాకియాతో జరిగిన సమావేశం నేపథ్యంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించే ప్రాజెక్టుల జాబితా ఖరారు చేశారు. ఆ వివరాలను మీడి యా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ ప్రకటించారు. - (ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం)

కలల ప్రాజెక్టులు  కళ్లెదుటకు..
అందంగా ముస్తాబైన రాయనపాడు రైల్వేస్టేషన్‌

మెగా రైల్వే ప్రాజెక్టుల ధమాకా

త్వరలో ప్రధానితో వర్చువల్‌గా రాయనపాడు రైల్వేస్టేషన్‌ ప్రారంభోత్సవం

ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, స్టేషన్ల రీ డెవలప్‌మెంట్‌ పనులకు శంకుస్థాపన

ఐదు భారీ ఆర్వోబీలు, మూడు ఆర్‌యూబీల పనులు త్వరలోనే..

రూ.10 కోట్లతో కొండపల్లి రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్‌

గుణదల, ఎర్రకట్ట మినీ ఫ్లైఓవర్లకు పచ్చజెండా

మార్చిలో విజయవాడ రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ అడుగులు

రైల్వే డీఆర్‌ఎంతో ఎంపీ కేశినేని శివనాథ్‌ సమావేశం

అనంతరం కీలక ప్రాజెక్టుల వివరాలు వెల్లడి

రాయల్‌గా.. రాయనపాడు రైల్వేస్టేషన్‌

రాయనపాడు రైల్వేస్టేషన్‌ను శాటిలైట్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. రూ.70 కోట్లతో ఆధునికీకరణ, ప్లాట్‌ఫాంల పెంపు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ రైల్వేస్టేషన్‌కు ప్రస్తుతం 40 వరకు రైళ్లకు హాల్ట్‌ ఇచ్చారు. దీనిని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఆర్వోబీలు, ఆర్‌యూబీలకు శంకుస్థాపన

  • ఇబ్రహీంపట్నం మండలంలోని ఈలప్రోలు గ్రామం, గుంటుపల్లి వ్యాగన్‌ వర్క్‌షాప్‌ దగ్గర లెవల్‌ క్రాసింగ్‌ (ఎల్‌సీ) గేట్‌ 147 సమీపంలో ఆర్వోబీకి ఆమోదం లభించింది. దీనికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. పనులు ప్రారంభించటమే తరువాయి.

  • కొండపల్లి ఎస్టీ కాలనీలోని ఎల్‌సీ గేట్‌ 140 దగ్గర ఆర్‌యూబీకి గతంలో ప్రతిపాదించగా, దీనికి కూడా రైల్వే నుంచి అనుమతులు వచ్చాయి. టెండర్లకు వెళ్లనున్నారు.

  • రాయనపాడులోని ఎల్‌సీ గేట్‌ 148 దగ్గర రాయనపాడు ఆర్వోబీకి అనుమతి రావటంతో పాటు టెండర్ల దశలో ఉంది.

  • గుణదల బీ క్యాబిన్‌ దగ్గర వైజాగ్‌-చెన్నై రైల్వేలైన్‌పై ఎల్‌సీ గేట్‌-316 దగ్గర ఆర్వోబీకి అనుమతి రావటంతో పాటు టెండర్ల దశ కూడా పూర్తయింది.

  • న్యూ రాజరాజేశ్వరిపేట-పాతరాజరాజేశ్వరిపేట మధ్య ఎల్‌సీ నెంబర్‌ 1ఈ దగ్గర ఆర్‌యూబీ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. డిజైన్లు కూడా ఫైనల్‌ అయ్యాయి. భూ సేకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలో టెండర్లు పిలవనున్నారు.

  • వాంబేకాలనీ వాసుల కల కూడా నెరవేరనుంది. వాంబేకాలనీ-మధురానగర్‌ మధ్య కోల్‌కతా- చెన్నై రైల్వేలైన్‌ దగ్గర ఆర్‌యూబీ నిర్మాణానికి సంబంధించి కూడా అడ్డంకులు తొలగాయి. ఇక్కడ డ్రెయినేజీకి మార్చడానికి కార్పొరేషన్‌ అంగీకరించింది. ఆ పని పూర్తికాగానే, ఆర్‌యూబీ పనులు చేపడతామని రైల్వే తెలిపింది.

  • గొల్లపూడి వై జంక్షన్‌ నుంచి జక్కంపూడి వెళ్లే మార్గంలో విజయవాడ-న్యూఢిల్లీ రైల్వేలైన్‌పై నిర్మించతలపెట్టిన ఆర్వోబీకి కూడా మోక్షం కలిగింది. టెండర్ల దశ కూడా పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి.

గుణదల, ఎర్రకట్ట మినీ ఫ్లై ఓవర్లు

విజయవాడ-గుడివాడ రైల్వేలైన్‌పై గుణదల ఎల్‌సీ గేట్‌-8 వద్ద నిర్మించాల్సిన మినీ ఫ్లై ఓవర్‌కు ఇప్పటికే భూ సేకరణ పూర్తయింది. దీనికి రైల్వే నుంచి అనుమతి వచ్చింది. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ప్రధానంగా ఎల్‌సీ గేట్‌ 6ఏ, 6బీ మద్య రైల్వేయార్డు దగ్గర ఎర్రకట్ట బ్రిడ్జికి కూడా మోక్షం కలిగింది. ఇది శిథిలస్థితిలో ఉంది. ఎర్రకట్ట బ్రిడ్జి తొలగించి నూతనంగా మినీ ఫ్లై ఓవర్‌ను నిర్మించేందుకు వీలుగా బెంగళూరుకు చెందిన సంస్థతో డీపీఆర్‌ను రైల్వే తయారు చేయిస్తోంది.

కొండపల్లి రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ

కొండపల్లి రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్లాట్‌ఫాంల విస్తరణ, రైల్వేస్టేషన్‌ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలని, ప్లాట్‌ఫాంలను పెంచాలన్న డిమాండ్‌ ఎప్పటినుంచో ఉంది. త్వరలోనే అభివృద్ధి పనులకు టెండర్లు పిలవనున్నారు.

విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ చకచకా

పీపీపీ విధానంలో బెజవాడ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరించనున్న సంగతి తెలిసిందే. రూ.834 కోట్లతో రైల్వే ల్యాండ్‌ డెవ లప్‌మెంట్‌ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) టెండర్లు పిలిచింది. ప్రస్తుతం ప్రీబిడ్‌ మీటింగ్స్‌ జరుగుతున్నాయి. మార్చి 31 నాటికల్లా పూర్తవుతాయి. ఇవి పూర్తయితే ఔత్సాహిక సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతారు.

Updated Date - Feb 18 , 2026 | 12:56 AM