Share News

అక్రమాలు అనేకం.. విచారణ నామమాత్రం

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:47 AM

యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయంలో జరిగిన అక్రమాల్లో విచారణపై అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పరారీలో ఉన్న ఈవో భవానీ అక్రమాలతో పాటు గతంలో పనిచేసిన మరో ఈవో గంగాధర్‌ హయాంలోనూ అక్రమాలు వెలుగుచూడగా, దేవదాయ శాఖ మాత్రం కేవలం భవానీ అక్రమాలపై మాత్రమే విచారణకు ఆదేశించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంగాధర్‌ హయాంలో జరిగిన అక్రమాలపై కూడా విచారణ జరపాలంటూ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఫిర్యాదులు అందుతున్నాయి. - (ఆంధ్రజ్యోతి, విజయవాడ)

అక్రమాలు అనేకం.. విచారణ నామమాత్రం

యనమలకుదురు ఆలయంలో అక్రమాల విచారణపై అనుమానాలు

ఈవో భవానీ అవినీతిపై మాత్రమే ఆరా

మాజీ ఈవో గంగాధర్‌ ఊసెత్తరేం..?

ఆయన హయాంలోనూ అక్రమాలు కోకొల్లలు

విచారణను కావాలనే నీరుగారుస్తున్నారా?

వేణుగోపాలస్వామి ఆలయం భూముల మాటేంటి?

యనమలకుదురు రామలింగే శ్వరస్వామి ఆలయం దిగువన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఈ గుడిని కొండపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయానికి అనుసంధానం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆలయానికి కొందరు గ్రామస్తులు గతంలో 10 ఎకరాల సాగు భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ భూమిలో కొంత భాగాన్ని కొండ దిగువన కొంతమందికి ప్రభుత్వ గజిట్‌ లేకుండా అప్పటి ఈవో గంగాధర్‌ ఇచ్చారు. 1.70 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి రిజిస్ర్టేషన్‌ చేయించారు. దాతలిచ్చిన భూములను అన్యాక్రాంతం ఎలా చేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఎండోమెంట్‌ కమిషనర్‌ ఆర్డర్‌తో చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఎండోమెంట్‌ కమిషనర్‌ ఆర్డర్‌ ఇచ్చారా? ఒకవేళ అలాంటి ఆర్డర్‌ వచ్చాక.. ప్రభుత్వ గజిట్‌ రాకుండా ఎలా రిజిస్ర్టేషన్‌ చేస్తారన్నది అనుమానంగా ఉంది. ఈ వ ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని యనమలకుదురు గ్రామస్తులు మంత్రిని కోరుతున్నారు.

కొండపై ప్రైవేట్‌ ట్రస్టా..?

యనమలకుదురు కొండపై ప్రైవేట్‌ అన్నదానం ట్రస్టును ఏర్పాటు చేశారు. కొండపై ట్రస్ట్‌ కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు ట్రస్టీలుగా కొంతమంది ప్రైవేట్‌ వ్యక్తులను నియమించారు. ఈ ట్రస్టుకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఏ ప్రాతిపదికన ఇచ్చారు? అనే దానికి సమాధానం లేదు. ప్రైవేట్‌ ట్రస్ట్‌ ఏర్పాటుకు ఈవోకు ఎలాంటి అధికారం ఉంది? ఏ ప్రాతిపదికన చేశారు? అన్నది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారం కూడా ఈవోగా గంగాధర్‌ ఉన్నప్పుడే జరిగినట్టు తెలుస్తోంది.

విచారణపై అనుమనాలు

ఈవో భవానీ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు పూజారులు సాగర్‌, పూర్ణతో పాటు రోజువారీ వేతన కార్మికుడు రోశయ్యను పోలీసులు అరెస్టు చేశారు. భవానీ పరారీలో ఉండటంతో వెతుకుతున్నారు. భవానీ హయాంలో గుమస్తాగా పనిచేసిన గంగాధర్‌కు అక్రమాలకు సంబంధించిన అంశాలపై సమాచారం తెలుసు. ఈ నేపథ్యంలో గంగాధర్‌ను కూడా విచారించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. కాగా, ఆలయాన్ని తరచూ సందర్శించే ఏసీ, డీసీ, ఆర్‌జేసీలు ఈ బాగోతాలను గుర్తించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. భవానీ.. మాచవరం ఆంజనేయస్వామి గుడిలో ఈవోగా పనిచేసినప్పుడు హుండీ సొమ్ము రూ.1.50 లక్షలు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశం వెలుగులోకి రాకుండా ఓ అధికారి కాపాడినట్టు తెలుస్తోంది. దీనినిబట్టి చూస్తే.. రామలింగేశ్వరస్వామి ఆలయంలో నెలకొన్న అక్రమాలను కూడా బయటకు రాకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Mar 21 , 2026 | 12:47 AM