సత్యం సామ్రాజ్యం
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:36 AM
రేషన్ అక్రమ బియ్యంతో పట్టుకున్న వాహనాన్ని గంటల వ్యవధిలో విడిపిస్తాడు. సీజ్ చేసిన వాహనాన్ని ఎలా తీసుకెళ్లాలో బాగా తెలుసంటూ సవాల్ విసురుతాడు. తనిఖీలు చేసిన సిబ్బందిపై ఎదురు తిరుగుతాడు. ఎన్ని కేసులు నమోదు చేసినా తన దారి ‘రేషన్’ దారేనంటాడు. అతనే పీడీఎస్ బియ్యం డాన్ కాజా సత్యనారాయణ అలియాస్ జయంతి సత్యం. మొత్తం 41 కేసులు ఉన్న సత్యంపై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపడంతో కీలక విషయాలు బయటపడుతున్నాయి.
రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంలో డాన్ అవతారం
మండలస్థాయి నుంచి ఓడల్లో విదేశాలకు పంపే వరకు..
విజిలెన్స్, సివిల్ సప్లయిస్, పోలీసు,
రాజకీయ నేతలంతా ఆయన కనుసన్నల్లోనే..
సమాచారం ఉన్నా కన్నెత్తి చూడని ‘నిఘా’ అధికారులు
తవ్వేకొద్దీ బయటకొస్తున్న నమ్మలేని నిజాలు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : జిల్లాలోని మారుమూల గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని కొనే స్థాయి నుంచి ఏకంగా ఓడల ద్వారా విదేశాలకు పంపే స్థాయి ఎదిగాడు రేషన్ డాన్ జయంతి సత్యం. ఒక్కో దశను దాటుకుని డాన్‌గా ఎదగడం వెనుక కొంతమంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బియ్యం అక్రమ రవాణాలో అతనికి ఎదురైన ప్రతి అడ్డంకినీ నోట్ల కట్టల ద్వారా పరిష్కరించుకుంటూ వచ్చాడు. ఆ కారణంగానే క్షేత్రస్థాయి సిబ్బందిని లెక్క చేసేవాడు కాదు. కేసులు కొత్త కాదంటూ పలుమార్లు తనిఖీల సమయంలో వ్యాఖ్యలు చేశాడు.
వైసీపీ హయాంలో విచ్చలవిడిగా..
సత్యం 2011 నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా వేగం పెంచాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యాపార విస్తరణకు అడ్డు లేకుండాపోయింది. సత్యం తండ్రి నాటుసారా కాసేవాడు. అప్పుడే రాబోయే రోజులన్నీ రేషన్ బియ్యానివే అని అంచనా వేశాడు. ముందు జయంతి గ్రామంలో రేషన్ బియ్యం కొనేవాడు. తర్వాత నెమ్మదిగా పక్క గ్రామంలో పాగా వేశాడు. అనంతరం మండలస్థాయి అక్రమ వ్యాపారాన్ని విస్తరించి, అక్కడి నుంచి నియోజకవర్గ స్థాయికి పెంచాడు. ఆ తర్వాత నుంచి ఎలాంటి స్పీడు బ్రేకర్లు లేకుండా కాకినాడ పోర్టుకు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కటకటాల వెనక్కి వెళ్లడానికి ముందు వరకు సత్యం ఈ దారిలోనే అడుగులు వేశాడు. తొలుత గ్రామంలో కొన్న బియ్యాన్ని వీరులపాడులో ఉండే బీరు తయారీ కంపెనీకి సరఫరా చేసేవాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి సరఫరా ఆపేశాడు. మొత్తం బియ్యాన్ని కాకినాడ రేవులో లంగరేసిన నౌకలోకి పంపించేవాడు.
అన్నీ ముడుపులే..
సత్యంపై 41 కేసులు ఉన్నప్పటికీ బియ్యం అక్రమ రవాణాలో చెలరేగిపోవడానికి కొంతమంది అధికారుల అండే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే అధికారాలు ఉన్న సివిల్ సప్లయిస్, రెవెన్యూ, విజిలెన్స్, పోలీసు విభాగాల్లో కొంతమంది అధికారులను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. సరుకుతో బయల్దేరిన వాహనం జిల్లా సరిహద్దులు దాటేలోగా ఎక్కడ పట్టుకున్నా ఇబ్బంది లేకుండా అధికారులకు ముడుపులు పంపేవాడు. సరుకును వాహనాల్లోకి ఎక్కించడానికి, దించడానికి ఏర్పాటు చేసుకున్న అనుచరులతో ఈ ముడుపులు పంపేవాడు. జిల్లా నుంచి పీడీఎస్ బియ్యం సరిహద్దు దాటుతోందన్న సమాచారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ అధికారుల వద్ద ఉంది. ఇప్పటి వరకు విజిలెన్స్ అధికారులు సత్యం వాహనాలను పట్టుకున్న దాఖలాలు లేవు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయం వరకు కొంతమంది సిబ్బందితో సత్యం సంబంధాలను కొనసాగిస్తున్నాడన్నది బహిరంగ రహస్యం.
ఆ పోలీస్ ఎవరు?
విజయవాడలో పనిచేసి ప్రస్తుతం విజిలెన్స్ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఓ పోలీసు ఉద్యోగి పలుమార్లు సత్యంతో భేటీలు నిర్వహించినట్టు తెలిసింది. వైసీపీ హయాంలో ఒక ఎస్‌ఐ సత్యం వాహనాలను పట్టుకుని తనపై ఉన్న ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించాడు. తర్వాత రెండు రోజులకు సత్యం ఆ ఎస్‌ఐ ముందే సీజ్ చేసిన వాహనాలను ధైర్యంగా తీసుకెళ్లాడు. అయితే, దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అధికారులతో పాటు రాజకీయ నేతలకూ ముడుపులు అందడమే ఇందుకు కారణం.