సమష్టి కృషితో జిల్లా ప్రగతి
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:39 AM
కుల, మత, జాతి, ప్రాంత భావనలు లేకుండా జిల్లా సమగ్రత, పరిరక్షణ, పురోగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. అందరం జిల్లా అభివృద్ధిలో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనకు పథకాలు, ప్రణాళికలను ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది.
అన్ని రంగాల్లోనూ 18.5 శాతం వార్షిక వృద్ధికి కృషి
నాణ్యమైన విద్య, ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం
మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం
77వ గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ లక్ష్మీశ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ) : కుల, మత, జాతి, ప్రాంత భావనలు లేకుండా జిల్లా సమగ్రత, పరిరక్షణ, పురోగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. అందరం జిల్లా అభివృద్ధిలో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనకు పథకాలు, ప్రణాళికలను ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ను పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, డీసీపీ కృష్ణకాంత పటేల్, డీఆర్వో లక్ష్మీనరసింహం, ఆర్డీవో కావూరి చైతన్య సాదరంగా ఆహ్వానించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పలు కంటెంటెంట్ల నుంచి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి ఎందరో మహనీయులను తన ప్రసంగంలో కలెక్టర్ స్మరించుకున్నారు.
పీ4తో పేదరిక నిర్మూలన
సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పీ4 పథకం పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. జిల్లాలో 98,408 బంగారు కుటుంబాలకు 5,401 మంది మార్గదర్శకులకు అనుసంధానం చేశామని వెల్లడించారు. యువతలో సామాజిక బాధ్యత, సేవా దృక్పథాన్ని పెంచేందుకు వాసవ్య మహిళా మండలితో కలిసి వినూత్నంగా టైమ్ బ్యాంక్ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌కు సులభంగా చేర్చేందుకు ఏఐ ఫర్ ష్యూర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లోనూ జిల్లా 18.5 శాతం వార్షిక వృద్ధి సాధించేందుకు పటిష్ట ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. పొలంబడి కార్యక్రమంలో అత్యుత్తమ విధానాలను అమలుచేస్తూ వ్యవసాయ రంగం వృద్ధిని సాధిస్తున్నామన్నారు. మన మిత్ర, వాట్సాప్ గవర్నెన్స, ఈ-పంట, యాంత్రీకరణ, ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతులకు సాంకేతిక సమాచారాన్ని అందిస్తున్నామన్నారు. గత ఖరీఫ్‌లో 24,650 మంది రైతుల నుంచి 1,18,963 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొని రూ.431 కోట్లను జమ చేశామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులతో పాటు ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రూ.42 కోట్లతో విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన జరిగిందన్నారు. పదో తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కార్యాచరణ రూపొందించామని, ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు 75 రోజుల ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వాసుపత్రిలో సమస్యలు తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా 4,654 సర్వీసులు ఇచ్చామని, రూ.44.16 కోట్ల రాయితీలు కల్పించామని చెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా 15.5 మెగావాట్ల సౌర విద్యుతను ఉత్పత్తి చేసి 6,289 వ్యవసాయ సర్వీసులకు అందించేందుకు టెండర్లు పూర్తి చేశామన్నారు. పర్యాటకుల కోసం ఆంధ్రా ట్యాక్సీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ వివరించారు. నవోదయం 2.0 ద్వారా జిల్లాలో 26 నాటుసారా ప్రభావిత గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, నాటుసారాపై ఆధారపడిన 88 మందికి రూ.96 లక్షలతో ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించామన్నారు. ప్రజా సమస్య పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) ద్వారా ఇప్పటి వరకు 54 వేల అర్జీలు వచ్చాయని, వీటిలో 99 శాతం గడువులోగా పరిష్కరిస్తున్నామన్నారు. ఈ వేడుకలకు 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన లంకా దినకర్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన ఫరూఖ్ షుబ్లీ, డీసీపీలు తిరుమలేశ్వరరెడ్డి, లక్ష్మీనారాయణ, కేజీవీ సరిత, ఉదయరాణి, కృష్ణప్రసన్న, ఎస్వీడీ ప్రసాద్ హాజరయ్యారు.
ఆకట్టుకున్న కవాతు, శకటాలు
ఎన్టీఆర్ జిల్లాలో మొదటిసారిగా జిల్లాస్థాయిలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో వివిధ దళాల కవాతు, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కంటెంజెంట్‌లు.. ముఖ్య అతిథికలెక్టర్ లక్ష్మీశకు గౌరవ వందనం సమర్పించారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వ శాఖలు తీసుకుంటున్న చొరవను ఆయా శాఖలు శకటాల ద్వారా ప్రదర్శించారు. ముందుగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం శకటం ప్రదర్శన ప్రారంభించారు. ఆ తరువాత జిల్లాస్థాయి పీ4, గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పర్యాటక, విద్య, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, జనవనరులు, అటవీ, వ్యవసాయ, పంచాయతీరాజ్, పశు సంవర్ధక, ఉద్యాన, సూక్ష్మ నీటిపారుదల, సంచార పశు ఆరోగ్యసేవ, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన, రవాణా, అగ్నిమాపక శకటాల ప్రదర్శన జరిగింది. హెల్మెట్ ఆవశ్యకతపై రవాణా శాఖ నిర్వహించిన లఘు నాటకం ఆలోచింపజేసింది. అగ్నిమాపక శాఖ అధికారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నీటితో జాతీయ జెండా రంగులను చిమ్మి అబ్బురపరిచారు. పలు పాఠశాలల విద్యార్థులు, డ్యాన్స్ అకాడమీల చిన్నారులు చేసిన నృత్యాలు, కోలాటం అలరించాయి.