జాతీయ రహదారులను అభివృద్ధి చేయండి
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:50 AM
మచిలీపట్నం పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు ప్రారంభమయ్యే నాటికి ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సూచించారు. మచిలీపట్నంలోని ఎంపీ బాలశౌరి కార్యాలయంలో శుక్రవారం ఎంపీ బాలశౌరితో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా ఎమ్మెల్యేలు, జాతీయ రహదారులు, మోర్త్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మచిలీపట్నం-విజయవాడ ఎన్‌హెచ్ ఆరులేన్లుగా అభివృద్ధి
తీరాన్ని కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణానికి రూపకల్పన
మచిలీపట్నం వద్ద క్రాస్ క్లోవర్ లీఫ్‌నమూనాలో రోడ్డు నిర్మాణం
ఎమ్మెల్యేలు, ఎన్‌హెచ్ అధికారుల సమావేశంలో ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు ప్రతిపాదనలు
మచిలీపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : మచిలీపట్నం పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు ప్రారంభమయ్యే నాటికి ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సూచించారు. మచిలీపట్నంలోని ఎంపీ బాలశౌరి కార్యాలయంలో శుక్రవారం ఎంపీ బాలశౌరితో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా ఎమ్మెల్యేలు, జాతీయ రహదారులు, మోర్త్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టును ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభిస్తామన్నారు. పోర్టు నుంచి సరుకుల ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా ఉండేలా జిల్లాలో రూ.450 కోట్లతో జాతీయ రహదారులను అనుసంధానం చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిని రూ.2 వేల కోట్ల అంచనాతో ఆరు లేన్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు జనాభా పెరుగుదల తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి రింగ్‌రోడ్డును 189.930 కిలోమీటర్ల మేర రూ.38 వేల కోట్లతో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గుడివాడలో రూ.25 కోట్లతో జాతీయ రదారులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులన్నింటికీ డీపీఆర్‌లు తయారుచేయడంతో పాటు అనుమతులు త్వరగా మంజూరయ్యేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లక్షకుపైగా జనాభా ఉంటున్న కృష్ణలంకలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు రహదారి విస్తరణలో మార్పులు చేయాలన్నారు. పెనమలూరు-బెంజిసర్కిల్ మధ్య ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలన్నారు. జాతీయ రహదారులు 16, 65ను అనుసంధానం చేసేలా డీపీఆర్‌ను త యారు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
ఎన్‌హెచ్ 216 విస్తరణకు డీపీఆర్ తయారు చేయండి
అమరావతి రింగ్‌రోడ్డు.. ఉయ్యూరు మండలం వల్లూరు వద్ద కలుస్తుందని, దీనికి అనుబంధంగా మచిలీపట్నం, పామర్రు, గుడివాడ ప్రాంతాల్లోని జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి 216ను కృత్తివెన్ను మండలం లోసరి నుంచి కోడూరు మండలంలోని ఉల్లిపాలెం వరకు సముద్రతీరం వెంబడి నిర్మించేలా డీపీఆర్ తయారు చేయాలన్నారు. ఈ రహదారి.. ప్రకృతి విపత్తుల నుంచి తీరప్రాంతాన్ని రక్షించేలా, కరకట్ట మాదిరిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేయడంతో పాటు చిలకలపూడి, బందరుకోట, కరగ్రహారం, పోతేపల్లి ప్రాంతాల్లో పోర్టు నుంచి సరుకుల రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు త్వరగా అనుమతులు తీసుకురావాలన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి, అనుసంధానంపై నివేదికలు ఇస్తే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లి ఈ ప్రతిపాదలను వివరిస్తారని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్.. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి సాస్కి నిధులు రూ.100 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మచిలీపట్నం వద్ద జాతీయ రహదారులు కలిసే ప్రాంతంలో క్రాస్‌క్లోవర్ లీఫ్ నమూనాలో రహదారి నిర్మాణం ప్రతిపాదనను పక్కనపెట్టి, ఫ్లై ఓవర్ నమూనాలో పోర్టు వరకు రోడ్డు నిర్మించేలా ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
ఎమ్మెల్యేల మాట
పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా మాట్లాడుతూ తాడిగడప అండర్ టన్నెల్ వద్ద కొద్దిపాటి వర్షానికే నీరు నిలిచిపోతోందని, దీంతో ఈ ప్రాంతంలో రహదారులు దెబ్బతింటున్నాయన్నారు. ఈ అండర్ టన్నెల్ వద్ద మెరక చేయాలని సూచించారు. పామర్రు-చల్లపల్లి రహదారిని రాష్ట్ర రహదారి నుంచి జాతీయ రహదారిగా మార్చి అభివృద్ధి చేయాలన్నారు.
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ కంకిపాడు-గుడివాడ మధ్య రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. గుడివాడ పట్టణంలో జాతీయ రహదారులపై నీరు నిలబడిపోతోందని, రహదారులకు ఇరువైపులా డ్రెయినేజీ సౌకర్యాన్ని మెరుపరచాలన్నారు.
పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ బెంజిసర్కిల్-ఈడుపుగల్లు మధ్య జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరిగిపోతోందని, నియంత్రణకు ఈ ప్రాంతాల మధ్య ఫ్లై ఓవర్ నిర్మించాలన్నారు.
పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జాతీయ రహదారి 216పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అర్తమూరు, యండపల్లి, మునిపెడ గ్రామాల వద్ద అప్రోచ్ రోడ్లు, పెడన వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం సక్రమంగా జరగడం లేదని, ఈ పనులు పూర్తి చేయాలని సూచించారు.
గన్నవరం నియోజకవర్గం ప్రత్యేక అధికారి షాహిద్‌బాబు మాట్లాడుతూ కేసరపల్లి జంక్షన్ వద్ద పిన్నమనేని ఆసుపత్రి, పెదఅవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జాతీయ రహదారుల విభాగం అధికారి ఆర్‌కే సింగ్, పీడీ విద్యాసాగర్, రాష్ట్ర రహదారుల అధికారి హరికృష్ణ, అమరావతి రింగ్‌రోడ్డు పీడీ పార్వతీశం, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డ్డీవోలు కె.స్వాతి, బాలసుబ్రహ్మణ్యం, హేలాషారోన్, జిల్లా సహకార మార్కెటింగ్ చైర్మన్ బండి రామకృష్ణ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.