Share News

కష్టపరిహారం

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:28 AM

మొంథా, దిత్వా తుఫాన్ల కారణంగా కురిసిన వర్షాలు, గాలులకు పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు పరిహారం అందలేదు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది పంటనష్టం అంచనాలను తయారుచేసి డిసెంబరులోనే ప్రభుత్వానికి పంపారు. అయితే, ఇంతవరకు నష్టపరిహారం విడుదల కాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కష్టపరిహారం
తుఫాను కారణంగా చేతికొచ్చే దశలో నేలవాలిన వరి

మొంథా, దిత్వా తుఫాన్ల పంట నష్టపరిహారం ఎప్పటికో

డిసెంబరులోనే నివేదిక ప్రభుత్వానికి అందజేత

మూడు నెలలైనా ఇంతవరకు జమకాని నగదు

30,454 హెక్టార్లలోని వరి, ఇతర పంటలకు నష్టం

60,055 మంది రైతులకు రూ.75.71 కోట్లు ఇవ్వాలి

ఉద్యాన పంటలకు మరో రూ.73.45 కోట్లు

ప్రభుత్వం స్పందించి పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : గత ఏడాది నవంబరు, డిసెంబరులో మొంథా, దిత్వా తుఫాన్ల కారణంగా భారీవర్షం కురిసింది. మొంథా తుఫాను తీరం దాటే సమయంలో జిల్లాలో 90 కిలోమీటర్ల కంటే వేగంగా గాలులు వీచాయి. దీంతో 427 గ్రామాల్లో 46,357 హెక్టార్లలో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖల అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 33 శాతం కంటే అధికంగా 30,454 హెక్టార్లలో పంటనష్టం జరిగిందని లెక్క తేల్చారు. జిల్లాలో 60,055 మంది రైతులు సాగుచేసిన వరి, మినుము, వేరుశెనగ, పత్తి, తదితర పంటలకు నష్టం వాటిల్లిందని, రూ.75.71 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని తుది నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. సంక్రాంతి పండుగ నాటికి లేదా జనవరి చివరకు పరిహారం విడుదల అవుతుందని అంతా ఆశించారు. కానీ, మూడు నెలలు గడిచినా రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఒకవేళ పరిహారం బ్యాంకుల్లో, పీఏసీఎస్‌లలో జమ అయితే.. ఇప్పటికే రైతులు తీసుకున్న పంటరుణాన్ని మినహాయించి, మిగిలిన నగదును ఇచ్చే వెసులుబాటు ఉంది.

ఉద్యాన పంటలకు రూ.73.45 కోట్ల నష్టం

తుఫాన్ల కారణంగా జిల్లాలోని తోట్లవల్లూరు, చల్లపల్లి, అవనిగడ్డ, మోపిదేవి, కంకిపాడు, ఉయ్యూరు తదితర మండలాల్లో ఉద్యాన పంటలకు తీరని నష్టం వాటిల్లింది. జిల్లాలో 2,229 మంది రైతులు సాగుచేసిన అరటి, కంద, తమలపాకు, కూరగాయల తోటలు 1,416.22 హెక్టార్లలో దెబ్బతిన్నట్టుగా ఉద్యాన శాఖ అధికారులు నివేదిక తయారు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉద్యాన పంటలకు రూ.73.45 కోట్ల మేర నష్టపరిహారంగా చెల్లించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

వరి హెక్టారుకు రూ.25 వేలు

తుఫాన్ల కారణంగా ఈ ఏడాది వరిలో దిగుబడి తగ్గింది. ఎంటీయూ 1061, 1318 తదితర ముతక రకాలు ఎకరాకు 30 బస్తాలు, బీపీటీ-5204, ఇతర సన్నరకాల ధాన్యం 22 బస్తాలకు మించి దిగుబడి రాలేదని రైతులు చెబుతున్నారు. పంట దిగుబడి తగ్గినా వివిధ కారణాలు చూపి పరిహారం జాబితాల్లో అధిక శాతం పేర్లు నమోదు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరికి పరిహారంగా హెక్టారుకు రూ.25 వేలు, అరటి తోటలకు రూ.35 వేల చొప్పున ఇవ్వాలి. ఈ జాబితాలు గ్రామ, మండలస్థాయిలో తయారు చేశాక.. వాటిని ఈ-క్రాప్‌లో నమోదు చేశారా, లేదా అనే అంశాన్ని పరిశీలించాలి. రైతుల ఖాతాలకు ఆధార్‌కార్డు నెంబర్లు అనుసంధానమై ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి. ప్రత్యేక యాప్‌ ద్వారా ఒకకుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా, ఆ కుటుంబానికి 5 ఎకరాలకే పరిహారం విడుదల చేస్తారు. ఈ లెక్కలు సరిచూశారా లేదా అనే అంశంపైనా సందిగ్ధం ఏర్పడింది.

కౌలు రైతులకు పంటబీమా వచ్చేనా?

జిల్లాలో 2025-26 సంవత్సరంలో 60 వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. వీరిలో 10,153 మందికి రూ.52.03 కోట్లను పంట రుణాలుగా అందించారు. పంట నష్టపోయిన కౌలురైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేస్తారా, లేదా అనే అంశంపైనా అనుమానాలు కలుగుతున్నాయి.

Updated Date - Mar 08 , 2026 | 01:28 AM