వీఐపీ కారిడార్.. పంచాయితీ
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:51 AM
‘వనరులు లేక అల్లాడు తున్నాం. మీరు బాధ్యత తీసుకోండి. శానిటేషన్ నిర్వహణ మా ఒక్కరి వల్ల కాదు. మీరు తోడ్పాటు అందించకపోతే కష్టం. కనీసం మీరు మా గ్రామాల్లో వసూలుచేస్తున్న బిల్డింగ్ ఫీజులు, జరిమానాల్లో సగం మాకు కేటాయించండి. లేకపోతే శానిటేషన్‌ను ముందుకు తీసుకెళ్లలేం. పనులు చేయలేం..’ అంటూ సీఆర్‌డీఏ అధికారులకు ఎన్‌హెచ్-16పై వీఐపీ కారిడార్ గ్రామ పంచాయతీలు అల్టిమేటం జారీ చేశాయి.
సీఆర్‌డీఏ వర్సెస్ పంచాయతీలు
జాతీయ రహదారిలో పారిశుధ్య పనులపై వివాదం
వనరులు లేవు.. పనులు చేయలేమన్న పంచాయతీలు
తోడ్పాటు అందిస్తేనే సాధ్యమని స్పష్టీకరణ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ‘వనరులు లేక అల్లాడు తున్నాం. మీరు బాధ్యత తీసుకోండి. శానిటేషన్ నిర్వహణ మా ఒక్కరి వల్ల కాదు. మీరు తోడ్పాటు అందించకపోతే కష్టం. కనీసం మీరు మా గ్రామాల్లో వసూలుచేస్తున్న బిల్డింగ్ ఫీజులు, జరిమానాల్లో సగం మాకు కేటాయించండి. లేకపోతే శానిటేషన్‌ను ముందుకు తీసుకెళ్లలేం. పనులు చేయలేం..’ అంటూ సీఆర్‌డీఏ అధికారులకు ఎన్‌హెచ్-16పై వీఐపీ కారిడార్ గ్రామ పంచాయతీలు అల్టిమేటం జారీ చేశాయి. ఆర్థిక ఇబ్బందులు, పరిమిత యాంత్రిక వనరులు, పారిశుధ్య కార్మికుల కొరత వంటి సమస్యలతో అల్లాడుతున్న పంచాయతీలకు వీఐపీ కారిడార్‌లో శానిటేషన్ బాధ్యతలను నిర్వహించటం భారంగా మారుతోంది. దీంతో పంచాయతీలు తమ డిమాండ్లను సీఆర్‌డీఏ ముందుపెట్టాయి. కలెక్టర్ లక్ష్మీశకు కూడా సమస్యలు చెప్పుకొన్నాయి.
సిబ్బంది లేక ఇబ్బందులు
ఎయిర్‌పోర్టు కారిడార్ (వీఐపీ కారిడార్) శానిటేషన్ నిర్వహణ విషయంలో పంచాయతీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఎయిర్‌పోర్టు నుంచి రామవరప్పాడు రింగ్‌రోడ్డు వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర ఈ వీఐపీ కారిడార్ ఉంది. ఇక్కడ గ్రీనరీ మెయింటినెన్స్ బాధ్యతలను అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) చూస్తుండగా, శానిటేషన్ బాధ్యతలను మాత్రం స్థానిక పంచాయతీలకే అప్పగించారు. రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి, కేసరపల్లి పంచాయతీలు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు షిఫ్టుల్లో శానిటేషన్ పనులు చేస్తుంటారు. దాదాపు 15 కిలోమీటర్ల పొడవున రెండువైపులా జాతీయ రహదారిని శుభ్రం చేయటం పంచాయతీల పరిధిలో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి భారంగా మారింది. సొంత నిధులు కానీ, మొన్నటి వరకు ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు కానీ సరిపోని పరిస్థితి ఏర్పడింది. అలాగే, పంచాయతీల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. అదనంగా తీసుకోవాలనుకుంటే ఇబ్బందులే ఏర్పడతాయి. శానిటేషన్ అంటే ఊడ్చటమే కాదు. జాతీయ రహదారిపై పేరుకున్న దుమ్మును తొలగించాలి. డ్రెయిన్లను శుభ్రం చేయాలి. వాక్యూమ్ క్లీనర్లు, డోజర్లు, డ్రెయిన్ క్లీనింగ్ యంత్రాలతో పాటు జేసీబీలు కూడా కావాలి. ఇవన్నీ లేకపోవటం వల్ల వీఐపీ కారిడార్‌లో పూర్తిస్థాయిలో శానిటేషన్‌ను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. వీఐపీ కారిడార్‌లో కార్పొరేషన్ స్వీపింగ్ యంత్ర వాహనాన్ని నడుపుతున్నారు. ఇది కేవలం సెంట్రల్ డివైడర్‌కు రెండువైపులా మాత్రమే శుభ్రం చేస్తుంటుంది. అది కూడా అరకొరగానే. నూటికి 95 శాతానికిపైగా పంచాయతీల్లో పారిశుధ్య సిబ్బందే ఈ పనులు చేస్తున్నారు. తగినంత సిబ్బంది లేకుండా పనులు చేస్తుండటంతో ఎక్కడ పడితే అక్కడ మట్టి, దుమ్ము ఉంటోంది. దీనికితోడు వరిగడ్డి ట్రాక్లర్ల కారణంగా చెత్త పోగవుతోంది. ఇన్ని సమస్యల మధ్య పరిమిత వనరులతో పనిచేయలేమని పంచాయతీలు అల్టిమేటం జారీ చేయటంతో సీఆర్‌డీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.