Share News

చతుర్ముఖ వ్యూహం

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:42 AM

తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కోల్‌కతా నుంచి బందరు పోర్టుకు వేగవంతమైన ప్రయాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఆయా రవాణా మార్గాలను అనుకూలంగా మార్చేందుకు చతుర్ముఖ వ్యూహాలను అనుసరించనున్నారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులతో విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని శివనాథ్‌, వల్లభనేని బాలశౌరి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ అంశమే ప్రధానంగా సాగింది.

చతుర్ముఖ  వ్యూహం

బందరు పోర్టుతో తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కోల్‌కతాకు కనెక్టవిటీ

ఎంపీలు, ఎన్‌హెచ్‌ అధికారుల సమావేశంలో చర్చ

తెలంగాణా నుంచి రెండు మార్గాలకు అనుసంధానం

ఎన్‌హెచ్‌-65, 216హెచ్‌ విస్తరణకు ఎంపీల డిమాండ్‌

ఓఆర్‌ఆర్‌ మొదలైతే అమరావతి మీదుగా హైదరాబాద్‌కు..

(ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం/విజయవాడ) : తెలంగాణా నుంచి బందరు పోర్టుకు వెళ్లడానికి ఎన్‌హెచ్‌-65 ఒక్కటే మార్గం. ప్రస్తుతం దీనిని ఆరు వరసలుగా విస్తరిస్తున్నారు. భవిష్యత్తులో అమరావతి ఐఆర్‌ఆర్‌, ఓఆర్‌ఆర్‌లు సాకారమయ్యే వరకు ఈ జాతీయ రహదారి మీదుగానే బందరు పోర్టుకు రాకపోకలు సాగించాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంతో పాటు మరో మార్గాన్ని కూడా విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని శివనాథ్‌, వల్లభనేని బాలశౌరి సూచించారు.

ఎన్‌హెచ్‌-216హెచ్‌తో అనుసంధానం ఇలా..

ముదినేపల్లి-నూజివీడు-కల్లూరు (ఎంఎన్‌కే) రోడ్డుగా పిలిచే ఎన్‌హెచ్‌-216హెచ్‌ను ఖమ్మంజిల్లా లక్ష్మీపురం వరకు అనుసంధానించాలని ఎంపీలు సూచించారు. గతంలో ఉన్న ప్రతిపాదన కాకుండా మచిలీపట్నం-గుడివాడ-విస్సన్నపేట-లక్ష్మీపురం వరకు మార్చి ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. హనుమాన్‌ జంక్షన్‌ వరకు విస్తరించాలన్న పాత ప్రతిపాదనపై ఎంపీ కేశినేని చిన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని నూజివీడు మీదుగా విస్సన్నపేట, తిరువూరు, లక్ష్మీపురం వరకు తీసుకెళ్తే ఎన్‌హెచ్‌-30పై రద్దీని తగ్గించటానికి అవకాశం ఉంటుందని, ప్రస్తుతం రెండు వరసలుగా ఉన్న ఎన్‌హెచ్‌-216హెచ్‌ను నాలుగు వరసలుగా మచిలీపట్నం నుంచి లక్ష్మీపురం వరకు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై జాతీయ రహదారుల సంస్థ అధికారులు సానుకూలంగా స్పందించారు.

తెలంగాణా-బందరు పోర్టు ద్విముఖ వ్యూహం

బందరు పోర్టుకు రెండువైపులా తెలంగాణా రాష్ట్రంతో అనుసంధానం ఏర్పడుతుంది. పోర్టు నుంచి ఎన్‌హెచ్‌-65 వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. మచిలీపట్నం-హైదరాబాద్‌ జాతీయ రహదారిగా ఈ ఎన్‌హెచ్‌-65 ఉంది. త్వరలో ఏర్పడబోయే అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌)కు బందరు పోర్టు అనుసంధానం అవుతుంది. అప్పుడు బందరు పోర్టు వయా అమరావతి, హైదరాబాద్‌ అవుతుంది. కంచికచర్ల దిగువన ఎన్‌హెచ్‌-65కు అనుసంధానమవుతూ నేరుగా హైదరాబాద్‌ వెళ్తుంది. ఇదికాకుండా ఎన్‌హెచ్‌-216హెచ్‌ నాలుగు వరసల విస్తరణ ప్రతిపాదనతో ఖమ్మంజిల్లా నుంచి తిరువూరు, విస్సన్నపేట, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌, గుడివాడ, మచిలీపట్నం వరకు వాయువ్య, ఉత్తర దిశలో అనుసంధానమవుతుంది. దీంతో బందరు పోర్టుకు రెండు వైపులా తెలంగాణా రాష్ర్టానికి మార్గం ఏర్పడుతుంది.

ఒడిశా, కోల్‌కతాతో కనెక్టవిటీ ఇలా..

బందరు పోర్టు తెలంగాణాకే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కోల్‌కతాకు కూడా అనుసంధానం అవుతుంది. కత్తిపూడి-ఒంగోలు మార్గం అయిన ఎన్‌హెచ్‌-216 మచిలీపట్నం అవుటర్‌ నుంచి వెళ్తుంది. ఇది ఎన్‌హెచ్‌-65కు అనుసంధానం అవుతుంది. కత్తిపూడి దాటాక ఎన్‌హెచ్‌-216.. ఎన్‌హెచ్‌-16ను కలుస్తుంది. దీనిని బట్టి చూస్తే బందరు పోర్టుతో ఒడిశా, కోల్‌కతాకు కూడా అనుసంధానం ఏర్పడినట్టే. అలాగే, ఛత్తీస్‌గఢ్‌తో కూడా బందరు పోర్టుకు కనెక్టవిటీ ఏర్పడుతుంది. తిరువూరు ఎగువన ఎన్‌హెచ్‌-30కు ఎన్‌హెచ్‌ 216హెచ్‌ అనుసంధానం కావటం వల్ల ఛత్తీస్‌గఢ్‌కు కూడా మార్గం సుగమం అవుతుంది.

ఉమ్మడి కృష్ణాకు మహర్దశ

ఎన్‌హెచ్‌-216హెచ్‌ను విస్తరించటం ద్వారా బందరు పోర్టుకే కాకుండా ఉమ్మడి కృష్ణాజిల్లాకు మహర ్దశ కలుగుతుంది. ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. ప్రత్యామ్నాయ మార్గం వల్ల ఉమ్మడి జిల్లా ప్రజలు తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. పెట్టుబడులను ఆకర్షించడానికి, పర్యాటకాభివృద్ధికి దోహదపడనుంది. ప్రధాన జాతీయ రహదారులపై రద్దీని కొంతవరకు తగ్గించగలగటంతో పాటు ప్రమాదాలను కూడా అరికట్టవచ్చు.

Updated Date - Jan 04 , 2026 | 12:42 AM