ఆక్వా అవసరం
ABN , Publish Date - Mar 14 , 2026 | 01:03 AM
అన్నదాతల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం పల్లెలో పండుగలా జరిగింది. గన్నవరంలోని సూరంపల్లిలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. ఎక్కడచూసినా పచ్చటి కండువాలు.. చెరగని చిరునవ్వులే కనిపించాయి. సీఎం చంద్రబాబు రైతులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడం, సాగుపై వివరణలతో కూడిన సూచనలు అందజేయడంపై కర్షకుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ఉమ్మడి కృష్ణాలో సాగు పెంచాలని సీఎం చంద్రబాబు సూచన
డెయిరీ, పౌలీ్ట్ర, ఆక్వా, హార్టికల్చర్ పంటలకే డిమాండ్
వరి దగ్గరే ఆగిపోతే భవిష్యత్తులో కష్టమే..
ప్రత్యామ్నాయ పంటల సాగు అత్యవసరం
ఏఐ, డ్రోన్ సాంకేతికతను విస్తృతంగా అందిస్తా
అవగాహన పెంచుకోవాలని రైతులకు హితవు
సూరంపల్లిలో పండుగలా ‘అన్నదాత సుఖీభవ’
ఉమ్మడి కృష్ణాలో 2.24 లక్షల మందికి రూ.142.49 కోట్లు జమ
రైతులతో మమేకమై పంట పొలాల్లో తిరిగిన సీఎం
(ఆంధ్రజ్యోతి-విజయవాడ సిటీ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆక్వా ఉత్పత్తులు పెరగాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కూడా అధిక సంఖ్యలోనే చేపలు, రొయ్యలు ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తిని పెంచాలని సూచించారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను గన్నవరం మండలంలోని సూరంపల్లి గ్రామంలో ఆయన శుక్రవారం విడుదల చేశారు. ఈ పథకం ద్వారా కృష్ణాజిల్లాలోని 1,06,252 మంది రైతులు రూ.74.8 కోట్లు, ఎన్టీఆర్ జిల్లాలో 1.18 లక్షల మంది రైతులు రూ.67.69 కోట్లు లబ్ధి పొందారు. సీఎం విడుదల చేసిన ఐదు నిమిషాల్లోనే 99 శాతం మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులను పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. అలాగే, ఆకుకూరలు, పండ్లు, కూరగాయల (హార్టికల్చర్) పంట ఉత్పత్తులు పెంచాలని సూచించారు. అయితే, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ ఉందన్నారు. పురుగు మందులు, రసాయన ఎరువులు వినియోగించి సాగు చేసిన పంట ఉత్పత్తులను ప్రజలు ఇష్టపడట్లేదని చెప్పారు. సేంద్రియ పద్ధతిలో సాగుకు రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రసాయన అవశేషాల కారణంగా ఎంతోమంది వ్యాధులకు గురవుతున్న విషయాన్ని సీఎం సభలో ప్రస్తావించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు చొరవతో రాష్ట్రంలో పామాయిల్ సాగు ప్రారంభమైందని గుర్తుచేశారు.
ఏఐ, డ్రోన్ సాంకేతికతను చేరువ చేస్తా
ఏఐ, డ్రోన్ సాంకేతికతను రైతులకు చేరువ చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికే కొందరు రైతులు ఈ టెక్నాలజీని వాడుతున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఏఐ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని రైతులకు సూచించారు. ఒక్క క్లిక్‌తోనే ఎంతో సమాచారం ఇచ్చే టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలన్నారు. భూసారం, పంటలకు ఆశించే చీడపీడల నివారణ, భూమి కొలతలు.. ఇలా అన్నింటినీ స్వతహాగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో రైతులకు వీటిపై శిక్షణ ఇప్పిస్తామన్నారు.
చింతలపూడి ప్రాజెక్ట్ నిర్మిస్తాం..
కృష్ణాడెల్టా సాగునీటి అవసరాల కోసం చింతలపూడి ప్రాజెక్టుపై దృష్టిసారిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంతంలో ఎంతోమంది రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవన్నారు. త్వరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
నీటి ఆదా పాటించాలి
రానున్న ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ఉందని, సాగునీటి ఎద్దడి ఉండే అవకాశం ఉందన్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మే 15 నాటికే నారుమడులు పోయాలని సూచించారు. వర్షాలు పడినపుడు నీటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది కృష్ణాడెల్టా, రిజర్వాయర్లలో సాగునీటి అవసరాలు పోనూ 65 శాతం నీటిని ఆదా చేసినట్లు ఆయన వివరించారు. భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో ఉండటం ఊరటనిచ్చే అంశమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి ఆదా పాటించాలని కోరారు.
ప్రత్యామ్నాయ పంటలే మేలు
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని, దీనికి అనుగుణంగానే పంట ఉత్పత్తులు సాధిస్తే మార్కెటింగ్ సులువు అవుతుందని జిల్లా రైతాంగానికి సీఎం చంద్రబాబు సూచించారు. ప్రపంచ ఆహార అవసరాలను పరిశీలిస్తే.. డెయిరీ, పౌలీ్ట్ర, ఆక్వా, హార్టికల్చర్ పంటలకు వరుస క్రమంలో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ వరుసలో చివరి స్థానంలో ఉన్న వరి ఉత్పత్తులకు ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రజలు దూరంగా ఉంటున్నారని వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.