Share News

క్లోవర్‌ రిలీఫ్‌

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:38 AM

హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 65) విస్తరణ నేపథ్యంలో క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్ల అవసరం ఏర్పడింది. అమరావతి రాజధాని ప్రాంత (సీఆర్‌డీఏ) పరిధి చుట్టూ నిర్మించనున్న ఇన్నర్‌, అవుటర్‌ రింగ్‌ రోడ్లు.. ఎన్‌హెచ్‌-65కు అనుసంధానమయ్యే జంక్షన్ల వద్ద వీటిని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ వస్తోంది. భవిష్యత్తులో నిర్మించేవే అయినా.. ప్రస్తుత డీపీఆర్‌లో వీటిని పొందుపరచటం ద్వారా అమరావతి ప్రాంతానికి తేలికైన నెట్‌వర్క్‌ సాధ్యమవుతుంది.

క్లోవర్‌ రిలీఫ్‌

ఎన్‌హెచ్‌ 65 విస్తరణలో కీలకాంశం

గొల్లపూడి బైపాస్‌ కలిసేచోట మాత్రమే ప్రతిపాదన

మరో నాలుగు క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్లకు డిమాండ్‌

ఐఆర్‌ఆర్‌, ఓఆర్‌ఆర్‌లు.. ఎన్‌హెచ్‌ 65 కలిసేచోట అవసరం

అమరావతికి అనుసంధానంగా భవిష్యత్తుకు మంచిమార్గం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 65) విస్తరణ నేపథ్యంలో క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్ల అవసరం ఏర్పడింది. అమరావతి రాజధాని ప్రాంత (సీఆర్‌డీఏ) పరిధి చుట్టూ నిర్మించనున్న ఇన్నర్‌, అవుటర్‌ రింగ్‌ రోడ్లు.. ఎన్‌హెచ్‌-65కు అనుసంధానమయ్యే జంక్షన్ల వద్ద వీటిని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ వస్తోంది. భవిష్యత్తులో నిర్మించేవే అయినా.. ప్రస్తుత డీపీఆర్‌లో వీటిని పొందుపరచటం ద్వారా అమరావతి ప్రాంతానికి తేలికైన నెట్‌వర్క్‌ సాధ్యమవుతుంది.

ఐఆర్‌ఆర్‌లో ఇలా..

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) డీపీఆర్‌ పూర్తి కావటంతో పాటు మొదటి దశలో కేతనకొండ నుంచి చోడవరం వరకు 67 కిలోమీటర్ల మేర భూ సేకరణ, సమీకరణ ప్రక్రియకు సీఆర్‌డీఏ సిద్ధమవుతోంది. కాబట్టి ఈ రోడ్డు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎక్కడెక్కడ ఎన్‌హెచ్‌-65కు అనుసంధానం అవుతుందో అక్కడ క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్లను ప్రతిపాదించాలి. ఈ రోడ్డు కేతనకొండ దగ్గర నుంచి మొదలవుతుంది. నున్న, కేసరపల్లితో పాటు ఉప్పులూరు, పెనమలూరు, చోడవరం మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కేతనకొండ దగ్గర ఇన్నర్‌ ప్రారంభమైతే.. దీనికి అనుసంధానంగా కృష్ణానది మీదుగా ఐకానిక్‌ బ్రిడ్జి నేరుగా రాజధాని కోర్‌ ఏరియాకు వెళ్తుంది. ఎన్‌హెచ్‌ 65తో పాటు సమీపంలోనే విజయవాడ-ఛత్తీస్‌గఢ్‌ జాతీయ రహదారి 30 కూడా ఉంది. ఈ ప్రాంతంలో క్లోవర్‌ లీఫ్‌ ఎన్‌హెచ్‌-65కు అనుసంధానమవుతుంది. బెంజిసర్కిల్‌ నుంచి గంగూరు వరకు 9.5 కిలోమీటర్ల ఫ్లై ఓవర్‌ ప్రతిపాదన ఉంది. కాబట్టి ఇక్కడ కూడా క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్‌ అవసరముంది.

ఓఆర్‌ఆర్‌లో ఇలా..

అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ఎన్టీఆర్‌ జిల్లాలో కంచికచర్ల ఎగువన ప్రారంభమవుతుంది. కంచికచర్ల బైపాస్‌ కూడా సమీపంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి వచ్చేవారు నేరుగా అమరావతికి వెళ్లడానికి ఈ ప్రాంతం కీలకం. కాబట్టి ఇక్కడ క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్‌ ఏర్పాటు చేయడం అవసరం ఉంది. కృష్ణాజిల్లాలో అవుటర్‌ రింగ్‌రోడ్డు, ఎన్‌హెచ్‌-65.. చలివేంద్రపాలెం దగ్గర అనుసంధానమవుతాయి. మచిలీపట్నం నుంచి అమరావతికి నేరుగా వెళ్లొచ్చు. బందరు పోర్టును అమరావతితో అనుసంధానించ నున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్‌ ఏర్పాటు చేయాలి.

ప్రతిపాదనలు అవసరం

ఇన్నర్‌, అవుటర్‌ రింగ్‌రోడ్ల దగ్గర మొత్తం నాలుగు క్లోవర్‌ లీఫ్‌లను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం గొల్లపూడి బైపాస్‌, ఎన్‌హెచ్‌-65ను అనుసంధానించేచోట మాత్రమే క్లోవర్‌ లీఫ్‌కు ప్రతిపాదించారు. అమరావతి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మాత్రం ఆ నాలుగు ప్రాంతాల్లోనూ అవసరం ఉంది.

Updated Date - Feb 28 , 2026 | 12:38 AM