Share News

తవ్వేకొద్దీ రేషన్‌ బియ్యం

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:54 AM

మొన్న జయంతి.. నిన్న వత్సవాయి, నాగాయలంక, గంగూరు.. ఇలా రేషన్‌ అక్రమ బియ్యం నిల్వలు భారీగా బయటపడుతున్నాయి. రెండు రోజులుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్రమ బియ్యం నిల్వలపై సివిల్‌ సప్లయిస్‌ అధికారులు దాడులు చేస్తుండగా, గంగూరులో రికార్డు స్థాయిలో 2,549 రేషన్‌ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

తవ్వేకొద్దీ రేషన్‌ బియ్యం
గంగూరులో పట్టుబడిన రేషన్‌ అక్రమ బియ్యం

జిల్లాలో రెండు రోజులుగా సివిల్‌ సప్లయిస్‌ దాడులు

ఒక్క గంగూరులోనే 2,549 రేషన్‌ బస్తాలు స్వాధీనం

జయంతి, నాగాయలంక, వత్సవాయిలో కూడా దాడులు

సీలు వేసిన గన్నీ బ్యాగులే పట్టుకుంటున్న అధికారులు

విచారణలో బయటపడుతున్న డాన్‌ల లీలలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మొన్న జయంతి.. నిన్న వత్సవాయి, నాగాయలంక, గంగూరు.. ఇలా రేషన్‌ అక్రమ బియ్యం నిల్వలు భారీగా బయటపడుతున్నాయి. రెండు రోజులుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్రమ బియ్యం నిల్వలపై సివిల్‌ సప్లయిస్‌ అధికారులు దాడులు చేస్తుండగా, గంగూరులో రికార్డు స్థాయిలో 2,549 రేషన్‌ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో అనేకచోట్ల..

ఒక్క గంగూరులోనే ఇంత భారీగా రేషన్‌ పట్టుబడగా, ఉమ్మడి జిల్లాలోని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న గోడౌన్లలో ఇంకెంత భారీస్థాయిలో నిల్వలు ఉన్నాయోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటు విజయవాడతో నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, అటు మచిలీపట్నంతో పాటు గుడివాడ, అవనిగడ్డలో భారీ నిల్వలు ఉన్నాయంటున్నారు. ఈ మేరకు గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి.

బయటపడుతున్న డాన్‌ల బాగోతం

గంగూరులోని రేషన్‌ బియ్య పట్టుకున్న గోడౌన్‌ యజమానులుగా వ్యవహరిస్తున్న కాకర్ల సాయిమోహన్‌ నాయుడు, దేసు సాంబశివరావుపై సివిల్‌ సప్లయిస్‌ అధికారులు 6ఏతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. వీరిలో దేసు సాంబశివరావు అనే వ్యక్తిపై గతంలో కూడా ఇలాంటి కేసులే నమోదయ్యాయి. బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందని వీరిద్దరినీ ఆరా తీయగా, విజయవాడ నుంచి రేషన్‌ డాన్‌ల దగ్గర కొనుగోలు చేసినట్టుగా చెప్పారు.

ఒకరు దొరికితే మరొకరు

రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారంలో డాన్‌ల మధ్య పోటీ ఏర్పడింది. మార్కెట్‌లో నిలబడటం కోసం.. ఎవరు అధికారులకు చిక్కితే వారు తమకు పోటీగా ఉన్న రేషన్‌ డాన్‌ల పేర్లను చెబుతున్నారు. ఇది సివిల్‌ సప్లయిస్‌ అధికారులకు తలనొప్పిగా మారింది. గంగూరు గోడౌన్‌లో పట్టుబడిన వారు పనిచేసేది ఓ డాన్‌ కోసం. రాజకీయంగా పలుకుబడి ఉన్న ఆయన పెనమలూరులో ఉంటాడు. తానున్నానని బయటకు తెలియకుండా కథ నడపడం ఆయన ప్రత్యేకత. తన మనుషులు పట్టుబడితే మార్కెట్‌లో తమకు పోటీగా ఉన్న వారి పేర్లు చెప్పిస్తాడు. విజయవాడలో కోటి, నరేంద్ర అనే డాన్‌ల పేర్లను గోడౌన్‌ యజమానులు చెప్పారు. కోటి గ్యాంగ్‌ అంటే.. సివిల్‌ సప్లయిస్‌, విజిలెన్స్‌ అధికారులెవరూ మారు మాట్లాడే పరిస్థితి ఉండదు. అంతలా వీరు అధికార వ్యవస్థలను మేనేజ్‌ చేస్తుంటారు. అక్రమ బియ్యాన్ని తరలించటానికి సొంత వాహనాలనే కొన్నారంటే వీరి వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. గతంలో వీరి అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురితమయ్యాయి.

సీలు వేసిన సంచులే బయటకొస్తున్నాయ్‌..

సివిల్‌ సప్లయిస్‌ అధికారులు జరుపుతున్న దాడుల్లో భారీగా రేషన్‌ బియ్యం పట్టుబడుతోంది. ఇవన్నీ డిపోలకు పంపిన సీలు వేసిన గన్నీ బ్యాగులే. పేదలకు పంపిణీ చేయకుండా నేరుగా డిపోల నుంచి బయట మార్కెట్‌కు తరలిస్తున్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:54 AM