Share News

బెజవాడలో బిల్‌గేట్స్‌

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:55 AM

ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా ఉన్న మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ తొలిసారిగా విజయవాడలో కాలుమోపారు. ఇప్పటి వరకు కంప్యూటర్లతో ఆడుకున్న ఆయన బెజవాడ గడ్డపై బ్యాట్‌ పట్టారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుతో కలిసి షటిల్‌ ఆడారు.

బెజవాడలో బిల్‌గేట్స్‌
అమరావతిలో సీఎం, బిల్‌గేట్స్‌ పర్యటన

తొలిసారి నగరానికి విచ్చేసిన అపర కుబేరుడు

అమరావతితో పాటు పటమటలో పర్యటన

పీవీ సింధుతో షటిల్‌ ఆడిన మైక్రోసాఫ్ట్‌ అధినేత

విజయవాడ/కలెక్టరేట్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా ఉన్న మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ తొలిసారిగా విజయవాడలో కాలుమోపారు. ఇప్పటి వరకు కంప్యూటర్లతో ఆడుకున్న ఆయన బెజవాడ గడ్డపై బ్యాట్‌ పట్టారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుతో కలిసి షటిల్‌ ఆడారు. గంటపాటు సింధుతో తలపడ్డారు. బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌, సింధు ఫౌండేషన్‌ మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించిన ప్రమోషన్‌ యాడ్‌ చిత్రీకరణ కోసం ఈ ఆట ఆడారు. ఉండవల్లిలో కార్యక్రమాలను ముగించుకున్నాక ఆయన పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్‌ స్డేడియానికి చేరుకున్నారు. స్టేడియంలోకి వెళ్లగానే చిన్నారులను నవ్వుతూ పలకరించారు. భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులుగా తయారు కావాలని వారికి ఆశీస్సులు అందజేశారు. అనంతరం క్రీడాకారుడి దుస్తుల్లో కోర్టులోకి అడుగుపెట్టారు. స్టేడియంలో గంటా22 నిమిషాలు గడిపారు. గేట్స్‌ కాన్వాయ్‌కు పోలీసులు గ్రీన్‌ఛానల్‌ ఇచ్చారు. ఆయన రాకతో పటమటలోని రైతుబజార్‌కు సెలవు ప్రకటించారు. హైస్కూల్‌ రోడ్డును పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. డీసీపీ కృష్ణకాంత పటేల్‌ బందోబస్తును పర్యవేక్షించారు. అతికొద్దిమందిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించారు. స్వాగత కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, డీసీపీ షరీన్‌ బేగం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ లక్ష్మీశ, పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆట పూర్తయ్యాక సింధు, గేట్స్‌ కాసేపు భేటీ అయ్యారు. తర్వాత ఆయన అక్కడి నుంచి విమానాశ్రయానికి వెళ్లారు.

Updated Date - Feb 17 , 2026 | 12:55 AM