వెస్ట్ బైపాస్ పనులకు అవ‘రాధా’లు
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:05 AM
విజయవాడ పశ్చిమ బైపాస్ పనులకు మరో అడ్డంకి వచ్చి పడింది. టవర్ల ఎత్తు పెంపు పనులకు ‘రాధా’ సంస్థ నుంచి అనుమతులు రావడం ఆటంకంగా మారాయి. సదరు సంస్థ న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకోవటంతో పనులు పూర్తికావడానికి ఇంకెంతకాలం పడుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
ఎన్‌హెచ్‌కు రాధా సంస్థ ఝలక్
జక్కంపూడి వద్ద టవర్ల ఎత్తు పెంపు పనులకు ఆటంకం
లైన్లు మార్చేందుకు అనుమతి ఇవ్వని సంస్థ
కోర్టును ఆశ్రయించి స్టే.. పనులకు అవరోధం
రోజుకు రూ.8 లక్షలు అద్దె చెల్లిస్తున్న ఎన్‌హెచ్
న్యాయస్థానంలో బలమైన వాదనలు అవసరం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ పశ్చిమ బైపాస్ పనులు 98 శాతం పూర్తయ్యాయి. కేవలం 2 శాతం మిగిలి ఉన్నాయి. జక్కంపూడి వద్ద ఆర్వోబీ స్లాబ్, చిన్న అవుటపల్లి దగ్గర ల్యాండింగ్ పనులు ఉన్నాయి. చిన్న అవుటపల్లి దగ్గర పనులు తుది దశలో ఉన్నాయి. జక్కంపూడి ఆర్వోబీ స్లాబ్ పనులు ఇన్నాళ్లూ రైతులు వేసిన 12 కేసుల కారణంగా ఆలస్యమయ్యాయి. టవర్ల ఎత్తు పెంపు హామీ ఇవ్వటంతో రైతులు కూడా అంగీకరించారు. దీంతో ఎన్‌హెచ్ అధికారులు టవర్ల ఎత్తు పెంపు పనులు చేపట్టారు. ఇది పూర్తయితే పశ్చిమ బైపాస్‌లో ప్యాకేజీ-3 పనులు సంపూర్ణంగా అందుబాటులోకి వస్తాయి. సమస్య పరిష్కారమైందనుకున్న దశలో మరో కొత్త వివాదం వచ్చి పడింది.
వివాదం ఇదీ..
ల్యాంకోలైన్ టవర్ల ఎత్తు పెంపునకు సంబంధించి ‘రాధా’ అనే సంస్థ తెరపైకి వచ్చింది. ఈ లైన్ అధీకృతంగా తమకు చెందిందని హైకోర్టును ఆశ్రయించింది. ఈ లైన్ మార్చటం వల్ల విద్యుత ఉత్పత్తికి అంతరాయం ఏర్పడి తమకు నష్టం జరుగుతుందని, జిల్లా యంత్రాంగం, జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) షట్‌డౌన్ చేయాలని బలవంతం చేస్తున్నారని, తమకు నష్టం జరుగుతుందని కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్టే ఇచ్చింది. తమకు జరిగే నష్టాన్ని డెమరేజెస్ చార్జీల రూపంలో గంటకు రూ.36 చెల్లించాలని అంతకుముందు ఎన్‌హెచ్‌కు ‘రాధా’ సంస్థ తెలిపింది. టవర్ల ఎత్తు పెంపునకు 35 గంటల సమయం పడుతుంది కాబట్టి దాదాపు ఆ సంస్థకు రూ.12 కోట్లు చెల్లించాల్సి వస్తోంది.
న్యాయస్థానంలో వాదనలు వినిపించని ఎన్‌హెచ్
పశ్చిమ బైపాస్‌ను ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలని ఓపక్క ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఆఖరి సమస్యను పరిష్కరించే విషయంలో ఎన్‌హెచ్ అధికారులు న్యాయపోరాటం చేయట్లేదు. ల్యాంకోలైన్ అనేది రాధా సంస్థకు సంబంధించినది కాదన్న విషయం ఎన్‌హెచ్‌కు తెలుసు. కొండపల్లి ల్యాంకో పవర్ ప్రాజెక్టు మూతపడిన నేపథ్యంలో అప్పులవారు గొడవలు చేశారు. నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించారు. దీంతో ఎన్‌సీఎల్‌టీ లిక్విడేటర్‌ను నియమించి అమ్మకానికి పెట్టించింది. ల్యాంకో పవర్ ప్లాంట్‌ను మూడు యూనిట్లుగా విభజించి స్ర్కాప్‌కు విక్రయించారు. ఒక యూనిట్‌ను రాధా సంస్థ, మరో యూనిట్‌ను రిలయెన్స్, మూడో యూనిట్, ల్యాంకో లైన్‌ను మయన్మార్‌కు చెందిన ఎంసీఎన్ అనే కంపెనీలు కొన్నాయి. రిలయెన్స్ కొన్న యూనిట్‌ను స్ర్కాప్ కింద తీసుకెళ్లిపోయింది. ఎంసీఎన్ కంపెనీ పూర్తి డబ్బు చెల్లించకపోవటంతో యూనిట్‌తో పాటు ల్యాంకో ట్రాన్స్‌మిషన్ లైన్‌ను కూడా తొలగించలేదు. ఎంసీఎన్ కంపెనీకి, రాధా సంస్థల మధ్య ఏదైనా రహస్య ఒప్పందం జరిగిందా? ఇంకేమైనా ఉందా? అనేది స్పష్టంగా తెలియదు. కానీ ఎంసీఎన్ కంపెనీ కొన్న ల్యాంకో లైన్‌ను మాత్రం తమదిగా రాధా చెప్పుకుంటోంది. తాము విద్యుత ఉత్పత్తి చేస్తున్నట్టుగా కూడా చెప్పుకొంటూ టవర్ల ఎత్తు పెంపు వల్ల తమకు నష్టం జరుగుతుందని డిమాండ్ చేస్తోంది. స్టే తెచ్చుకున్న క్రమంలో సరైన విధంగా న్యాయపోరాటం చేయాల్సిన ఎన్‌హెచ్ అధికారులు ఇప్పటి వరకు సరైన వాదనలు వినిపించే ప్రయత్నం చేయలేదు.
సమస్యకు పరిష్కారం ఇలా..
ఎన్‌హెచ్ చేతులెత్తేసిన పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీనిని పూర్తి చేయించాలన్న కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన కోర్టులో సరైన వాదనలు వినిపించాలి. తనది కాకపోయినా ల్యాంకోలైన్‌కు రాధా సంస్థ ఎలా యాజమాన్యం అవుతుంది? ఈ సంస్థ లైసెన్స్ లేకుండా ఎలా విద్యుదుత్పత్తి చేస్తుంది? పవర్ పరే ్చజింగ్ అగ్రిమెంట్స్ (పీపీఏ)లే లేకుండా ఎలా విద్యుత ఉత్పత్తి చేస్తుంది? ల్యాంకోలైన్‌ను కొన్న ఎంసీఎన్ కంపెనీ వాదనలు ఏంటి? ఇలాంటి కీలకాంశాలను జిల్లా యంత్రాంగం కోర్టు ముందుకు తీసుకెళ్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
అద్దె భారం
టవర్ల ఎత్తు పెంపు కోసం విద్యుత శాఖ నుంచి ఎమర్జెన్సీ రెస్టోరేషన్ టవర్స్ (ఈఆర్‌ఎస్)ను అద్దెకు తీసుకున్న ఎన్‌హెచ్ రోజుకు రూ.8 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తోంది. రాధా సంస్థ అనుమతులు ఇవ్వకపోవటంతో ఇప్పటికి 30 రోజులైంది. ఇప్పటి వరకు రూ.2.40 కోట్ల అద్దె చెల్లించారు. స్టే ఉండటం, అనుమతులు ఇవ్వకపోవటంతో ఈ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.