ఏటీసీ టవర్ ట్రయల్స్ సక్సెస్
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:43 AM
విజయవాడ విమానాశ్రయంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ప్రస్తుతం ఉన్న పాత ఏటీసీ టవర్‌తో పాటు కొత్త టవర్‌ను నెల రోజులు పరీక్షించారు.
నెల రోజులు పరీక్షించిన విమానాశ్రయ అధికారులు
డీజీసీఏకు అనుమతుల కోసం దరఖాస్తు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ విమానాశ్రయంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ప్రస్తుతం ఉన్న పాత ఏటీసీ టవర్‌తో పాటు కొత్త టవర్‌ను నెల రోజులు పరీక్షించారు. సమర్థవంతంగా పనిచేయటంతో ట్రయల్ రన్ విజయవంతమైనట్టుగా ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. నూతన టవర్‌ను అధికారికంగా వినియోగంలోకి తీసుకురావటం కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు దరఖాస్తు చేశారు. డీజీసీఏ బృందం విజయవాడ విమానాశ్రయానికి వచ్చిన తర్వాత వారం పాటు దీని పనితీరును పరిశీలిస్తుంది. ఆ తర్వాత తుది అనుమతులు ఇస్తుంది. డీజీసీఏ నుంచి తుది అనుమతులు రాగానే పాత టవర్ తొలగింపు పనులు చేపడతారు. ఆ తర్వాత కొత్త ఏటీసీ టవర్ పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.
ఆధునిక పరిజ్ఞానంతో నిర్మాణం
కొత్త ఏటీసీ టవర్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచారు. విమానాలను దూరంగా గుర్తించే రాడార్, విమాన సిగ్నల్స్‌ను అందుకుని అది ఎంత ఎత్తు ఉంది? ఎంత వేగంతో వస్తుందో తెలుసుకునే రెండో రాడార్, విమానం స్థానాన్ని తెలుసుకునే ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇవికాకుండా సమాచార వ్యవస్థ, ఫ్లైట్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్, వాతావరణ మార్పులను పరిశీలించే వ్యవస్థలతో పాటు అత్యాధునిక యూపీఎస్, జనరేటర్లు వంటివి కూడా ఏర్పాటు చేశారు. ఈ సరికొత్త ఏటీసీ టవర్‌తో పాటు దీనిని ఆనుకుని నిర్మించిన మరో కాంప్లెక్స్ కూడా పూర్తయింది. రూ.80 కోట్లతో ఈ రెంటినీ ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలో శాశ్వత ప్రాతిపదికన నిర్మించే టెర్మినల్ బిల్డింగ్ పనుల్లో అంతర్భాగంగా ఈ పనులు చేపట్టారు. టెర్మినల్ బిల్డింగ్ పనులు పూర్తికావాలంటే మరో ఏడాది పడుతుంది.