Share News

టీడీపీ నేతపై హత్యాయత్నం

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:52 AM

నూతన సంవత్సర వేడుకల్లో చోటుచేసుకున్న స్వల్ప ఘర్షణ పెద్దదిగా మారడంతో పాటు రాజీకి పిలిచి టీడీపీ నాయకులపై వైసీపీ మూక హత్యాయత్నానికి పాల్పడటం శుక్రవారం గుడివాడలో ఉద్రిక్తతకు దారితీసింది.

టీడీపీ నేతపై హత్యాయత్నం
ఇమ్మానియేల్‌ను పరామర్శిస్తున్న జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత

గుడివాడలోని గుడ్‌మెన్‌పేటలో ఉద్రిక్తం

టీడీపీ వార్డు ఇన్‌చార్జి సహా ముగ్గురికి గాయాలు

న్యూ ఇయర్‌ రోజు స్థానిక యువకుల మధ్య గొడవ

ఇరువర్గాల మధ్య రాజీకి పిలిచి పేట్రేగిన వైసీపీ మూక

వార్డు ఇన్‌చార్జి ఇమ్మానియేల్‌పై విచక్షణారహితంగా దాడి

కత్తులు, రాడ్లతో దాడి చేయడంతో అడ్డుకున్న కూటమి నేతలు

ఆసుపత్రికి తరలింపు.. ఎమ్మెల్యే వెనిగండ్ల పరామర్శ

గుడివాడ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : నూతన సంవత్సర వేడుకల్లో చోటుచేసుకున్న స్వల్ప ఘర్షణ పెద్దదిగా మారడంతో పాటు రాజీకి పిలిచి టీడీపీ నాయకులపై వైసీపీ మూక హత్యాయత్నానికి పాల్పడటం శుక్రవారం గుడివాడలో ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక గుడ్‌మెన్‌పేటకు చెందిన టీడీపీ నేత వేశపోగు ఇమ్మానియేల్‌ను ఇటీవల ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వార్డు టీడీపీ ఇన్‌చార్జిగా నియమించారు. వార్డులో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఇమ్మానియేల్‌ దృష్టిసారించారు. కాగా, ఏటా మాదిరిగానే న్యూ ఇయర్‌ రోజున గుడ్‌మెన్‌పేటలోని యువకులు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో స్థానికులైన సంజయ్‌, జోసఫ్‌ మధ్య వివాదం రాజుకుంది. మానేపల్లి దేవకుమార్‌ అనే వ్యక్తి జోక్యం చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య వివాదం పెద్దదైంది. పెద్దలు కల్పించుకుని శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. ఇరువర్గాలు మాట్లాడుకుంటుండగానే వైసీపీ నాయకుడు మామిళ్ల ఎలీషా, అతని తమ్ముడు రాజేశ్‌ ప్రోత్సాహంతో మానేపల్లి క్రాంతి అనే వ్యక్తి ఒక్కసారిగా ఇమ్మానియేల్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో మొత్తం 15 మంది పాల్గొన్నారు. ఇమ్మానియేల్‌పై దాడిని అతని తమ్ముడు విజయ్‌, అన్న కుమారుడు వేశపోగు సుఽధీర్‌లు అడ్డుకున్నారు. దీంతో వారికి కూడా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

కూటమి నాయకుల పరామర్శ

గుడివాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకులు ఇమ్మానియేల్‌, మరో ఇద్దరిని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత శుక్రవారం పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెనిగండ్ల పోలీసులను ఆదేశించారు.

రాజకీయ పార్టీలతో సంబంధం లేదు : డీఎస్పీ ధీరజ్‌ వినీల్‌

గుడ్‌మెన్‌పేట గొడవలో రాజకీయ పార్టీలకు సంబంధం లేదని డీఎస్పీ ధీరజ్‌ వినీల్‌ పేర్కొన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీ జరుగుతున్న సమయంలో టీడీపీ వార్డు ఇన్‌చార్జి ఇమ్మానియేల్‌పై ఆవేశంతో మానేపల్లి క్రాంతి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడన్నారు. ఇమ్మానియేల్‌తో పాటు వేశపోగు సుధీర్‌, విజయ్‌కు గాయాలయ్యాయన్నారు. 1వ తేదీ రాత్రి జరిగిన వివాదం చాలా చిన్నదని, పెట్టీకేసు అని తాము భావించామన్నారు. ఇది ఇరువర్గాల ఘర్షణ మాత్రమేనని, రాజకీయ వివాదంగా చూడొద్దని డీఎస్పీ పేర్కొన్నారు. కాగా, ఈ అల్లర్ల నేపథ్యంలో గుడ్‌మెన్‌పేటలో ఫుట్‌ పెట్రోలింగ్‌, విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్నట్లు టూటౌన్‌ సీఐ హనీష్‌ తెలిపారు. ప్రజలకు భద్రతాభావం కలిగేలా మచిలీపట్నం స్పెషల్‌ పార్టీ సిబ్బందితో పాటు స్టేషన్‌ సిబ్బంది పోలీసింగ్‌ నిర్వహించారని చెప్పారు.

పోలీసుల నిర్లక్ష్యమే కారణమా?

వివాదాస్పద ప్రాంతంగా ఉన్న గుడ్‌మెన్‌పేటలో పోలీసుల నిర్లక్ష్యం తీవ్ర గొడవకు దారితీసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న వివాదం చోటుచేసుకున్నప్పుడే పోలీసులు అప్రమత్తమై అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సి ఉంది. అలా చేసి ఉంటే.. హత్యాయత్నం, గొడవ జరిగేది కాదని కూటమి నాయకులు చెబుతున్నారు. రాజీకి పిలిచి కత్తులతో దాడి చేయడం, కత్తులు, రాడ్లతో రావడం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందేనంటున్నారు.

Updated Date - Jan 03 , 2026 | 12:52 AM