Share News

దేశం చూపు అమరావతి వైపు.. 'క్వాంటమ్ వ్యాలీ'తో చరిత్ర సృష్టించిన ఏపీ

ABN , Publish Date - Feb 07 , 2026 | 09:43 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో మైలురాయిని చేరుకుంది. దేశంలోనే మొట్టమొదటి 'క్వాంటమ్ వ్యాలీ'కు ఈ రోజు శంకుస్థాపన జరిగింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే, #AmaravatiQuantumValley అనే హ్యాష్‌ట్యాగ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

దేశం చూపు అమరావతి వైపు.. 'క్వాంటమ్ వ్యాలీ'తో చరిత్ర సృష్టించిన ఏపీ
Amaravati Quantum Valley

అమరావతి, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో అంతర్జాతీయ మైలురాయిని చేరుకుంది. దేశంలోనే మొట్టమొదటి 'క్వాంటమ్ వ్యాలీ' (Quantum Valley)కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు (శనివారం) సాయంత్రం శంకుస్థాపన చేశారు. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయనిపాలెంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సోషల్ మీడియాలో ప్రభంజనం

ఈ చారిత్రాత్మక కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే, #AmaravatiQuantumValley అనే హ్యాష్‌ట్యాగ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. నెటిజన్లు, టెక్ నిపుణులు, యువత అమరావతిని భవిష్యత్తు టెక్నాలజీ హబ్‌గా అభివర్ణిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు.

ప్రాజెక్టు ప్రధానాంశాలు:

క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దండరాయనిపాలెంలో 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ఏడాది ఆగస్టు నాటికే 90 లక్షల చదరపు అడుగుల భారీ భవనాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొని, అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.


క్వాంటమ్ విప్లవానికి నాంది

అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, అది దేశపు ఇన్నోవేషన్ సెంటర్ అని ఈ శంకుస్థాపన ద్వారా స్పష్టమైందని చెబుతున్నారు. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కంప్యూటింగ్, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలైన 'క్వాంటమ్ టెక్నాలజీ'కి అమరావతి వేదిక కాబోతోందన్నమాట.


ఈ వార్తలూ చదవండి:

బీఎంసీ మేయర్ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా రితూ తావ్డే

ఓటుకు రూ.2వేలు పంచేందుకు సిద్ధమైన డీఎంకే.. బీజేజీ ఆరోపణ

Updated Date - Feb 07 , 2026 | 09:48 PM