కల్తీ నెయ్యి కలవరం..!
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:13 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి సరఫరా అయిన కల్తీ నెయ్యి మూలాలు విజయవాడలోనే ఉన్నాయా? ఈ వ్యవహారంలో నగదును ఇక్కడి వ్యక్తే సరఫరా చేశాడా? అంటే అవుననే సమాధానం దర్యాప్తు సంస్థల నుంచి వస్తోంది. వన్‌టౌన్‌కు చెందిన భరతరాయ్ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ భరతరాయ్ ఎవరన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రంలో దుమారాన్ని రేపుతుండగా, విజయవాడ పేరు తెరపైకి రావడంతో దర్యాప్తు ఇటువైపు తిరిగింది.
నగరంపై నాటి వైసీపీ పాపం
మూలాలు ఇక్కడే ఉన్నాయనే అనుమానం
వన్‌టౌన్ కేంద్రంగా నగదు లావాదేవీలు
ప్రముఖంగా వినిపిస్తున్న భరతరాయ్ పేరు
వన్‌టౌన్‌లో 10 మంది వరకు భరతలు
పేర్ల తికమకలో అనేక అనుమానాలు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : రాష్ట్రంలో హోల్‌సేల్ వాణిజ్యానికి నగరంలోని వన్‌టౌన్ కేంద్రంగా ఉంది. వివిధ జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడి నుంచే వస్తువులను కొని తీసుకెళ్తారు. వస్త్ర, బంగారం, ప్లాస్టిక్, ఎలకా్ట్రనిక్ గూడ్స్ వ్యాపారాలకు వన్‌టౌన్ కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఇక్కడి వ్యాపారుల్లో ఉత్తరాది రాషా్ట్రల నుంచి వచ్చిన స్థిరపడినవారు ఉన్నారు. వన్‌టౌన్‌కు చెందిన భరతరాయ్ ద్వారా కల్తీ నెయ్యికి సంబంఽధించిన నగదు వ్యవహారాలను నడిపినట్టు తెలుస్తోంది. ఇక్కడ భరత అనే పేరు మీద మొత్తం పదిమంది వ్యాపారులు ఉన్నట్టు తెలుస్తోంది. రాయ్ అనే పేరు ఎక్కువగా పశ్చిమబెంగాల్‌కు చెందిన వ్యక్తులకు ఉంటుంది. ఇదే ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇక్కడి వ్యక్తేనా..?
భరతరాయ్ విజయవాడకు చెందిన వ్యక్తేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కల్తీ నెయ్యి సరఫరాలో పాత్రధారులు వన్‌టౌన్ చిరునామాను ఉపయోగించుకున్నారా? అనే అనుమానం కూడా లేకపోలేదు. ఈ డబ్బు మాత్రం హవాలా మార్గంలో చేతులు మారినట్టు సమాచారం. హవాలా వ్యాపారానికి వన్‌టౌన్, గుంటూరు కేంద్రాలుగా ఉన్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ముఖ్యంగా బంగారం వ్యాపారం చేసేవారిలో ఎక్కువ హవాలాదారులు 0ఉన్నారన్నది బహిరంగ రహస్యం. విదేశాల నుంచి ఎలాంటి పన్నులు చెల్లించకుండా బంగారాన్ని కొనే వ్యాపారులు ఇక్కడ ఉన్నారు. వారంతా సిండికేట్‌గా మారి హవాలా మార్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ సిండికేట్ ప్రతినెలా ఎవరికి చెల్లించాల్సిన ముడుపులను వారికి క్రమం తప్పకుండా ముట్టజెబుతోంది. ఈ సిండికేట్ నిర్వహించే వ్యాపారుల జోలికి ఆదాయ పన్నుశాఖ అధికారులు, వాణిజ్య పన్నులశాఖ అధికారులు వెళ్లకపోవడం గమనార్హం.
వన్‌టౌన్ కేంద్రంగా..
వన్‌టౌన్‌లో వ్యాపారాలు ఏవిధంగా జరుగుతాయన్నది ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం తయారీ కేసులో బయటపడ్డాయి. కాగా, వన్‌టౌన్‌లో భరతరాయ్ పేరుతో వ్యాపారులు ఎవరూ లేరని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న పది మంది పేర్లు భరత అని మాత్రమే ఉంది. రాయ్ అనే విషయం మాత్రం తెలియట్లేదు. పశ్చిమబెంగాల్‌కు చెందిన భరతరాయ్ అనే వ్యక్తి పేరు మీద వన్‌టౌన్ చిరునామా ఇచ్చి నగదు లావాదేవీలు నిర్వహించి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కల్తీ నెయ్యి సరఫరా నగదు లావాదేవీల్లో విజయవాడ పేరు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశంగా మారింది.