రూటు మారిన రథచక్రాల్..!
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:14 AM
గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగించే రథానికి మరమ్మతులు చేయాల్సి ఉందా? రథ బాధ్యతల విషయంలో దుర్గగుడిలోని విభాగాల మధ్య వంతులాట జరుగుతోందా? రథంలో ఒక పరికరం పాడైనట్టు ఇప్పటికే గుర్తించారా? అసలు విషయాన్ని గోప్యంగా ఉంచి దేవస్థానం రోజులు గడుపుతోందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఈ విషయంలో దేవస్థానంలోని మూడు విభాగాల మధ్య అంతర్గతంగా వాదులాటలు జరుగుతున్నాయి.
ఇంద్రకీలాద్రిపై వెండిరథం మరమ్మతుల్లో దోబూచులాట
ఇప్పటికే అరిగిపోయిన రథంలోని సాఫ్ట్ అనే పరికరం
ముందే తెలియజేసిన తయారీదారుడు
పట్టించుకోని దుర్గగుడి అధికారులు
ఉగాది రోజున వసంతోత్సవాల్లో ఊరేగింపు
అపశ్రుతి కలుగుతుందేమోననే భయంతోనే దారి మళ్లింపు
మరమ్మతులకు ఆ మూడు విభాగాల వాదులాట
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగించడానికి 25 ఏళ్ల కిందట దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రథాన్ని తయారు చేయించారు. ఏటా రెండుసార్లు ఈ రథంపై ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. ఉగాదికి వసంతోత్సవాల ప్రారంభం రోజున, ముగింపు రోజున రథోత్సవం నిర్వహిస్తారు. అంతకుముందు రథాన్ని పరిశీలిస్తారు. రథ తయారీదారుడిని తీసుకొచ్చి తనిఖీ చేయిస్తారు. కొద్దినెలల క్రితం ఆలయ ఉద్యోగులు తయారీదారుడిని తీసుకొచ్చి రథాన్ని పరిశీలించారు. రథానికి ఉండే సాఫ్ట్ అనే పరికరం బాగా అరిగిపోయినట్టు నిర్ధారించారని తెలిసింది. దీన్ని మార్పు చేయాలని అదనపు స్తపతి ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. వసంతోత్సవాలు సమీపిస్తున్నా ఈ ప్రతిపాదనను పట్టించుకోకుండా పక్కన పెట్టినట్టు తెలిసింది. ఉగాది రోజున ఉత్సవాలు ప్రారంభం కావడంతో రథాన్ని కచ్చితంగా కదపాల్సి వచ్చింది. ఆ సమయంలో ‘సాఫ్ట్’ ప్రస్తావనకు రావడం చర్చనీయాంశమైంది. సున్నితమైన విషయం కావడంతో ఆలయ వర్గాలు గోప్యంగా ఉంచాయి. తొలుత ఈ రథం మహామండపం వద్ద ఉండేది. దీనికి నాలుగు వైపులా వెండి సంహాలు ఉండేవి. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో మూడు వెండి సంహాలను ఓ దొంగ మాయం చేశాడు. ఆ తర్వాత రథాన్ని ఇంద్రకీలాద్రిపైన విఘ్నేశ్వరుడి ఆలయం పక్కన షెడ్ ఏర్పాటుచేసి అక్కడ ఉంచుతున్నారు. రథంపై సుమారు 250 కిలోల వెండితో తయారుచేసిన రేకును అలంకారంగా అమర్చారు.
పేచీ ఏమిటి?
ఉత్సవమూర్తులను ఊరేగించే రథం మూడు విభాగాల మధ్య దుమారాన్ని రేపుతోంది. రథం బాధ్యతలను ఎవరు నిర్వహించాలన్న దానిపై ఈ విభాగాలు వాదులాడుకుంటున్నాయి. రథాన్ని తయారు చేయించేటప్పుడు బాధ్యతలను అకౌంట్స్ విభాగం నిర్వహించింది. తయారీకయ్యే నిధులను ఈ విభాగం చెల్లించింది. ఇంద్రకీలాద్రిపై ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను ఫెస్టివల్ విభాగం చూస్తోంది. రథం ఊరేగింపు కూడా ఒక ఉత్సవమే కాబట్టి ఫెస్టివల్ విభాగమే దాని పర్యవేక్షణ బాధ్యతలను చూడాలని కొందరు చెబుతున్నారు. మరమ్మతులు చేయాల్సిన బాధ్యతలన్నీ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో ఉంటాయని, అందువల్ల ఆ విభాగమే పర్యవేక్షించాలని మిగిలిన విభాగాలు చెబుతున్నాయి.
రూటు మార్పునకు అదే కారణం?
ఉగాది రోజున నిర్వహించిన రథోత్సవం మార్గం మార్పునకు దానిలో ఏర్పడిన సాంకేతిక సమస్యే కారణమని తెలుస్తోంది. ఏటా రథోత్సవాన్ని మహామండపం నుంచి రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి, కొత్తపేట, గణపతిరావు రోడ్డు, బీఆర్పీ రోడ్డు, గద్దబొమ్మ సెంటర్, కెనాల్ రోడ్డు మీదుగా ఆలయం వద్దకు తీసుకెళ్తారు. రథానికి ఉన్న నాలుగు చెక్క చక్రాలకు పై భాగంలో ఇనుప బద్ది ఉంటుంది. దానివల్ల రథాన్ని లాగేటప్పుడు చక్రాలు గుంతలో పడినా, స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగినా కుదుపు వస్తుంది. అదే చెక్క చక్రాల స్థానంలో టైర్లు ఉంటే కుదుపు తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అప్పటికే రథంలో ఉండే సాఫ్ట్ పరికరం అరిగిపోయినట్టు గుర్తించిన అధికారులు రథోత్సవంలో ఎలాంటి అపశ్రుతి జరగకుండా ముందస్తుగానే ఊరేగింపు సాగే మార్గాన్ని మార్పు చేశారు. రథాన్ని ఎక్కువ దూరం ఊరేగించకుండా రథం సెంటర్ నుంచి గద్దబొమ్మ సెంటర్, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఆలయం వద్దకు తీసుకొచ్చారు.