Share News

అందరి సహకారంతో ముందడుగు

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:34 AM

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అందరి సహకారంతో ముందడుగు వేస్తున్నామని కలెక్టర్‌ డీకే బాలాజీ పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ జిల్లాస్థాయి వేడుకలు మచిలీపట్నం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండులో సోమవారం ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎస్పీ విద్యాసాగర్‌తో కలిసి భద్రతాదళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయజెండా రంగులతో కూడిన బెలూన్లను ఎగురవేశారు.

అందరి సహకారంతో ముందడుగు
జాతీయజెండాకు సెల్యూట్‌ చేస్తున్న కలెక్టర్‌ బాలాజీ, చిత్రంలో ఎస్పీ విద్యాసాగర్‌

జిల్లా సమగ్రాభివృద్ధికి సమష్టి కృషి

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ బాలాజీ

775 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేత

పీ4 కార్యక్రమం అమలు ద్వారా పేదలకు భరోసా అని వెల్లడి

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అందరి సహకారంతో ముందడుగు వేస్తున్నామని కలెక్టర్‌ డీకే బాలాజీ పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ జిల్లాస్థాయి వేడుకలు మచిలీపట్నం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండులో సోమవారం ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎస్పీ విద్యాసాగర్‌తో కలిసి భద్రతాదళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయజెండా రంగులతో కూడిన బెలూన్లను ఎగురవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో జిల్లాకు చెందిన ప్రముఖులు అయ్యదేవర కాళేశ్వరరావు, త్రిపురనేని రామస్వామిచౌదరి, డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు పోరాడి, ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య, జెండావీరుడు తోటనర్సయ్య మన జిల్లావారే కావడం గర్వకారణమన్నారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలందించిన 775 మంది అధికారులకు, సిబ్బందికి కలెక్టర్‌, ఎస్పీ చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసేలా ఏర్పాటుచేసిన స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి.

వ్యవసాయానికి ఊతం

రైతులను అన్నివిధాలా ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ బాలాజీ తెలిపారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం ద్వారా ఈ ఏడాది 1.33 లక్షల మంది రైతులకు రెండు విడతల్లో రూ.164 కోట్లను అందించామన్నారు. సాగు ఖర్చులు తగ్గించేందుకు, పురుగుమందులు పిచికారీ చేసేందుకు రూ.2.27 కోట్ల రాయితీతో 29 డ్రోన్లను రైతులకు అందజేశామన్నారు. లాభసాటి వ్యవసాయం చేసేందుకు పంచసూత్ర పథకాలపై రైతులకు అవగాహన కల్పించామని చెప్పారు. మత్స్యకారుల సేవా పథకంలో భాగంగా వేట నిషేధ సమయంలో 13,077 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున రూ.26.15 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు.

బందరు పోర్టు, గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌ పనులు పూర్తిచేస్తాం..

సాగరమాల పథకంలో భాగంగా మచిలీపట్నం గిలకలదిండి హార్బర్‌ను రూ.421 కోట్ల అంచనాలతో అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని కలెక్టర్‌ తెలిపారు. త్వరలో మిగిలిన పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది డిసెంబరుకు నాలుగు బెర్తుల నిర్మాణాన్ని పూర్తిచేసి సరుకుల ఎగుమతులు, దిగుమతులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎన్టీఆర్‌ భరోసా కింద జిల్లాలో 2.34 లక్షల మందికి ప్రతినెలా 1న సామాజిక పింఛన్ల నిమిత్తం రూ.101 కోట్లను అందజేస్తున్నామని తెలిపారు. జిల్ల్లాలో 10,634 డ్వాక్రా సంఘాలకు రూ.972 కోట్లను రుణాలుగా అందించామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 54.19 లక్షల పనిదినాలను కల్పించి, రూ.152 కోట్లను కూలీలకు నగదు రూపంలో చెల్లించామన్నారు. మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ.96 లక్షలతో జిల్లాలో గోకులాలు, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. రూ.5.56 కోట్లతో గుంతలు లేని రహదారులకు మరమ్మతులు చేశామని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 1.0 ద్వారా 33,801 ఇళ్లు నిర్మించామని, మరో 30 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. సీ్త్రశక్తి పథకం ద్వారా 1.49 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ఇందుకు రూ.48 కోట్లు ప్రయాణ చార్జీల రూపంలో మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. ఖరీఫ్‌లో 6.60 లక్షల టన్నుల ధాన్యం కొని రైతుల ఖాతాల్లో రూ.1,550 కోట్లకు పైగా ధాన్యం బిల్లులను 48 గంటల వ్యవధిలోనే జమ చేశామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పదిసూత్రాలను జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పీ4 కార్యక్రమంలో మార్గదర్శులను కలెక్టర్‌ సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యురాలు సాదరబోయిన మంగాదేవిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, నాటక అకాడమీ చైర్మన్‌ గోపాలకృష్ణ, డీ సీఎంఎస్‌ చైర్మన్‌ బండి రామకృష్ణ, ట్రైనీ కలెక్టర్‌ ఫర్హీన్‌ జాహిద్‌, కృష్ణా యూనివర్సిటీ వీసీ కె.రామ్‌జీ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 12:34 AM