Share News

నేడే చూడండి..! అర్ధరాత్రి ఆట

ABN , Publish Date - Feb 18 , 2026 | 01:07 AM

‘నేడే చూడండి.. సరికొత్త సినిమా థియేటర్‌లో వారానికి మూడే మూడు షోలు. ఆలసించిన ఆశాభంగం.. కేవలం 30 మందికే సదావకాశం.. రూ.2 వేలు కట్టి సీటు కన్ఫర్మ్‌ చేసుకుంటే చాలు.. సెకండ్‌ షో తర్వాత వరుస ఆటలే..’ ఇదేదో కొత్తగా రిలీజైన పెద్దహీరో సినిమా కాదండోయ్‌. గుడివాడ నడిబొడ్డులోని ఓ సినిమా థియేటర్‌లో చివరాట ముగిశాక టీడీపీకి చెందిన ఓ యువ నాయకుడు విడుదల చేస్తున్న సరికొత్త పేకాట.

నేడే చూడండి..! అర్ధరాత్రి ఆట

సెకండ్‌ షో తర్వాత గుడివాడలోని ఓ సినిమా హాల్లో సరికొత్త పేకాట షో

వారానికి మూడుసార్లు మాత్రమే..

రూ.2 వేలు ఎంట్రీ ఫీజు చెల్లించాలి

30 మందికి మాత్రమే అవకాశం

క్యూ కడుతున్న పేకాటరాయుళ్లు

ఎవరికి వారికి నెలవారీ వాటాలు

యథేచ్ఛగా సాగిపోతున్న షో

ఆంధ్రజ్యోతి-గుడివాడ : గుడివాడ పట్టణ నడిబొడ్డులోని ఓ సినిమా హాల్‌ వేదికగా హైక్లాస్‌ పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. రాత్రి సెకండ్‌ షో తరువాత ఇక్కడ తతంగం మొదలవుతుంది. తెల్లవారుజాము వరకు పేకాట విచ్చలవిడిగా ఆడుతున్నారు. సెకండ్‌ షో తర్వాత థియేటర్‌ వెనుక ఉన్న తలుపు తెరిచి ఉంచుతారు. ఎంట్రీ ఫీజుగా రూ.2 వేలు చెల్లించాలి. రోజుకు కేవలం 30 మందికే అవకాశం ఉంటుంది. వారంలో ఏ మూడు రోజులు పేకాట నిర్వహిస్తారో ముందే సందేశాలను పంపుతారు.

ఎవరి వాటా వారిదే..

‘ఎవరి వాటా వారికి ఇస్తున్నా.. ఎవరికి భయపడేదే లేదు..’ హైక్లాస్‌ పేకాట శిబిర నిర్వాహకుడు పేకాటరాయుళ్లకు ఇస్తున్న భరోసా ఇది. ఏ రోజుకారోజు పోలీసులు, రాజకీయ నాయకులకు వాటాలిస్తున్నానని బహిరంగంగానే ఆయన ప్రకటిస్తున్నారు. ఎంతటి వారైనా సరే తనను ప్రశ్నించినా, తప్పు అని ఖండించినా ఆ యువనాయకుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తాడు. బెదిరింపులకు దిగుతాడని గుడివాడలో బహిరంగంగానే మాటలు వినిపిస్తున్నాయి. యువనాయకుడి జోరును ఎలా నిలువరించాలో తెలియక ఇటు పోలీసులు, అటు రాజకీయ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

నాడు వైసీపీ.. నేడు టీడీపీ..

గతంలో మాజీమంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుడు కూనసాని వినోద్‌ ఆధ్వర్యంలో టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన నేత అండతో హైటెక్‌ పేకాట నిర్వహించేవారు. ఈ శిబిరానికి ఎక్కువగా మాజీ ఎమ్మెల్యే వంశీ బ్యాచ్‌ వచ్చేవారు. ప్రభుత్వం మారాక.. పరిస్థితి కూడా మారిపోయింది. ప్రస్తుతం టీడీపీ యువనాయకుడి కనుసన్నల్లో పేకాట జరుగుతోంది. దీనికి గుడివాడ పరిసర ప్రాంత పేకాటరాయుళ్ల నుంచి మంచి డిమాండ్‌ ఏర్పడింది.

Updated Date - Feb 18 , 2026 | 01:07 AM