మృత్యుంజయులు
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:07 AM
శనివారం ఉదయం 5.30 గంటల సమయం... స్లీపర్ ఏసీ బస్సుల్లో 39 మంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా బస్సు ఇంజన్ నుంచి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్.. ప్రయాణికులందరినీ నిద్రలేపి సురక్షితంగా కిందకు దింపారు. కళ్లముందే భారీగా మంటలు వ్యాపించి బస్సు అగ్నికి ఆహుతవుతుండగా, వారంతా నిద్రమత్తులో నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డామని ఊపిరిపీల్చుకున్నారు. కంచికచర్ల-కీసర వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదంలో ప్రయాణికులంతా మృత్యుంజయులుగా నిలిచారు.
డ్రైవర్, క్లీనర్ అప్రమత్తతతో 39 మంది ప్రయాణికులు క్షేమం
వరుణ్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు ప్రమాదంలో అందరూ సేఫ్
పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్
లగేజీ సహా ప్రయాణికులందరూ బయటకు..
క్షణాల్లో బస్సు అంతటా వ్యాపించిన మంటలు
ఇంజన్ నుంచి పొగలు.. షార్ట్ సర్క్యూట్‌గా అనుమానం
రంగంలోకి దిగిన రవాణా, ఫైర్, ఫోరెన్సిక్ బృందాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/కంచికచర్ల) : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సిబ్బంది అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఈ స్లీపర్ బస్సు శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో కంచికచర్ల-కీసర గ్రామాల మధ్య జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదానికి గురైంది. మంటలు వేగంగా బస్సును అలుముకున్నాయి. దట్టమైన పొగలు, మంటలను సైడ్ మిర్రర్ ద్వారా గమనించిన డ్రైవర్ మామిడాల చంద్రమౌళి, క్లీనర్ అప్రమత్తం అయ్యారు. దీంతో బస్సులో ఉన్న 39 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఘటన జరిగింది ఇలా..
హైదరాబాద్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వరుణ్ ట్రావెల్స్‌కు చెందిన ఈ ఇంటర్‌సిటీ ఏసీ స్లీపర్ బస్సు గుంటూరుకు బయల్దేరింది. మొత్తం 39 మంది ప్రయాణికులు, డ్రైవర్ చంద్రమౌళి, క్లీనర్ కమ్ డ్రైవర్ ఉన్నారు. శనివారం ఉదయం 5 గంటల సమయంలో బస్సు కీసర టోల్‌గేట్ వద్దకు చేరింది. అక్కడ క్లీనర్లు బస్సులు మారటం కోసం పావుగంటకు పైగా ఆపారు. ఆ తర్వాత మూడు కిలోమీటర్లు వెళ్లగానే బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు వెనుకభాగంలో ఉన్న ఇంజన్ నుంచి పొగలు, మంటలు వస్తుండటాన్ని డ్రైవర్ చంద్రమౌళి, క్లీనర్ గుమనించారు. బస్సును రోడ్డు మార్జిన్‌లో నిలిపి, ప్రయాణికులను కిందకు దింపారు. లగేజీని బయటకు తీశారు. మంటలు వేగంగా బస్సును చుట్టుముట్టాయి. బస్సు వెనుక, పైభాగాలు కాలిపోయాయి. అటుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా, కంచికచర్ల ఫైర్ ఆఫీసర్ శివారెడ్డి సంఘటనాస్థలానికి వెళ్లారు. నందిగామ నుంచి, కీసర టోల్‌గేట్ నుంచి రెండు ఫైరింజన్లు వచ్చాయి. నీటితో పాటు ఫోమ్ వెదజల్లటంతో గంటలోపే మంటలు అదుపులోకి వచ్చాయి. ఈలోగా ప్రయాణికులు వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఒక లాప్‌ట్యాప్, ఫోన్ మాత్రం కాలిపోయాయి.
షార్ట్ సర్క్యూటా లేదా ఇంజన్‌లో సమస్యా..?
ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజన్ నుంచి పొగలు, మంటలు వచ్చాయని డ్రైవర్ చంద్రమౌళి చెబుతున్నాడు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల మంటలు వచ్చి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రవాణా, పోలీస్ అధికారులు సైతం ప్రమాద కారణాలను చెప్పలేకపోతున్నారు. ఈ బస్సు కేవలం 15 రోజుల క్రితమే గుంటూరులో బ్రేక్ చేయించారు. ఫిట్‌నెస్ బాగానే ఉంది. నిపుణులను పంపాలని బస్సు తయారు చేసిన స్కానియా కంపెనీకి అధికారులు లేఖ రాశారు.
నాగాలాండ్‌లోనే రిజిస్ర్టేషన్
ఈ బస్సు నాగాలాండ్‌లోనే రిజిస్ర్టేషన్ అయినట్టుగా రవాణాశాఖ అధికారి ప్రవీణ్ ధ్రువీకరించారు. తక్కువ పన్నులు ఉండటం వల్ల అక్కడ రిజిస్ర్టేషన్ చేయించుకుంటారు. ఈ క్రమంలో ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేకుండానే రిజిస్ర్టేషన్ చేశారా? అన్నది తేలాల్సి ఉంది. కాగా, ప్రమాద కారణాలు తెలుసుకోవడానికి అగ్నిమాపక శాఖతో పాటు ఫోరెన్సిక్ బృందం కూడా రంగంలోకి దిగింది. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్ సీఐ చవాన్, ఎస్‌ఐ విశ్వనాథ్, నందిగామ ఎంవీఐ పూర్ణిమ తదితర అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి.
మంటలను గమనించి బస్సు ఆపాను : డ్రైవర్ చంద్రమౌళి
బస్సు వెనుక భాగం నుంచి పొగలు, మంటలు రావటాన్ని సైడ్ మిర్రర్ ద్వారా గమనించాను. వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశాను. ప్రయాణికులు అందరూ సురక్షితంగా దిగారు. లగేజీ కూడా భద్రంగా ఉంది. క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయని అనుకుంటున్నాను.
బస్సు ఆపటం వల్ల బతికాం : ప్రయాణికుడు
విజయవాడ వెళ్లేందుకు ఈ బస్సు ఎక్కాను. ఉదయం 5.30 గంటల సమయంలో శబ్ధం వస్తుందంటూ డ్రైవర్ బస్సును ఆపాడు. బస్సు లోపలికి పొగలు వస్తున్నాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు అందరూ కిందకు దిగారు. కొద్దిగా లగేజీ తప్ప ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. డ్రైవర్ బస్సును ఆపటం వల్లే బతికి బయటపడ్డాం.
డ్రైవర్ చంద్రమౌళికి సత్కారం
కంచికచర్ల, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : బస్సు ప్రమాదంలో ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన డ్రైవర్ మామిడాల చంద్రమౌళిని అందరూ అభినందిస్తున్నారు. బస్సు వెనుక భాగం నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన చంద్రమౌళి వెంటనే అప్రమత్తమై బస్సును ఆపి, నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులను లేపి, హుటాహుటిన సురక్షితంగా కిందకు దించారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే కాకుండా, లగేజీ మొత్తాన్ని భద్రంగా బయటకు తీశారు. సకాలంలో సమయస్ఫూర్తితో స్పందించి 39 ప్రయాణికుల ప్రాణాలను, లగేజీని కాపాడిన చంద్రమౌళిని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, రూరల్ డీసీసీ బి.లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీసీ ఏబీజీ తిలక్ ప్రత్యేకంగా అభినందించారు. చంద్రమౌళిని నందిగామ రూరల్ సీఐ డి.చవాన్, కంచికచర్ల ఎస్‌ఐ పి.విశ్వనాథ్, ఎస్‌ఐ-2 జి.నాని నరేంద్ర సత్కరించారు.