కృష్ణా బోర్డు భేటీ మళ్లీ వాయిదా
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:59 AM
కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తీరుపై ఆంధ్రప్రదేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. శ్రీశైలం జలాశయం ఎండిపోతోందని.. తక్షణం తాగునీటి అవసరాలకు రెండు రాష్ట్రాలకు కేటాయింపులు జరపాలని మొత్తుకుంటున్నా..
తెలంగాణ కార్యదర్శికి సుస్తీ చేసిందంటూ అర్ధంతరంగా ఐదో తేదీకి మార్పు
శ్రీశైలం ఎండేదాకా సమావేశం జరగదా?
ఉన్న నీరంతా తోడేస్తున్న తెలంగాణ
అత్యవసర భేటీకి ఆంధ్రప్రదేశ్ పట్టు
తొలుత 26.. తర్వాత 27.. తాజాగా 5వ తేదీ
వాయిదాలు వేస్తూ పోతున్న కేఆర్ఎంబీ
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తీరుపై ఆంధ్రప్రదేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. శ్రీశైలం జలాశయం ఎండిపోతోందని.. తక్షణం తాగునీటి అవసరాలకు రెండు రాష్ట్రాలకు కేటాయింపులు జరపాలని మొత్తుకుంటున్నా.. బోర్డు సమావేశాలు వాయిదా వేస్తూ పోతుండడంపై ఆగ్రహంగా ఉంది. ‘తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్‌కు సుస్తీ చేసింది. అందువల్ల బోర్డు భేటీని వచ్చే నెల ఐదో తేదీకి వాయిదా వేశాం’ అని రాష్ట్ర జల వనరుల శాఖకు కేఆర్ఎంబీ ఫోన్లో సమాచారం ఇచ్చింది. ఎల్‌నినో ప్రభావంతో శ్రీశైలం జలాయానికి ఎగువ నుంచి కృష్ణా జలాలు రాలేదని.. తెలంగాణ 800 అడుగుల నుంచే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు నీరు తీసుకుంటోందని..
అలాగే ఎడాపెడా జల విద్యుదుత్పత్తికి నీళ్లు తోడేస్తోందని.. దీనిని అడ్డుకోవాలని ఏపీ కోరుతున్నా బోర్డు చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం శ్రీశైల జలాశయంలో నిల్వలు 53 టీఎంసీలకు చేరుకున్నాయని.. తెలంగాణ తీరుతో త్వరలో డెడ్‌స్టోరేజీకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉందని.. వచ్చే ఏడాది ఏప్రిల్ దాకా తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను పొదుపుగా వాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేక కార్యాచరణ తాము అమలు చేస్తుంటే.. తెలంగాణ అడ్డగోలుగా కృష్ణా జలాలను తరలించుకుపోతూ.. సాగుకు కూడా నీరిందిస్తోందని.. దీనిపై చర్చించడానికి తక్షణమే కేఆర్ఎంబీ సమావేశాన్ని నిర్వహించాలని ఈ నెల 4వ తేదీన బోర్డు కార్యదర్శికి ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక సీఎస్ శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. దీంతో సోమవారం (26న) సమావేశం ఏర్పాటు చేస్తామని బోర్డు పేర్కొంది.
అయితే సోమవారం మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ కానున్నందున.. నవంబరు 2కి వాయిదా వేస్తున్నట్లు ఏపీకి సమాచారం ఇచ్చింది. దీనిపై రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. భేటీని మంగళవారాని(27)కి వాయిదా వేసింది. జల వనరుల శాఖ కర్నూలు విభాగం సీఈ కబీర్‌బాషా సోమవారమే హైదరాబాద్‌కు బయల్దేరారు. ఆయన మార్గమధ్యంలో ఉండగానే..
తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్‌కు ఆరోగ్యం బాగోనందున సమావేశాన్ని వచ్చే నెల ఐదో తేదీకి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా కేఆర్ఎంబీ నింపాదిగా సమాచారం ఇచ్చింది. బోర్డు నిర్ణయాలు తీసుకోకుండా సమావేశాన్ని ఉన్నపళంగా వాయిదాలు వేసుకుంటూ పోవడమేమిటని ఏపీ అసహనం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ఇదే తరహాలో జలాలు తోడేస్తే శ్రీశైలం నిల్వలు 834 అడుగుల దిగువకు పడిపోతే.. తమకు ఒక చుక్క కూడా దక్కదని.. ఆ తర్వాత సమావేశం నిర్వహించి కేటాయింపులు జరిపినా నిష్ప్రయోజనమేనని అంటోంది.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్